human emotions
-
ఏడుపు కూడా మంచిదే, లేదంటే గుండెపోటు వస్తుంది
మనుషులు ఏడవ లేక పోవటం వల్ల నవ్వుతారు అంటాడు జార్జ్ బెర్నార్డ్ షా. నిజమే కదా! పిల్లలు కింద పడి దెబ్బతగిలితే ఏడుస్తారు. పెద్దవాళ్ళకి ఆ ధైర్యం ఉండదు. పైకి ఏడవరు. ఎవరు ఏమనుకుంటారో అని సంకోచం. ఇతరుల అభిప్రాయాల కోసం బతకటం అలవాటు అవుతుంది ఎదుగుతున్న కొద్దీ. చిన్న పిల్లలకి ఆ బాధ లేదు. తమ నొప్పి మాత్రమే వాళ్ళకి ప్రధానం. భావాలని దాచుకోవటం తెలియదు. అవసరం లేదు. బాల్యావస్థ దాటి ఎదుగుతున్న కొద్దీ ఇతరులు తనని గురించి ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాధాన్యం ఇవ్వటం ఎక్కువ అవుతూ ఉంటుంది. తన ప్రవర్తన మార్చుకునే ఉద్దేశం ఉండదు గాని, అందరు తనని గొప్పవాడుగా భావించాలనే తపన ఉంటుంది. దాని కోసమే నటించటం. ఏడుపు వచ్చినా దాన్ని అదుపులో పెట్టి, బాధాప్రకటనకి ఒక మాధ్యమం కావాలి కనుక ఏడుపునే నవ్వుగా మార్చటం జరుగుతుంది. తెలివితేటలు పెరుగుతున్న కొద్దీ ఆ సంఘటనకి రకరకాల చిలవలు పలవలు చేర్చటం కూడా చూస్తాం. తాను కావాలనే పడినట్టు చెప్పటమో, అదే బండి అయితే అది బాగుండ లేదనో, బాగు చేయటానికి ఇస్తే సరిగ్గా చేశారో లేదోనని పరీక్ష చేయబోయాననో చెపుతూ ఉంటారు. ‘‘అసలు దెబ్బ తగలనే లేదు’’, ‘‘ఇట్లాంటివి ఎన్ని చూశాం? ఇదొక లెక్కా?’’ వంటి వ్యాఖ్యానాలు విషయాన్ని తేలిక చేయటానికి చెప్పినా చెప్పకపోతేనే మర్యాదగా ఉండేది అనిపిస్తుంది. ఇది నేలమీద పడటం అన్నదానికి సంబంధించింది మాత్రమే కాదు. అన్ని విషయాలకి వర్తిస్తుంది. ఆర్థికంగా కాని, వ్యాపారపరంగా కాని, ఉద్యోగపరంగా కాని, కుటుంబపరంగా కాని, మరేదైనా కాని, దెబ్బ తగిలినప్పుడు గుట్టుగా ఉండటం మంచిదే కాని, అదేదో ఘనతగా చెప్పుకోవటం హర్షణీయం కాదు. ఏడిస్తే చూసి సంతోషించేవారు, ఓదార్చి తృప్తిపడే వారు ఉంటారు. మరింత నైతిక ధైర్యాన్ని దిగజార్చే వారూ ఉంటారు. కనుక బాధ పడుతున్నట్టు చెప్పకూడదు. అసలు విషయం ఏమంటే బాధపడకూడదు. పైకి నవ్వేసి లోపల బాధతో కుమిలి పోవటం మంచిది కాదు. ప్రస్తుతం మనం సమకాలిక సమాజాన్ని గమనించినట్టయితే చాలా మంది మనుషులు నవ్వుతూ కనపడటం ఏడవ లేక మాత్రమే అని అర్థం అవుతుంది. ఆ నవ్వులలో ఏ మాత్రం స్వచ్ఛత కనపడదు. లోపల ఉన్న బాధని, దుఃఖాన్ని, కష్టాలని, దిగులుని, నిరాశా నిస్పృహలని తెచ్చిపెట్టుకున్న నవ్వు వెనక దాచి కనపడతారు. ఆ నవ్వుల్లో జీవం ఉండదు. సహజత్వం ఉండదు. నవ్వు ఒక ముసుగు. నటులు ముఖానికి వేసుకున్న రంగు లాంటిది. మనోభావాలని యథేచ్ఛగా ప్రకటించ కలిగితే, కనీసం ఆత్మీయుల ముందు గుండెల్లో ఉన్న బరువు తగ్గుతుంది. తరువాత హాయిగా నవ్వగలుగుతాం. ఏడవటం తప్పు కాదే! మనిషికి సహజంగా ఉన్న లక్షణం. ఒకరు బాగుపడుతుంటే చూసి ఏడవటం తప్పు కాని, కష్టం వచ్చినప్పుడు ఏడవటం మానవ సహజం. శ్రీరామచంద్రుడంతటి వాడే తండ్రి మరణవార్త విని భోరున విలపించాడు. అది మానవత్వం. బాధ కలిగినప్పుడు ఏడిచి మనసులో ఉన్న బాధని బయటికి వెళ్ళగక్కకపోతే ఎన్నోరకాల అనారోగ్యాలు వస్తాయి. గుండె బరువుని తగ్గించి తేలిక పరచకపోతే అది గుండెపోటు, రక్తపోటు, మధుమేహం మొదలైన రూపాంతరాలు చెందుతుంది. నవ్వు ముఖకండరాలకి మంచి వ్యాయామం. శరీరానికి ఆరోగ్యం. మనస్సుకి రసాయనం ఎదుటివారికి ఆహ్లాదం. అట్లా ఉండాలంటే ఏడవలేక నవ్వకూడదు. ఆనందంతో నవ్వాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
నాచన స్థానము
కడపలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ప్రచురించిన ‘నాచన సోముడు’, ఈ ప్రాచీన తెలుగు కవి ‘ఉత్తర హరివంశం’ కావ్యంలోని నానాముఖాలపై రాసిన ఎనిమిది వ్యాసాల సంకలనం. ప్రకాండ పండితులు నడకుదుటి వీరరాజు నూరేళ్ల క్రితమే నాచన సోముని కవితావైభవం గురించి విలువైన రచనలు చేశారు. సోమన్న పూర్వ, ఉత్తర హరివంశాలు రెంటినీ రచించారు. ప్రస్తుతం ఉత్తర హరివంశ మొక్కటే దొరుకుతున్నది. ఎర్రన, సోమన చదివిన సంస్కృత హరివంశం ప్రతులు భిన్నమైనవి. అందువల్లే ఇద్దరూ ఎన్నుకొన్న కథలు వేర్వేరుగా వున్నాయి. నాచన సోముని పక్షపాతి నడకుదుటి వారు. ‘గురువును మించిన శిష్యు’డు అని ప్రశంసించారు. నాచన సోముని భావనాశక్తినీ, లోకజ్ఞతనూ గొప్పగా మెచ్చుకున్నారు. ఎస్.వి.ఎన్.భాష్యకారాచార్యులు సోమన్న సంభాషణా చాతుర్యాన్నీ, సంస్కృతాంధ్ర పదబంధాన్నీ, అలంకార ప్రయోగాన్నీ బహుదా ప్రశంసించారు. విశ్వనాథ సత్యనారాయణ ‘నాచన సోమన– సంవిధాన చక్రవర్తి’ 39 పేజీల సుదీర్ఘ రచన. సోమన సీస పద్య రచనా కౌశలాన్నీ, ఉక్తి వైచిత్య్రాన్నీ, నుడికార ప్రయోగాన్నీ నవీన గుణాలుగా పేర్కొంటూ, ఆ మహాకవి శ్రీనాథుడు, ప్రబంధ కవులకు మార్గదర్శకుడైన విధానాన్ని తేటతెల్లం చేశారు. నాచన తన పాత్రల్లో సమకాలీన జనుల చిత్తవృత్తుల్ని చొప్పించి, పౌరాణిక పాత్రల్ని సమకాలీన పాత్రలుగా చిత్రించారని ఆరుద్ర అన్నారు. రాణీ హయగ్రీవ శర్మ, సోమన వస్తు చిత్రణా, వర్ణనా వైవిధ్యం వివరించారు. వేదుల కామేశ్వరరావు ‘నాచన సోముడు– ఎర్రన’ వ్యాసం, రాళ్లపల్లి వారి ‘నాచన సోముని నవీన గుణములు’లోని విషయాల్నే ప్రస్తావిస్తుంది. కొలకలూరి ఇనాక్ ‘నాచన సోముని కవితావైభవం’, ఎం.గోవిందస్వామి నాయుడు ‘నాచన సోముని శ్రీకృష్ణ పాత్ర చిత్రణ’ వ్యాసాలు సామాన్యంగా ఉన్నాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘నాచన సోముని నవీన గుణములు’, ‘ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమన కీయదగిన స్థానము’ వ్యాసాల్ని కూడా ఈ గ్రంథంలో చేర్చివుంటే పసిడికి పరిమళం అబ్బినట్లు అయివుండేది. -పినాకిని నాచన సోముడు (విమర్శా వ్యాసాలు); సంపాదకులు: డాక్టర్ మూల మల్లికార్జున రెడ్డి; పేజీలు: 140; వెల: 100; ప్రతులకు: సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప. ఫోన్: 08562–25517 -
కంగారు ఆభరణాలు
జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు’ అని పలికినాడు. చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. ఒకనాడుదయము జగజీవన్ లాల్ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱముల కోచి బండి నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱపు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్ లాల్ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్ నర్సాపూర్ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను. ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. అతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహారాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. అతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’. ‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి ప్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లిషు ఫ్యాషన్ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను. మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’ జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కానీ నేనింగ్లిషు యెడ్యుకేటెడ్ జంటిల్మన్ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడా తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’ జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’ జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’ జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను. ఇట్లు సిసలు పఱిచిన రవ్వలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె. ‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను. మిమ్ముల చూడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను. భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను. జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మరల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను. దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మకం లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని, సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను. పది గంటలాయెను. పదునొకండు గంటలాయెను. పండ్రెండు గంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు. పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి. ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనులాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో 1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు -
గుర్రాలకు మనుషుల ఎమోషన్స్ తెలుసు
న్యూయార్క్: గుర్రాలకు కూడా మనుషుల హావభావాలను గుర్తించే సామర్థ్యం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనుషుల్లోని ఆనందం, కోపాన్ని అవి పసిగట్టగలవని, అందుకు అనుకూలంగా ప్రవర్తించగలవని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ తెలిపింది. కోపంతో ఉన్న మనుషులను చూస్తే అవి ప్రతికూలంగా స్పందిస్తాయని కూడా అధ్యయనకారులు తెలిపారు. దాదాపు 28 దేశీయ గుర్రాలను తమ పరిశోధనకోసం తీసుకున్న అధ్యయనకారులు తమ చేతుల్లో కోపం, సంతోషంతో ఉన్న వ్యక్తుల ఫొటోలను పట్టుకొని వాటికి చూపించారు. వాటిని ఆ గుర్రాలు ఎడమ కంటితో చూడటం మొదలుపెట్టాయి. ఎడమ కన్ను అనేది జంతువుల్లో కుడి పక్కన ఉన్న మెదడు నియంత్రణ ద్వారా పనిచేస్తుంది. అయితే, నెగటివ్ షేడ్స్ను దానిలో ప్రతిబింబింప చేయడంలో కీలక పాత్ర పోషించేది కూడా కుడి మెదడే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కోపంతో ఉన్న మనుషులను గుర్రాలు గుర్తించి వారి విషయంలో నెగిటివ్గా స్పందిస్తాయని ఈ ఫొటోల ఆధారంగా అధ్యయనకారులు అంచనా వేశారు. ఇది ఏ జంతువులకు లేకుండా ఒక్క గుర్రానికి మాత్రమే ఉన్న అదనపు సామర్థ్యం అని కూడా వారు తెలిపారు. -
వివేకం: భావోద్వేగాలే సుందరం!
భావానుభూతి మనిషి జీవితానికొక సుందర పార్శ్వం. అదే లేకపోతే జీవితం అందవిహీనమౌతుంది. కానీ ఏ విషయమైనా స్వాధీనంలో లేకపోతే ఉన్మాదానికి దారితీస్తుంది. ఇదే అసలు సమస్య. మీ భావోద్వేగం మీకనుగుణంగా ఉండాలంటే ఏ విధంగా మలుచుకోవాలనుకుంటారు? నాకు భావోద్వేగాల్ని వాంఛితాలు, అవాంఛితాలు అని వర్గీకరించాలని లేదు. అవి జీవితానికి ఎంతవరకు తోడ్పడుతాయన్నదే నేను చూస్తాను. మీ భావోద్వేగాలు మీ కుటుంబానికిగానీ, ఉద్యోగానికిగానీ, వ్యాపారానికిగానీ తోడ్పడుతున్నాయా? మీరెప్పుడూ కోపంతోనో, నిరాశా నిస్పృహలతోనో, ద్వేషంతోనో కలవరపడుతూ ఉంటే మీకు బాగుంటుందా? అలా కాకుండా, మీ భావోద్వేగాలు ఆనందంగా, ప్రేమమయంగా, దయాపూరితంగా ఉన్నాయనుకోండి. అవి మీకెంతో తోడ్పడతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. నేను నాకేది తోడ్పడుతుందో దాన్నే పట్టించుకుంటాను. మన జీవితానికే విధంగానూ సహకరించనిదాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? ప్రాణికోటిలో ప్రతి ఒక్కటీ తాను జీవించడానికి ఏం చెయ్యాలో అదే చేస్తోంది. మరి మనిషికేమిటి సమస్య? ప్రతి మనిషిలోనూ భావోద్వేగాలుంటాయి. భావోద్వే గాలు ఆధ్యాత్మిక ఉన్నతికి ఆటంకమని ఎవరన్నా అంటే, వారే ఆ తర్వాత మీ శరీరం కూడా దానికి ఆటంకమంటారు. ఒక విధంగా చూస్తే అది కూడా నిజమే. మీ శారీరక, మానసిక, భావోద్వేగ శక్తులన్నీ మీ ఎదుగుదలకు ఇబ్బందిగా ఉండొచ్చు లేదా అవే మీ ఎదుగుదలకు సోపానాలు కూడా కావొచ్చు. అదంతా మీరు వాటినుపయోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఈ శరీరాన్నీ, బుద్ధినీ, మనసునీ మీ జీవితానికి అవరోధాలుగా భావిస్తారా లేక మీ అభ్యున్నతికి వాటిని నిచ్చెనమెట్లుగా మలుచుకుంటారా? ఈ మూడూ అవరోధాలైతే ఈ ప్రపంచంలో బతకడానికి ఈ మూడు ధర్మాలే కదా ఆధారం! కొన్ని లక్షల సంవత్సరాల పరిణామక్రమం తర్వాత, మన బుద్ధి ఈ స్థాయికి చేరింది. మరి ఇప్పుడు ఈ బుద్ధిని సమస్యగా భావించగలమా? బుద్ధి సమస్య కాదు. బుద్ధిని సరిగా వినియోగించలేకపోవడమే సమస్య. మానవ మేధ నిజంగా అత్యాశ్చర్యకరమైంది. కానీ ఈ అద్భుతమైన, ఆశ్చర్యకరమైన సాధనమే సమస్యగా మారింది. అంటే మీరు దాన్ని అర్థం చేసుకోవడానికిగానీ, నియంత్రించడానికిగానీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదన్నమాట! మీ భావోద్వేగాలు మీ ఆలోచనలకు విరుద్ధమైనవి కావు. మీ ఆలోచనా సరళిని బట్టే మీ అనుభూతి కూడా ఉంటుంది. ఆలోచన శుష్కమైందీ, అనుభూతి రసవంతమైనదీ. మీ ఆలోచనకు విరుద్ధంగా మీ భావోద్వేగాలు ఉండవు. ‘ఈయన భరించలేని వ్యక్తి’ అని తలచాక అతడి పట్ల మీలో కోమల భావోద్వేగాలు కలిగే అవకాశముంటుందా! సమస్య - పరిష్కారం ధ్యానం అంటే సమయాన్ని వృథా చేయడమా అనిపిస్తోంది. నాకు దానివల్ల ఏమీ లాభం కనబడటం లేదు. - పి.సంపత్కుమార్, వరంగల్ సద్గురు: మీరు ఈ ధ్యానం వల్ల ఉపయోగం ఏమిటి అన్న ఆలోచన వదిలిపెట్టాలి. దాని మూలంగా మీకేమీ రానక్కరలేదు. మీకేమీ ఉపయోగం ఉండనవసరం లేదు. మీరు రోజూ కొంత సమయం వృథా చేయండి. అలా చేయడం నేర్చుకోండి, అది చాలు. దాని మూలంగా ఏదో కానక్కరలేదు. ధ్యానం చేయడం ద్వారా మీరేదో ఆరోగ్యంగా కానక్కరలేదు, మీకేదో జ్ఞానం రానక్కరలేదు, మీరేదో స్వర్గానికి పోనక్కరలేదు, అది కొంత సమయం వృథా చేయడమే అనుకోండి. ధ్యానం వల్ల మీకు కావలసినది అసలైనదైతే నాకు లాభమేమిటి, నాకు ఒరిగేదేమిటి అని లెక్కలు వేయకండి. మీరు ఈ లెక్కలేయడం ఆపేస్తే, 90 శాతం పని అయిపోయినట్లే. అంటే చివరి వరుసకు చేరినట్లే. ఒకసారి చివరి వరుసకు చేరారంటే ఇక అక్కడ మిమ్మల్ని మింగేసే పాములుండవు. మీరు దాటవలసినది, ఎక్కవలసినది ఒక్కొక్క మెట్టు మాత్రమే. సమయం వచ్చినప్పుడు అది కూడా దానంతట అదే జరిగిపోతుంది.