cattles
-
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
అశ్వాలేవీ..? లొట్టిపిట్టలెక్కడ
దేశంలో మొత్తంగా పశు సంపద కొంతమేర పెరిగినా.. ఒంటెలు, గుర్రాల వంటి జంతువుల సంఖ్యలో 9 శాతం క్షీణత నమోదైంది. 2.90 లక్షల గుర్రాలు తగ్గిపోగా.. 1.50 లక్షల ఒంటెలు కనుమరుగయ్యాయి. గాడిదలు, పందుల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయింది. అయితే సంకర జాతి పశువుల సంఖ్య 26.9 శాతం పెరిగింది. దేశవ్యాప్తంగా 6.60 లక్షల గ్రామాలు.. 89 వేల పట్టణాల్లోని 27 కోట్లకు పైగా గృహాలు, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన 20వ పశుగణన నివేదిక ఈ విషయాల్ని తేటతెల్లం చేసింది. పశుగణన ఏం తేల్చిందంటే.. ► 2012 – 2019 మధ్య మొత్తం పశువుల జనాభాలో 4.6 శాతం పెరుగుదల నమోదైంది. ► దేశంలో ఒంటెలు 84 శాతం రాజస్థాన్‌లో ఉండగా.. 11 శాతం గుజరాత్లో ఉన్నాయి. ► 2012 నుంచి 2019 సంవత్సరం నాటికి దేశంలో ఒంటెల జనాభా 4 లక్షల నుంచి 2.5 లక్షలకు తగ్గింది. ► ఇక 2012 నుంచి 2019 మధ్య గుర్రాల సంఖ్య 6.3 లక్షల నుంచి 3.4 లక్షలకు తగ్గింది. ► ఇతర దేశాలకు చెందిన, సంకర జాతి పశువుల జనాభా 2012తో పోలిస్తే 2019లో 26.9 శాతం పెరిగింది. ► 2012తో పోలిస్తే దేశీయ (దేశవాళీ) పశువులలో 6 శాతం క్షీణత ఉంది. ► గత గణనతో పోలిస్తే.. 2019లో దేశంలో మొత్తం పౌల్ట్రీ 851.81 మిలియన్లకు చేరటం ద్వారా 16.8 శాతం వృద్ధి నమోదు చేసింది. ► 2012తో పోలిస్తే 2019 నాటికి దేశంలో పెరటి కోళ్ల పెంపకం 48.8 శాతం పెరిగి.. 317.07 మిలియన్లకు చేరింది. తగ్గుదలకు కారణాలివీ.. ► ఒంటెలు, గుర్రాల సంఖ్య తగ్గిపోవడానికి వ్యవసాయ రంగంలో వాటి వినియోగం తగ్గటమే కారణమని కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ► గతంలో రవాణాకు ఒంటెలను వినియోగించే వారు. ఇది క్రమంగా తగ్గుతోంది. ► రాజస్థాన్‌లో మేత భూములు తగ్గడంతో వాటి పెంపకం కష్టంగా మారింది. ► ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే గుర్రాల పోషణకు పెట్టుబడి ఎక్కువగా అవుతోంది. దీంతో వీటి పెంపకం ఆర్థికంగా సాధ్యం కావడం లేదు. ► దేశీయ గుర్రపు జాతులను ఎక్కువగా పోలీస్ సేవలు లేదా వినోదాల కోసమే ఉపయోగిస్తున్నారు. – గుర్రాల పెంపకానికి పేరొందిన గుజరాత్లో తప్ప ఇతర రాష్ట్రాల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ► అయితే ఒంటె జాతిని రక్షించడానికి రాజస్థాన్ ప్రభుత్వం ఒంటెను రాష్ట్ర జంతువుగా ప్రకటించి పలు రక్షణ చర్యలు చేపట్టింది. అలాగే గుజరాత్ ప్రభుత్వం వాటి రక్షణకు చర్యలు తీసుకుంది. కచ్ ప్రాంతంలో ఒంటె పాల సేకరణ, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దేశంలో పశు జనాభా ఇలా.. (మిలియన్లలో) ఏపీలో 15.79 శాతం వృద్ధి రాష్ట్రంలో పశు సంపదలో 15.79 శాతం వృద్ధి నమోదైంది. 2012 పశుగణనలో 2.94 కోట్ల పశు సంపద ఉండగా.. 2019 నాటికి 3.40 కోట్లకు పెరిగింది. పౌల్ట్రీ రంగంలోనూ భారీగా వృద్ధి నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 80.6 మిలియన్ పౌల్ట్రీ జనాభా ఉంటే.. 2019 గణన నాటికి 107.9 మిలియన్లకు చేరింది. అంటే 33.85 శాతం వృద్ధి నమోదైంది. గొర్రెల జనాభాలోనూ 30 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2012 గణన ప్రకారం రాష్ట్రంలో 13.6 మిలియన్లు గొర్రెలు ఉండగా.. 2019 నాటికి 17.60 మిలియన్లకు పెరిగాయి. అయితే గేదెల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. 2012లో 6.50 మిలియన్లు గేదెలుంటే.. 2019 నాటికి 6.20 మిలియన్లకు తగ్గాయి. – సాక్షి, అమరావతి -
తెలంగాణ సరిహద్దు వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్.. ఎందుకంటే?
