human life time
-
మరణభయం పోవాలంటే..?
చాలామంది ‘మరణం’ గూర్చి భయపడుతూ ఉంటారు. మరణ తత్త్వాన్ని అర్థం చేసుకోకపోవటమే ఈ భయానికి కారణం. మరణం అంటే శరీర సాధారణ స్థితిలో కలుగు మార్పు. శైశవం వదలి బాల్యంలోకి, బాల్యం వదలి యవ్వనంలోకి, అత్యంత ప్రియమైన యవ్వనం నుంచి ముసలి తనానికి ఈ మార్పు కారణం అవుతుంది. చివరగా ముసలితనం మరణానికి దారితీస్తుంది.రాత్రి... గడచిపోయి సూర్యోదయానికి స్వాగతం పలుకుతుంది. ఉదయం గడచి మధ్యాహ్నానికి అవకాశమిస్తుంది. అదే విధముగా రాత్రి ప్రారంభం కాగానే మధ్యాహ్నం పోతుంది. ప్రకృతి తిరుగులేని నియమాన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఆ నియమం అనుసరించి జన్మించిన ప్రతి జీవీ మరణించవలసిందే. అలాగే మరణించిన ప్రతి జీవీ తిరిగి జన్మించవలసిందే. ఈ విçషయాన్ని సరిగా అవగాహన చేసుకుంటే మరణం వల్ల భయం కలుగదు. ఈ భయ నివారణకు తిరిగి జన్మించకుండా ఉండటమే సరైన మార్గం. జననమే లేనప్పుడు మరణించే ప్రసక్తే ఉండదు కదా!ఎంతకాలం ‘ఈ దేహమే నేను’ అనే దేహాత్మ భావన ఉంటుందో అంతవరకు మరణ తప్పదు. ఏ క్షణం శారీరక స్పృహను దాటుతామో, అప్పుడే మనం నాశ రహితులం అవుతాం. పుట్టిన ప్రతి జీవీ గిట్టకతప్పదని తెలిసినా ఎవరికి వారు తమకు మరణం లేదని అనుకొంటూ ఉండటమే ఆశ్చర్య కరమైన విషయం అని ధర్మరాజు మహాభారతంలో ఒకచోట అంటాడు. ఇది ఆలోచించదగిన విషయం.ఒకానొక సందర్భంలో ఓ యక్షుడు ధర్మరాజును అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏది? (కిం ఆశ్చర్యం?) అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు ధర్మరాజు ‘ప్రతి క్షణం లెక్కలేనన్ని జీవులు యముని (మృత్యుదేవత) రాజ్యాన్ని చేరుకొంటున్నాయి. అయినప్పటికీ జీవించి ఉన్నవారు మాత్రం తమకు మరణం ఉన్నదని తెలిసీ లేనివారివలె జీవిస్తారు’ అని సమాధానం ఇస్తాడు. మానవుని జీవితం క్షణభంగురం. మరణం అనివార్యం. కాబట్టి మానవులందరూ ప్రతిక్షణాన్నీ సద్వినియోగపరచుకోవాలి. కాలం గడచిన పిమ్మట గతంలోకి తొంగిచూచుకొని ‘అయ్యో! నేను కాలాన్ని సద్వినియోగపరచుకొనలేకపోయాన’ని బాధపడటానికి ఎలాంటి అవకాశం లేకుండా జీవితాన్ని గడపాలి.– శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
వివేకం: భావోద్వేగాలే సుందరం!
భావానుభూతి మనిషి జీవితానికొక సుందర పార్శ్వం. అదే లేకపోతే జీవితం అందవిహీనమౌతుంది. కానీ ఏ విషయమైనా స్వాధీనంలో లేకపోతే ఉన్మాదానికి దారితీస్తుంది. ఇదే అసలు సమస్య. మీ భావోద్వేగం మీకనుగుణంగా ఉండాలంటే ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు? నాకు భావోద్వేగాల్ని వాంఛితాలు, అవాంఛితాలు అని వర్గీకరించాలని లేదు. అవి జీవితానికి ఎంతవరకు తోడ్పడుతాయన్నదే నేను చూస్తాను. మీ భావోద్వేగాలు మీ కుటుంబానికిగానీ, ఉద్యోగానికిగానీ, వ్యాపారానికిగానీ తోడ్పడుతున్నాయా? మీరెప్పుడూ కోపంతోనో, నిరాశా నిస్పృహలతోనో, ద్వేషంతోనో కలవరపడుతూ ఉంటే మీకు బాగుంటుందా? అలా కాకుండా, మీ భావోద్వేగాలు ఆనందంగా, ప్రేమమయంగా, దయాపూరితంగా ఉన్నాయనుకోండి. అవి మీకెంతో తోడ్పడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నేను నాకేది తోడ్పడుతుందో దాన్నే పట్టించుకుంటాను. మన జీవితానికే విధంగానూ సహకరించనిదాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? ప్రాణికోటిలో ప్రతి ఒక్కటీ తాను జీవించడానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. మరి మనిషికేమిటి సమస్య? ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. భావోద్వే గాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని ఎవరన్నా అంటే, వారే ఆ తర్వాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరక, మానసిక, భావోద్వేగ శక్తులన్నీ మీ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావొచ్చు. అదంతా మీరు వాటినుపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ శరీరాన్నీ, బుద్ధినీ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా భావిస్తారా లేక మీ అభ్యున్నతికి వాటిని నిచ్చెనమెట్లుగా మలుచుకుంటారా? ఈ మూడూ అవరోధాలైతే ఈ ప్రపంచంలో బతకడానికి ఈ మూడు ధర్మాలే కదా ఆధారం! కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత, మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేకపోవడమే సమస్య. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైంది. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికిగానీ, నియంత్రించడానికిగానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నమాట! మీ భావోద్వేగాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా ఉంటుంది. ఆలోచన శుష్కమైందీ, అనుభూతి రసవంతమైనదీ. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ భావోద్వేగాలు ఉండవు. ‘ఈయన భరించలేని వ్యక్తి’ అని తలచాక అతడి పట్ల మీలో కోమల భావోద్వేగాలు కలిగే అవకాశముంటుందా! సమస్య - పరిష్కారం ధ్యానం అంటే సమయాన్ని వృథా చేయడమా అనిపిస్తోంది. నాకు దానివల్ల ఏమీ లాభం కనబడటం లేదు. - పి.సంపత్‌కుమార్, వరంగల్ సద్గురు: మీరు ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన వదిలిపెట్టాలి. దాని మూలంగా మీకేమీ రానక్కరలేదు. మీకేమీ ఉపయోగం ఉండనవసరం లేదు. మీరు రోజూ కొంత సమయం వృథా చేయండి. అలా చేయడం నేర్చుకోండి, అది చాలు. దాని మూలంగా ఏదో కానక్కరలేదు. ధ్యానం చేయడం ద్వారా మీరేదో ఆరోగ్యంగా కానక్కరలేదు, మీకేదో జ్ఞానం రానక్కరలేదు, మీరేదో స్వర్గానికి పోనక్కరలేదు, అది కొంత సమయం వృథా చేయడమే అనుకోండి. ధ్యానం వల్ల మీకు కావలసినది అసలైనదైతే నాకు లాభమేమిటి, నాకు ఒరిగేదేమిటి అని లెక్కలు వేయకండి. మీరు ఈ లెక్కలేయడం ఆపేస్తే, 90 శాతం పని అయిపోయినట్లే. అంటే చివరి వరుసకు చేరినట్లే. ఒకసారి చివరి వరుసకు చేరారంటే ఇక అక్కడ మిమ్మల్ని మింగేసే పాములుండవు. మీరు దాటవలసినది, ఎక్కవలసినది ఒక్కొక్క మెట్టు మాత్రమే. సమయం వచ్చినప్పుడు అది కూడా దానంతట అదే జరిగిపోతుంది. -
మేలు చేయడం పుణ్యం... పీడించడం పాపం!
పద్యానవనం నీవు భుజింపుమా కడుపు నిండ, క్షుథార్తుల కింత పెట్టుమా! నీవు సుఖింపుమా, పరుల నీవలెనే మననీయుమా, మరే త్రోవల కడ్డురాకు, పెడత్రోవల కాలిడబోకు మిద్దియే జీవితమన్న, పంకిలము సేయకు స్వామి వర ప్రసాదమున్! మనిషి జీవితం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. జీవులలోకెల్లా ఉత్కృష్టమైంది మానవజన్మ అంటారు. మననిలా మనుషుల్లా పుట్టించినందుకు ఆ సృష్టికర్తకు కృతజ్ఙులమై ఉండి ఆయన కృషిని సార్థకం చేయాలి. అంటే ఏం చేయాలి? పెద్దగా ఏదేదో చేసేయాలేమో అని బెంబేలుపడి పోనవసరం లేదు. ఇంగ్లీషులో ‘లివ్ లెట్ లివ్’ అనే మాటుంది. అంటే, బతుకు బతకనివ్వు. ఇక్కడ కూడా, ‘నువు తిను, ఇతరుల్ని తిననియ్, నీలాగే సుఖపడనీయ్, ఎవరికీ అడ్డుపడకు, చెడుపోకడలు పోకు...’ అనే జీవిత కర్తవ్యాన్ని అందంగా చెప్పాడు తన రుబాయిల్లో పారశీక కవి ఉమర్ ఖయ్యామ్. దాన్ని భావానుకృతి రూపంలో ‘అమర్ ఖయామ్’గా తెలుగించారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. అలతి అలతి పదాలతో పద్యాన్ని పరువులెత్తించే మంత్రదండమేదో శాస్త్రి వద్ద ఉండి ఉంటుంది. బుద్ధుడి చరిత్ర రాసినా, పుష్ప విలాపం వినిపించినా, కుంతి కథ చెప్పినా... ఆయనది అదే ఒరవడి. ఆయన పద్యాల్లో అక్షర రమ్యతే కాకుండా అరటిపండు ఒలిచిపెట్టినట్టు భావం కూడా ఇట్టే అర్థమైపోతుంది. మచ్చుకు ఈ పద్యమే చూస్తే, ప్రతిపదార్థం విడదీసి భావం చెప్పనవసరం లేదు. దేవుడిచ్చిన వర ప్రసాదాన్ని బురదమయం చేయొద్దంటున్నాడు. అలా చేయొద్దంటే, ఏం చేయాలో క్లుప్తంగా చెబుతున్నాడు. ఇటువంటి వ్యక్తీకరణలు మన పురాణేతిహాసాల్లో తరచూ కనిపిస్తాయి. ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మమేది? అన్న ప్రశ్నకు మహాభారతంలో ఓ చక్కని పద్య రూపంలో సమాధానముంది. ‘...ఇతరులు మనకు ఏం చేయగూడదని కోరుకుంటామో, అవేవీ మనం ఇతరులకు చేయకూడదు’ అనే అద్భుతమైన సందేశాన్ని ‘ఒరులేయవి యొనరించిన...’అనే చిన్న పద్యంలో చెబుతాడు తిక్కన. వ్యాసుడు ఒక సందర్భంలో ఇదే మాట అత్యంత సంక్షిప్తంగా చెబుతాడు. ‘‘శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యధుక్తం గ్రన్థకోటిభిః...’’ కోటి గ్రంథాలకు సమానమైన భావాన్ని అర్ధ శ్లోకంలో చెబుతానంటాడు. అదేమంటే, ‘‘పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం’’. ఇతరులకు మేలు చేయడం పుణ్యం. ఇతరులను పీడించడం పాపం. చూశారా, సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే! - దిలీప్‌రెడ్డి