వివేకం: భావోద్వేగాలే సుందరం!
భావానుభూతి మనిషి జీవితానికొక సుందర పార్శ్వం. అదే లేకపోతే జీవితం అందవిహీనమౌతుంది. కానీ ఏ విషయమైనా స్వాధీనంలో లేకపోతే ఉన్మాదానికి దారితీస్తుంది. ఇదే అసలు సమస్య. మీ భావోద్వేగం మీకనుగుణంగా ఉండాలంటే ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు?
నాకు భావోద్వేగాల్ని వాంఛితాలు, అవాంఛితాలు అని వర్గీకరించాలని లేదు. అవి జీవితానికి ఎంతవరకు తోడ్పడుతాయన్నదే నేను చూస్తాను. మీ భావోద్వేగాలు మీ కుటుంబానికిగానీ, ఉద్యోగానికిగానీ, వ్యాపారానికిగానీ తోడ్పడుతున్నాయా? మీరెప్పుడూ కోపంతోనో, నిరాశా నిస్పృహలతోనో, ద్వేషంతోనో కలవరపడుతూ ఉంటే మీకు బాగుంటుందా? అలా కాకుండా, మీ భావోద్వేగాలు ఆనందంగా, ప్రేమమయంగా, దయాపూరితంగా ఉన్నాయనుకోండి. అవి మీకెంతో తోడ్పడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నేను నాకేది తోడ్పడుతుందో దాన్నే పట్టించుకుంటాను. మన జీవితానికే విధంగానూ సహకరించనిదాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? ప్రాణికోటిలో ప్రతి ఒక్కటీ తాను జీవించడానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. మరి మనిషికేమిటి సమస్య?
ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. భావోద్వే గాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని ఎవరన్నా అంటే, వారే ఆ తర్వాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరక, మానసిక, భావోద్వేగ శక్తులన్నీ మీ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావొచ్చు. అదంతా మీరు వాటినుపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ శరీరాన్నీ, బుద్ధినీ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా భావిస్తారా లేక మీ అభ్యున్నతికి వాటిని నిచ్చెనమెట్లుగా మలుచుకుంటారా? ఈ మూడూ అవరోధాలైతే ఈ ప్రపంచంలో బతకడానికి ఈ మూడు ధర్మాలే కదా ఆధారం!
కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత, మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేకపోవడమే సమస్య. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైంది. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికిగానీ, నియంత్రించడానికిగానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నమాట!
మీ భావోద్వేగాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా ఉంటుంది. ఆలోచన శుష్కమైందీ, అనుభూతి రసవంతమైనదీ. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ భావోద్వేగాలు ఉండవు. ‘ఈయన భరించలేని వ్యక్తి’ అని తలచాక అతడి పట్ల మీలో కోమల భావోద్వేగాలు కలిగే అవకాశముంటుందా!
సమస్య - పరిష్కారం
ధ్యానం అంటే సమయాన్ని వృథా చేయడమా అనిపిస్తోంది. నాకు దానివల్ల ఏమీ లాభం కనబడటం లేదు.
- పి.సంపత్‌కుమార్, వరంగల్
సద్గురు: మీరు ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన వదిలిపెట్టాలి. దాని మూలంగా మీకేమీ రానక్కరలేదు. మీకేమీ ఉపయోగం ఉండనవసరం లేదు. మీరు రోజూ కొంత సమయం వృథా చేయండి. అలా చేయడం నేర్చుకోండి, అది చాలు. దాని మూలంగా ఏదో కానక్కరలేదు. ధ్యానం చేయడం ద్వారా మీరేదో ఆరోగ్యంగా కానక్కరలేదు, మీకేదో జ్ఞానం రానక్కరలేదు, మీరేదో స్వర్గానికి పోనక్కరలేదు, అది కొంత సమయం వృథా చేయడమే అనుకోండి.
ధ్యానం వల్ల మీకు కావలసినది అసలైనదైతే నాకు లాభమేమిటి, నాకు ఒరిగేదేమిటి అని లెక్కలు వేయకండి. మీరు ఈ లెక్కలేయడం ఆపేస్తే, 90 శాతం పని అయిపోయినట్లే. అంటే చివరి వరుసకు చేరినట్లే. ఒకసారి చివరి వరుసకు చేరారంటే ఇక అక్కడ మిమ్మల్ని మింగేసే పాములుండవు. మీరు దాటవలసినది, ఎక్కవలసినది ఒక్కొక్క మెట్టు మాత్రమే. సమయం వచ్చినప్పుడు అది కూడా దానంతట అదే జరిగిపోతుంది.