జహీరాబాద్: పశువులకు వ్యాపిస్తున్న ముద్ద చర్మపు వ్యాధి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందు జ్రాగత్తగా అధికారులు కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని మాడ్గి శివారులో రాష్ట్ర సరిహద్దు వద్ద 65వ జాతీయ రహదారిపై ఆదివారం ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కలెక్టర్ శరత్ ఉత్తర్వులతో పోలీస్, పశు సంవర్థక, రవాణా శాఖల అధికారులు చెక్‌పోస్టు వద్ద సంయుక్తంగా పశువుల తనిఖీ నిర్వహిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి పశువులతో వస్తున్న వాహనాలను పరిశీలిస్తున్నారు. వ్యాధి లేనట్లు నిర్ధారణకు వచ్చాకే పశువులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఆదివారం గేదెలు, మేకలతో ఉన్న వాహనాలు 15 వచ్చాయని, వ్యాధులు ఉన్న పశువులు ఏవీ రాలేదని అధికారులు పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: నాడు కల్లోలం.. నేడు ప్రశాంతం) -
పాల ఉత్పత్తిలో ‘తడకనపల్లి’ పశువుల హాస్టల్‌కు రెండోస్థానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ కల్లూరు : కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని తడకనపల్లి గ్రామంలో పాలు ‘వెల్లువలా’ ఉత్పత్తి అవుతోంది. అక్కడ ప్రభుత్వ పశువుల సంక్షేమ వసతి గృహం ఉండటమే ఇందుకు కారణం. గ్రామ సమీపంలోని పదెకరాల సువిశాల స్థలంలో నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 1.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మరో రూ. 50 లక్షలు జోడించి సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. నాలుగేళ్ల క్రితం (2017, జనవరి 2వ తేదీన) 40 గేదెలతో ప్రారంభమైన ఈ హాస్టల్ నేడు ఆ సంఖ్య 200కు పెరిగింది. గేదెలను ఉంచడానికి సుమారు ఎకరం స్థలంలో నాలుగు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు సుమారు 300 గేదెల పెంపకానికి కూడా సరిపడతాయి. గేదెల మేత కోసం తొమ్మిది ఎకరాల్లో సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డిని పెంచారు. ఆయా రకాల గడ్డిని మేత మేయడం వల్ల గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. ఇలాంటి హాస్టల్ రాష్ట్రంలో ఇదే మొదటిదని, దేశంలో గుజరాత్ తర్వాతి స్థానం దీనికే లభిస్తుందని పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్‌బాబు వివరించారు. హాస్టల్ పుట్టుపూర్వోత్తరాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. వైఎస్ ప్రవేశపెట్టిన పీపీసీలే ఆవిర్భావానికి కారణం.. తడకనపల్లి గ్రామ పంచాయతీలో 4,300 జనాభా ఉంది. 1,050 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పొదుపు లక్ష్మి గ్రూపులు 92 ఉన్నాయి. వాటిలో సభ్యులు దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒకరుంటారు. ఇక్కడి మహిళలు చైతన్యవంతులు. ఆర్థిక స్వావలంబన అభిలాష బలంగా ఉంది. గేదెల పెంపకం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించి ఎక్కువ సంఖ్యలో అదే వృత్తిని అవలంబించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో పాల ప్రగతి కేంద్రాలు (పీపీకేలు) ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సెర్ప్ ద్వారా అమలు చేశారు. ఐదుగురు డ్వాక్రా గ్రూపు మహిళలు ఒక యూనిట్‌గా జాయింట్ లయబుల్ గ్రూప్ (జేఎల్సీ)లను 2013లో ఏర్పాటు చేశారు. ఒక్కో జేఎల్సీకి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన ముర్రా జాతి గేదెలను బ్యాంకు రుణం ద్వారా కొనిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ. లక్ష సబ్సిడీ ఇచ్చారు. గేదెలు కొనడానికి ముందే గడ్డి పెంపకానికి రూ. 30 వేల రుణాన్ని అడ్వాన్స్‌గా ఇప్పించారు. జిల్లా మొత్తంగా 60 పాల ప్రగతి కేంద్రాలు మంజూరైతే కేవలం తడకనపల్లి గ్రామానికి 12 పీపీకేలు కేటాయించారు. ఆ సమయంలో ఇక్కడ గేదెల పెంపకం, పాల ఉత్పత్తి తారాస్థాయికి చేరుకుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 2014లో అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్సింగ్ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ మహిళలు గేదెల పెంపకంపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించి పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి చిన్నటేకూరు పశువైద్యుడు డాక్టర్ నాగరాజు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పటి పశువైద్య శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్ విజయమోహన్‌ను ఆశ్రయించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. హాస్టల్ ఆవిర్భావానికి ముందు.. ఇంట్లో స్థలం లేని మహిళలు గేదెలను ఇంటి ముందు ఓ తడికె కింద కట్టేసేవారు. దానివల్ల వర్షానికి తడిసి, ఎండకు ఎండి గేదెల పెంపకానికి సరైన అనుకూల వాతావరణం లభించేది కాదు. రాత్రివేళ రక్షణ ఉండేది కాదు. ప్రభుత్వం పశువుల సంక్షేమ వసతి గృహం చేసిన తర్వాత సరైన సదుపాయాలు కలిగాయి. ఈ కారణంగా మొదట 40 గేదెలతో ప్రారంభమైన పశువుల హాస్టల్ క్రమేపీ అభివృద్ధి చెంది ప్రస్తుతం 200 గేదెలతో కళకళలాడుతోంది. హాస్టల్ నిర్వహణ ఇలా... ఈ హాస్టల్లో ప్రస్తుతం సుమారు నలభై నుంచి యాభై కుటుంబాల మహిళలు తమ గేదెలకు ఆశ్రయం కల్పించారు. ఎవరి గేదెలను వారు శుభ్రం చేసి, మేత వేసుకుని వెళ్లాలి. పాలు పిండుకోవాలి. హాస్టల్‌కు అవసరమైన నీటి వసతిని తడకనపల్లి చెరువు నుంచి కల్పించారు. చెరువులో బోరు వేసి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికయ్యే కరెంటు బిల్లును పెంపకందారులంతా సమానంగా భరించాలి. హాస్టల్ మైదానంలో గడ్డి పెంచాలనుకుంటే సొంత ఖర్చుతోనే పెంచుకోవచ్చు. ప్రత్యేక నిర్వహణ కమిటీ.. పశువుల హాస్టల్‌కు ప్రత్యేక నిర్వహణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ హాస్టల్ ప్రారంభంతోనే ఆవిర్భవించింది. ఈ కమిటీకి ప్రస్తుతం బొజ్జమ్మ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జుబేదాబీ, అంజనమ్మ, గంగావతి, హుసేన్‌బీ, శేషమ్మ కమిటీ సభ్యులు. నెలకొకసారి సమావేశమై నిర్వహణ ఖర్చులపై చర్చిస్తారు. ఒక్కో గేదెపై నెలకు రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేస్తారు. పెంపకం కూలీలుగా బీహార్‌వాసులు.. గేదెల పోషణలో బీహార్‌వాసులు నిష్ణాతులు. హాస్టల్లో ఎక్కువ సంఖ్యలో గేదెలు పెట్టుకున్న పెంపకందారుల (గేదెల యజమానుల)కు పోషణ సాధ్యం కాకపోవడంతో అలాంటి వారు తమ సొంత ఖర్చుతో బీహార్‌వాసులను కూలీలుగా నియమించుకున్నారు. గేదెకి రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తే పాలు పిండే పని మొదలు సపరలన్నీ వారే చేస్తారు. అధిక పాలదిగుబడి... హాస్టల్లో పోషిస్తున్న గేదెలు దాదాపుగా హర్యానాకు చెందిన ముర్రా జాతి, తమిళనాడుకు చెందిన గ్రేడెడ్ ముర్రాజాతి రకాలకు చెందినవి. వీటికి పాల దిగుబడి ఎక్కువ. పైగా హాస్టల్లో గేదెలకు సరైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం ఉంటుంది. దీనికి తోడు సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డి వాడుతుండటం వల్ల ఒక్కో గేదె రోజుకు 18 మొదలు 20 లీటర్ల దాకా పాలిస్తుంది. పాల కొనుగోలుదారులు ఇక్కడికే వచ్చి లీటరు రూ.50కి చొప్పున కొనుగోలు చేసుకువెళతారు. గ్రామంలో కాకుండా కేవలం పశువుల హాస్టల్లోనే రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. గేదెలు పోషించే మహిళలు లక్షాధికారులయ్యారు. ఉన్న చోటికే వైద్యం.. గతంలో ఇళ్ల వద్ద పోషణ చేసే సమయంలో పెంపకందారులు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వ్యయ, ప్రయాసలకు లోనయ్యేవారు. హాస్టల్లో అలాంటి ఇబ్బంది ఉండదు. పశువైద్యులే ఇక్కడికి వస్తారు. ఓ వెటర్నరీ అసిస్టెంట్ నిత్యం ఇక్కడే విధులు నిర్వర్తిస్తుంటారు. వారానికి ఒకసారి చిన్నటేకూరు పశువైద్యుడు పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వాటికి వైద్యం చేస్తారు. అనుబంధంగా పాలకోవా పరిశ్రమ... తడకనపల్లిలో పాల ఉత్పత్తి అధికంగా జరుగుతుండటం వల్ల ఇక్కడ పాలకోవా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కుటీర పరిశ్రమలా ప్రతి ఇంట్లో బట్టీలు పెట్టి కోవాను తయారు చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు వచ్చే కొందరు మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి యంత్రాల సాయంతో కోవా తయారు చేస్తున్నారు. తడకనపల్లి కోవా అనేది బ్రాండెడ్‌గా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అంతే కాకుండా కోవాను విక్రయించే ప్రత్యేక స్టాల్స్ వెలిశాయి. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట వెళితే వరుసగా కనిపిస్తాయి. ఫలించిన స్థానిక ఎమ్మెల్యే కృషి... హాస్టల్ విద్యుత్తు బిల్లు గతంలో కమర్షియల్ కేటగిరీలో ఉండేది. దీనివల్ల యూనిట్ కాస్ట్ పెరిగి, బిల్లు కూడా పెద్ద మొత్తంలో వచ్చేది. కరెంటు బిల్లు ఖర్చును కూడా పెంపకందారులంతా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మోయలేని భారంగా ఉండేది. విషయం స్థానిక శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ‘డైరీ ఫాం’ కేటగిరీకి మార్చాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈతో మాట్లాడారు. అందుకు ఎస్ఈ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. డైరీ ఫాం కేటగిరీ వల్ల తమకు బిల్లు భారం తగ్గనుందని పెంపకందారులు సంతోష పడుతున్నారు. నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు వస్తుంది: శేషమ్మ, గేదెల పెంపకందారు తడకనపల్లిలో ఉంటాను. జిలానీ గ్రూప్ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. ఏడు బర్రెలను హాస్టల్లో పెట్టాను. వీటికి మేత పెట్టడం, పేడ తీయడం, స్నానం చేయించడం, పాలు పితకడం వంటి అన్ని సపర్యలు మేమే చేసుకుంటాం. మా బర్రెలు ఉదయం 20, సాయంత్రం 12 చొప్పున రోజుకు 32 లీటర్ల పాలు ఇస్తాయి. పాల వ్యాపారి నుంచి నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు లభిస్తుంది. పశువుల హాస్టల్.. ఓ మంచి ఉద్దేశం: రమేశ్‌బాబు, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభుత్వం తడకనపల్లిలో పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం ఒక మంచి ఉద్దేశం. మహిళలు చిన్నచిన్న ఇళ్లల్లో గేదెలను కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. స్థలం లేక ఇంటి బయట షెడ్డు వేసి ఉంచుతున్నారు. అలాంటి వాతావరణంలో పశువుల ఆరోగ్యానికి రక్షణ ఉండదు. పాల ఉత్పత్తి కూడా వాటి స్వస్థతను బట్టి ఉంటుంది. ఇక్కడ పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం వల్ల గ్రామం పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పశువైద్యం కూడా ఒకేచోట లభిస్తోంది. చిన్నటేకూరు పశువైద్యుని పర్యవేక్షణ ఉంటుంది. -
ఇది పశువుల హాస్టల్..
పైన చిత్రంలో మీరు చూస్తున్నది ఓ హాస్టల్. అదేంటీ.. పిల్లలే కనిపించడం లేదు అని అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇది పిల్లల హాస్టల్ కాదు మరి.. పశువుల హాస్టల్. ఔరా.. ఇదేమి విచిత్రం అనుకుంటున్నారా. ఈ హాస్టల్ ఎక్కడుందో తెలుసా.. సిద్దిపేట జిల్లాలోని పొన్నాలలో.. రూ. 2 కోట్లతో దీన్ని నిర్మించారు. ఇక్కడ పెద్ద షెడ్లు, నీటి బోర్లు, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రాలు, పాలు నిల్వచేసే గది, కాపలాదారులకు గది, పశువుల వైద్య పరీక్ష స్టాండ్ అన్నీ ఉన్నాయి. విద్యార్థులకైతే తల్లిదండ్రులతో ఉండే అవకాశం ఉండదు కానీ.. ఇక్కడ పశువులు ఎంచక్కా తల్లీపిల్లా ఉండొచ్చు. ప్రస్తుతం 57 గేదెలు ఉండగా.. రోజుకు 150 లీటర్ల పాలు విక్రయిస్తున్నారు. మన ఊళ్లోనూ ఇలాంటి హాస్టల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదూ. సాక్షి, సిద్దిపేట: విద్యార్థులకు హాస్టళ్లు ఉంటాయని ఇప్పటివరకు తెలుసు.. కానీ సిద్దిపేట జిల్లాలో పశువులకూ ప్రత్యేకంగా హాస్టళ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో దానిలో 160 గేదెలు, ఆవులకు వసతి కల్పించి.. పాడి పరిశ్రమ అభివృద్ధికి అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఈజీఎస్) నిధులతో పాటు, కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) నిధులను జోడించి అన్ని హంగులతో హాస్టల్‌ను నిర్మించారు. ఈ హాస్టల్లో ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి రుణాల ద్వారా మహిళలకు అందించిన గేదెలు, ఆవులను పెంచి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఈ జిల్లాలో హాస్టళ్లను నిర్మిస్తున్నారు. తర్వాత ఈ పశువుల హాస్టళ్లను దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బాధ్యత వారిదే.. వ్యవసాయానికి అనుబంధంగాపాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలన్న లక్ష్మంతోతలపెట్టిన ఈ పశువుల హాస్టళ్ల నిర్వహణను చిన్న,సన్నకారు రైతులు, మహిళా సంఘాలు తీసుకుంటున్నాయి. పశువులకు గడ్డివేయడం, పాలు పితకడం,వాటి పరిశుభ్రత వంటి పనులను మొత్తం రైతులే చూసుకుంటారు. వారి పనులను బట్టి వాటాలు కేటాయించారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్, స్త్రీనిధి ద్వారా రుణాలు తీసుకొని వచ్చిన పాలను విక్రయించడం, వాటిని ఖాతాలకు జమచేయడం అంతా మహిళలు చూసుకుంటారు. పాలను విజయ డెయిరీ సిబ్బందే నేరుగా హాస్టల్ వద్దకే వచ్చి సేకరించడం, వారం వారం డబ్బులు జమచేయడం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రారంభమైన పొన్నాల గ్రామంలోని పశువుల హాస్టల్ నుంచి రోజుకు 57 గేదెల ద్వారా 150 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో గేదెలు, ఆవులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. సౌకర్యంగా ఉంది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మాకు రెండు గేదెలు ఇచ్చారు. వాటిని హాస్టల్లో ఉంచడంతో సౌకర్యంగా ఉంది. సమయానికి వచ్చి గడ్డివేస్తున్నాం. ఉదయాన్నే పాలు పితుకుతున్నాం. గేదెలు అన్నీ ఒకేచోట ఉండటంతో కాపలా ఇబ్బంది లేదు. దూడల రక్షణ, వైద్య పరీక్షలు ఇక్కడే చేస్తున్నారు. పాలు కూడా ఇక్కడే విక్రయిస్తున్నాం. అయితే ధర తక్కువగా పెడుతున్నారు. పెంచితే మరింత లాభంగా ఉంటుంది. –పులుసు యాదగిరి, రైతు, పొన్నాల గ్రామం వినూత్నంగా నిర్మాణం మంత్రి హరీశ్‌రావు ఈ హాస్టల్ నిర్మాణాలు వినూత్నంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గొర్రెల పాకలను లబ్ధిదారుల వారీగా కాకుండా సిద్దిపేట జిల్లాలో గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని నిర్మించారు. ఇవి మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ పాకల్లో అన్ని వసతులు ఒకే చోట