వీటిని ట్యాంపర్ చెయ్యెచ్చని గతంలో చంద్రబాబూ చెప్పారు
ఆయన సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణప్రసాద్ చేసి చూపించారు
గతంలో చేసిన వ్యాఖ్యలపై బాబు తన వైఖరి చెప్పాలి
ప్రజా సంఘాల డిమాండ్
సాక్షి, అమరావతి: ఏపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం స్పందించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈవీఎంల పనితీరుపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. విజయవాడలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు శుక్రవారం మాట్లాడుతూ.. ఈవీఎంల పనితీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించాలన్నారు.
గతంలో ఆయన ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వ్యక్తంచేశారని, ఈవీఎం చిప్‌లను ట్యాంపరింగ్ చేసి ప్రజా తీర్పును మార్చి వెయొ్యచ్చని.. అలాగే, ప్రపంచంలో ఎక్కడా ఈవీఎంలను ఉపయోగించడంలేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కృష్ణంరాజు గుర్తుచేశారు. ఇప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో చంద్రబాబు సాంకేతిక సలహాదారుడిగా పనిచేసిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ తన అమెరికన్ మిత్రులు అలెక్స్ హాల్దార్ మెన్, రాస్‌గోమ్ గ్రీస్ సహకారంతో ఎన్నికల సంఘం నుంచి దొంగిలించిన ఈవీఎంను బహిరంగంగానే హ్యాక్‌చేసి చూపించారన్నారు. ఈవీఎం దొంగతనం ఆరోపణపై హరికృష్ణ ప్రసాద్ అరెస్టు కూడా అయ్యారన్నారు. ప్రజాతీర్పు ఏకపక్షంగా, మెజార్టీలు అత్యధికంగా ఉండటంతో ప్రజల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
బాబు విదేశీ పర్యటనపై అనుమానాలు..
బెటర్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ సునీత లక్కంరాజు మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూముల్లో ఉన్న అన్ని ఈవీఎంలను ఒకేసారి హ్యాక్ చేయవచ్చునని కూడా హరికృష్ణ ప్రసాద్ చెప్పారన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు విదేశీ పర్యటనలపై కూడా ప్రజలకు అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆంధ్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ బి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వకపోతే తమ వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పౌర సంఘాల ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment