దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది.
పశుగణన ఏం తేల్చిందంటే..
► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది.
► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్‌లో ఉండగా.. 11 శాతం గుజరాత్‌లో ఉన్నాయి.
► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది.
► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది.
► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది.
► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది.
► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది.
► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది.
తగ్గుదలకు కారణాలివీ..
► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది.
► రాజస్థాన్‌లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది.
► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు.
► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్‌లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది.
దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో)
ఏపీలో 15.79 శాతం వృద్ధి
రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది.
గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment