దేశాన్ని కమ్ముకొస్తున్న జనాభా సంక్షోభం
నానాటికీ తగ్గుతున్న జనాభా
ఊరందరిదీ ఒకదారి.. ఉలిపిరి కట్టెది ఇంకోదారి అన్నట్లుగా ఉంది ఈ దేశం పరిస్థితి. అత్యద్భుతంగా సాంకేతికతను అందిపుచ్చుకుని యూరోప్, అమెరికా దేశాలను దాటి ప్రగతిపథంలో సాగుతున్న దక్షిణ కొరియా జనభాపరంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో నానాటికీ జనాభా తగ్గుతూ వస్తున్నందున రానున్న కొన్ని దశాబ్దాల్లో ఆ దేశం జనంలేక నిర్జీవమై అంతరించిపోతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా గురజాడ చెప్పినట్లుగా దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనావంటి దేశాలు జనాభాని పెంచుకుంటూ పట్టణాలు.. పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి దేశమే అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.
పెళ్లి వద్దు.. కెరీర్ ముద్దు
దేశంలో యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సంప్రదాయం తగ్గిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ముందుగా కెరీర్లో స్థిరపడాలి.. ఉన్నత స్థితికి చేరాలి.. ఇల్లు.. కార్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి.. ఆ తరువాతనే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే భావనలో ఉండడంతో దేశంలో పెళ్లిళ్లు కూడా లేటుగా అవుతున్నాయి. పెళ్లి.. ఇల్లు పిల్లలు.. సంసారం గురించి పెద్దలు చెబుతున్నా వినే పరిస్థితుల్లో దేశంలోని మహిళలు లేరని సర్వేలు చెబుతున్నాయి. దీంతో శతాబ్ద కాలంలో దేశం 70 శాతం జనాభాను కోల్పోతుందని, జనాభాలో పునరుత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పడిపోతూ వస్తున్నదని, దేశంలో జననాల రేటు ఏటా 5,00,000 కన్నా అతక్కువగా నమోదవుతూ వస్తోంది.
ఇదిలా కొనసాగితే దేశ జనాభా కొన్ని దశాబ్దాల్లోనే ఐదున్నర కోట్ల నుంచి కోటిన్నరకు పడిపోతుందని, ఇది ఏకంగా దేశ మనుగడకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. దేశం జనాభాతో కళకళలాడుతూ పది కాలాలపాటు పచ్చగా ఉండాలంటే జననాల రేటు 2. 1 శాతంగా ఉండాలి కానీ ప్రస్తుతం అది 0. 72 శాతానికి పడిపోయింది. తద్వారా దేశంలో జననాల రేటుకన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు, పాట్టణాలు సందడి తగ్గిపోతూ వస్తున్నాయి.
ప్రభుత్వ నిర్ణయాలే కారణమా ?
1960 కాలంలో దేశం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఇంకా వర్థమానదేశంగానే ఉండేది. ఆ తరుణంలో దేశంలో జనాభా పెరిగితే దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకం అవుతుందని దేశంలో కుటుంబ నియంత్రణను అమలు చేశారు . పిల్లలను కనడం తగ్గించాలని, లేకుంటే మున్ముందు బతకడం కష్టం అవుతుందని చేసిన ప్రభుత్వ ప్రచారం ప్రజలమీద గట్టిగా పని చేసింది. దీంతో అప్పట్నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది. సరే మనం దేశ జనాభా తగ్గిస్తున్నాం అనుకుంటున్న పాలకులు ఆ నియంత్రణ ఏకంగా దేశాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాం అని గుర్తించలేకపోయారు. ఆ తగ్గుదల క్రమంగా అట్టడుగు స్థాయికి దిగిపోయింది. 1980 దశకంలోనే తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి, 52 మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా 17 మిలియన్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
దిద్దుబాటు చర్యలున్నా.. ఫలితం నిల్
పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ప్రభుత్వం మళ్ళీ జనాభాను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లల సంరక్షణలో సహాయం చేయడానికి విదేశీ ఆయాలను సైతం తెచ్చుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల పిల్లల పెంపకం అంటే భయపడుతున్న కొరియా యూత్ కు కాస్త ఉపయుక్తం అవుతుందని ప్రభుత్వం భావించింది. 30 ఏళ్లు నిండకముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపేయాలని కూడా భావిస్తోంది. ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం, వారి సంరక్షణ అనేది తమకు తలకు మించిన భారంగా ఉంటోందని భావించిన మహిళలు అసలు పెళ్లి వద్దనుకుంటున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపు 30 శాతం మంది మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో అభిప్రాయపడ్డారు.
సైన్యానికి యువకుల కొరత
దేశంలో జననాలు తగ్గిపోతుండడంతో దక్షిణ కొరియా సైన్యానికి యువకుల కొరత ఎదురవుతోంది. పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ దక్షిణ కొరియాకు 2017 లో 6. 2 లక్షలుగా ఉండే సైన్యం నేడు అయిదు లక్షలకు పడిపోయింది,. రానున్న అవసరాలమేరకు ఏటా రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా 1.25 లక్షలమంది యువకులు మాత్రమే అందుబాటులో ఉన్నారట. అదన్నమాట.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనంలేక మొత్తం దేశం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
-సిమ్మాదిరప్పన్న.
Comments
Please login to add a commentAdd a comment