ఇరుపార్టీలకు అంతుచిక్కని ఓటర్ల తీర్పు
ఎవరికి వారు గెలుస్తామనే ధీమా, విశ్వాసం
విజేతలకు సైతం భారీ మెజారీ్టపై లోపించిన అంచనా
ఓటర్ల తీర్పుపై సమీక్షలు
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాతీర్పు ఊహించని పరిణామంగా నిలిచింది. ఆయా అభ్యర్థులు గెలుపుపై విశ్వాసం, ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఈ స్థాయిలో ఓటమి చవిచూస్తామని లేదా ఆ స్థాయి మెజార్టీ సొంతం చేసుకుంటామని ఎవ్వరు కూడా అంచనాకు రాలేదు. ఎవ్వరికీ కూడా ప్రజానాడి అంతుచిక్కలేదు. తుదకు జిల్లాలోని రాజకీయ విశ్లేషకులు సైతం అనూహ్య పరిణామాన్ని అంచనా వేయలేకపోయారు. అంతెందుకు విజేతలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెరసి ఓటర్ల తీర్పుపై సమీక్ష చేసుకుంటున్నారు.
ఉమ్మడి కడప జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోట. 2014, 19 సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఏనోట విన్నా మరోమారు జిల్లాలో వైఎస్సార్‌సీపీ సత్తా చాటుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం అదే అంచనాతో ఉండిపోయాయి. ఫలితాలు వచ్చే కొద్ది ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్‌సీపీ 3 సెగ్మెంట్లకు మాత్రమే పరిమితమైంది. 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందనే ధీమా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం లేదని పలువురి అభిప్రాయం. ప్రస్తుతం అనూహ్య పరిణామాలపై ప్రజాతీర్పు పట్ల ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.
ధీమాకు మించిన విజయం...
ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి ఈమారు ఆ మూడు స్థానాల్లో గెలుస్తామనే ధీమాను టీడీపీ వ్యక్త పర్చేది. ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురంలో విజయం సాధిస్తామని ఆశించేవారు. ఎన్నికల గడువు సమీపించే కొద్ది ఆ ధీమా సైతం సడలిపోయింది. మరోమారు ఓటమి చవిచూస్తామనే బెంగ కూడా ఆ పారీ్టలో లేకపోలేదు. పోలింగ్ ముగిశాక అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు చెప్పినా, ఉండవయ్యా గెలుపొందాక చూద్దామనేవారు. విజయం సాధిస్తాం, మెజార్టీ 5వేలు పైనా అటు ఇటుగా ఉంటుందని చెప్పేవారు. అలాంటి పరిస్థితి ఉండగా ఫలితాల్లో ఊహించని మెజారీ్టని సొంతం చేసుకున్నారు. ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు అస్సలు పసిగట్టలేదు. భారీగా అనుకూలత ఉందని టీడీపీ అభ్యర్థులు కూడా అంచనాకు రాలేదు. అభ్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ తీర్పు రావడం విశేష పరిణామం.
రాయచోటిలో అనూహ్య తీర్పు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటి జిల్లా కేంద్రమైంది. విశేష అభివృద్ధి సాధించింది. తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించింది. అన్ని రంగాల్లో రాయచోటి దూసుకుపోయింది. మరోవైపు ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతం. తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తులతో పాటు గుర్తింపు పొందిన ఓ స్థాయి నేతలు పార్టీ ఫిరాయించారు. ఇలాంటి అనుకూలతలన్నీ ఉన్నప్పటికీ రాయచోటిలో టీడీపీ విజయాన్ని దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే రాయచోటిలో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని 10కి 7 ఇస్తే చాలంటూ పెద్ద ఎత్తున జిల్లాలో పందేలు నడిచాయి. అంటే రాయచోటి మీద జిల్లా వ్యాప్తంగా అంచనా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పులివెందుల, బద్వేల్, రాయచోటిలో వైఎస్సార్‌సీపీ ఏకపక్షమే అన్నంత విశ్వాసం ఉండేది. అలాంటి చోట కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఊహించని పరిణామంపై వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో çసమీక్షిస్తుండగా, ఆ స్థాయి మెజార్టీ దక్కడానికి కారణాల అన్వేషణలో టీడీపీ విజయసారథులుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment