మరణభయం పోవాలంటే..? | Sri Ganapati Satchidanandaswamy's Inspirational Story On The Fear Of Death | Sakshi
Sakshi News home page

మరణభయం పోవాలంటే..?

Published Thu, Jul 4 2024 9:00 AM | Last Updated on Thu, Jul 4 2024 9:00 AM

Sri Ganapati Satchidanandaswamy's Inspirational Story On The Fear Of Death

చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు మార్పు. శైశవం వదలి బాల్యంలోకి, బాల్యం వదలి యవ్వనంలోకి, అత్యంత ప్రియమైన యవ్వనం నుంచి ముసలి తనానికి ఈ మార్పు కారణం అవుతుంది. చివరగా ముసలితనం మరణానికి దారితీస్తుంది.

రాత్రి... గడచిపోయి సూర్యోదయానికి స్వాగతం పలుకుతుంది. ఉదయం గడచి మధ్యాహ్నానికి అవకాశమిస్తుంది. అదే విధముగా రాత్రి ప్రారంభం కాగానే మధ్యాహ్నం పోతుంది. ప్రకృతి తిరుగులేని  నియమాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఆ నియమం అనుసరించి జన్మించిన ప్రతి జీవీ మరణించవలసిందే. అలాగే మరణించిన ప్రతి జీవీ తిరిగి జన్మించవలసిందే. ఈ విçషయాన్ని సరిగా అవగాహన చేసుకుంటే మరణం వల్ల భయం కలుగదు. ఈ భయ నివారణకు తిరిగి జన్మించకుండా ఉండటమే సరైన మార్గం. జననమే లేనప్పుడు మరణించే ప్రసక్తే ఉండదు కదా!

ఎంతకాలం ‘ఈ దేహమే నేను’ అనే దేహాత్మ భావన ఉంటుందో అంతవరకు మరణ తప్పదు. ఏ క్షణం శారీరక స్పృహను దాటుతామో, అప్పుడే మనం నాశ రహితులం అవుతాం. పుట్టిన ప్రతి జీవీ గిట్టకతప్పదని తెలిసినా ఎవరికి వారు తమకు మరణం లేదని అనుకొంటూ ఉండటమే ఆశ్చర్య కరమైన విషయం అని ధర్మరాజు మహాభారతంలో ఒకచోట అంటాడు. ఇది ఆలోచించదగిన విషయం.

ఒకానొక సందర్భంలో ఓ యక్షుడు ధర్మరాజును  అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది? (కిం ఆశ్చర్యం?) అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు ధర్మరాజు ‘ప్రతి క్షణం లెక్కలేనన్ని జీవులు యముని (మృత్యుదేవత) రాజ్యాన్ని చేరుకొంటున్నాయి. అయినప్పటికీ జీవించి ఉన్నవారు మాత్రం తమకు మరణం ఉన్నదని తెలిసీ లేనివారివలె జీవిస్తారు’ అని సమాధానం ఇస్తాడు. మానవుని జీవితం క్షణభంగురం. మరణం అనివార్యం. కాబట్టి మానవులందరూ ప్రతిక్షణాన్నీ సద్వినియోగపరచుకోవాలి. కాలం గడచిన పిమ్మట గతంలోకి తొంగిచూచుకొని ‘అయ్యో! నేను కాలాన్ని సద్వినియోగపరచుకొనలేకపోయాన’ని బాధపడటానికి ఎలాంటి అవకాశం లేకుండా జీవితాన్ని గడపాలి.

– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement