గుర్రాలకు మనుషుల ఎమోషన్స్ తెలుసు
న్యూయార్క్: గుర్రాలకు కూడా మనుషుల హావభావాలను గుర్తించే సామర్థ్యం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. మనుషుల్లోని ఆనందం, కోపాన్ని అవి పసిగట్టగలవని, అందుకు అనుకూలంగా ప్రవర్తించగలవని యూనివర్సిటీ ఆఫ్ సస్సెక్స్ తెలిపింది. కోపంతో ఉన్న మనుషులను చూస్తే అవి ప్రతికూలంగా స్పందిస్తాయని కూడా అధ్యయనకారులు తెలిపారు. దాదాపు 28 దేశీయ గుర్రాలను తమ పరిశోధనకోసం తీసుకున్న అధ్యయనకారులు తమ చేతుల్లో కోపం, సంతోషంతో ఉన్న వ్యక్తుల ఫొటోలను పట్టుకొని వాటికి చూపించారు.
వాటిని ఆ గుర్రాలు ఎడమ కంటితో చూడటం మొదలుపెట్టాయి. ఎడమ కన్ను అనేది జంతువుల్లో కుడి పక్కన ఉన్న మెదడు నియంత్రణ ద్వారా పనిచేస్తుంది. అయితే, నెగటివ్ షేడ్స్ను దానిలో ప్రతిబింబింప చేయడంలో కీలక పాత్ర పోషించేది కూడా కుడి మెదడే కావడం విశేషం. ఈ నేపథ్యంలో కోపంతో ఉన్న మనుషులను గుర్రాలు గుర్తించి వారి విషయంలో నెగిటివ్గా స్పందిస్తాయని ఈ ఫొటోల ఆధారంగా అధ్యయనకారులు అంచనా వేశారు. ఇది ఏ జంతువులకు లేకుండా ఒక్క గుర్రానికి మాత్రమే ఉన్న అదనపు సామర్థ్యం అని కూడా వారు తెలిపారు.