అలర్ట్
ఇటీవల కోల్‌కతాలోని ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్‌లో అత్యంత అమానుషంగా హత్యాచారానికి గురైన మహిళా డాక్టర్ ఘటన పై దేశవ్యాప్తంగా చాలామంది స్పందిస్తున్నారు. ఎంతోమంది నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు మాత్రమే కాకుండా సమాజం కూడా ఇటువంటి ఘటనలపై స్పందించడం చాలా అవసరం. అయితే ఇలాంటి అంశాలపై స్పందించేటప్పుడు బాధితురాలి గుర్తింపు బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సెక్షన్ 72, భారతీయ న్యాయ సంహిత (228 ఏ, ఐ.పీ.సీ) ప్రకారం అత్యాచారానికి గురైన బాధితురాలి వివరాలను బహిర్గతం చేసిన వారికి రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది.
కోల్‌కతా హత్యాచార బాధితురాలి ఫోటోలు, పేరు, ఇతర వివరాలు అన్నీ సామాజిక మాధ్యమాలలో చాలామంది బహిర్గతం చేస్తున్నారు. అంతేకాక రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు ఇటీవల ఒక న్యాయవాదుల సంఘం నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనలో సైతం బాధితురాలి పేరుని బ్యానర్లలో ముద్రించి మరీ ప్రదర్శించడం, అందులో చాలామంది మహిళా న్యాయవాదులు కూడా ఉండడం బాధాకరం. అది కోర్టు ధిక్కరణ కూడా. ఈనెల 16వ తేదీన కలకత్తా హైకోర్టు బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడానికి వీలులేదు అని స్పష్టం చేసింది. 20న సుప్రీంకోర్టు చేపట్టిన విచారణలో సైతం బాధితురాలి వివరాలను బహిర్గతం చేయడంపై ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలా ఎవరూ చేయడానికి వీల్లేదని ఆదేశించారు.
పోక్సో చట్టం సైతం బాధిత–బాలుర వివరాలను గోప్యంగా ఉంచాలి అని చెబుతుంది. సంచలనం సృష్టించిన ‘కఠువా గ్యాంగ్ రేప్ – హత్య’ కేసులో ఆ నిబంధనను అతిక్రమించిన పలు మీడియా సంస్థల మీద కూడా గతంలో ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, సదరు వార్తలను ఉపసంహరించుకోవాలి అని ఆదేశిస్తూ భారీ జరిమానాలు కూడా విధించింది. లైంగిక దాడికి గురైన బాధితురాలు లిఖిత పూర్వకంగా తన అంగీకారాన్ని తెలిపితే తప్ప, బాధితురాలి వివరాలను బహిర్గతం చేయకూడదు. బాధితురాలు ఒకవేళ మరణించినా లేదా ఆమెకు మతిస్థిమితం లేకున్నా కూడా ఆమె వివరాలు బహిర్గతం చేయడానికి వీలు లేదు. ప్రత్యేక కారణాలు చూపిస్తూ, కుటుంబ సభ్యులు న్యాయస్థానం ముందు దరఖాస్తు చేస్తే, కేవలం కోర్టు మాత్రమే అలాంటి అనుమతిని ఇవ్వాలి అని చట్టం చెబుతోంది. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
Comments
Please login to add a commentAdd a comment