ఉండటంతో గొర్రెల కాపరులు లాభాలు పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లాలోని ఇర్కొడు, పొన్నాల, నర్మెట, మిట్టపల్లి, గుర్రాలగొంది, ఇబ్రహీంపూర్, జక్కాపూర్, గల్లమల్యాల గ్రామాల్లో నిర్మాణాలకు రూ. కోటి రూపాయల ఈజీఎస్ నిధులు, మరో కోటిరూపాయలను సీఎస్ఆర్ ద్వారా సేకరించారు. ఈ నిధులతో పెద్ద షెడ్లు, కాంపౌండ్, నీటికోసం బోర్లు, వాటర్ ట్యాంక్ నిర్మాణం, డ్రైనేజీ, విద్యుత్, గడ్డికోసే యంత్రం, పాలు నిల్వచేసే గది, కాపలా కోసం వచ్చిన వారు ఉండే గది, పశువులను పరీక్ష చేసేందుకు స్టాండ్ మొదలైనవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పొన్నాల గ్రామంలో హాస్టల్‌ను ప్రారంభించారు. ఇక్కడ అన్ని వసతులూ ఉన్నాయిమా గ్రామంలో నిర్మించిన పశువుల హాస్టల్లో అన్ని వసతులున్నాయి.ఇక్కడ 160 గేదెలు, ఆవులు ఉంచే విధంగాషెడ్ను నిర్మించారు. ఇప్పటికే సగం గేదెలు వచ్చాయి. మిగిలిన వాటి కొనుగోలుకోసం రైతులు, గ్రామస్తులతోపాటు పశువైద్యాధికారులు ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్లారు. ఇప్పుడు 50 గేదెలు పాలు ఇస్తున్నాయి. మహిళలకు చేతినిండా పని కల్పించేందుకు ఈ హాస్టల్ ఉపయోగపడుతుంది. –రేణుక, గ్రామ సర్పంచ్, పొన్నాల రైతులకు ఉపయోగకరం పశువుల హాస్టల్‌తో చిన్న, సన్నకారురైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.ప్రభుత్వం నుంచి సబ్సిడీ ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని గేదెలు, ఆవులు కొనుగోలు చేసుకుంటున్నారు. వసతి కోసం హాస్టల్ ఉంది. సమయానికి వెళ్లి మేతవేయడం, శుభ్రపర్చడం, పాలు పితకడం చేస్తే చాలు. వ్యవసాయంతోపాటు, పశుపోషణ కూడా సాగుతుంది.–మమత, పొన్నాల గ్రామం -
లాభాల్లో బోనస్ మహిళలకే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు అమూల్ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమూల్‌తో ఒప్పందం ద్వారా పాడిరైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. పాదయాత్రలో పాడి రైతుల కష్టాలను చూశానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక సహకార సొసైటీలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. మార్కెట్లో పోటీతత్వం వస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు ఆదాయం చేకూరుతుందని పేర్కొన్నారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో ఏడాదికి రెండుసార్లు బోనస్ రూపంలో మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ వివరించారు. చదవండి: తొలిరోజే రూ.1,412 కోట్ల పింఛను సొమ్ము పంపిణీ ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం తెలిసిందే. -
మూగ జీవాలకు హెల్త్ కార్డులు
పాలకొండ రూరల్: మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పశువులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, యజమానులు, కాపలాదారులకు ఆసరాగా నిలిచేందుకు ‘వైఎస్సార్ పశుసంరక్షణ’ పథకాన్ని ప్రవేశపెట్టింది. మూగజీవాలకు ఆరోగ్య రక్షణ కార్డులు మంజూరు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా... వ్యవసాయ ఆధారితమైన ఈ జిల్లాలో పాడి పెంపకం ఆ తర్వాతి స్థానంలో ఉంటూ రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ క్రమంలో యానిమల్ కార్డుల ద్వారా దాదాపు లక్ష మంది పశు సంపద కలిగిన రైతులకు, పాడి పరిశ్రమల యజమానులకు, కాపరులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రా మ సచివాలయాలకు అనుసంధానం చేసిన పశువైద్య సహాయకులు ఈ కార్డుల మంజూరుకు అర్హులైన రైతులకు సహకరిస్తారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో గల ( 085–00–00–1962, 1907) వంటి టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి ఈ పథకాన్ని పొందేందుకు అవకాశం ఉంది. జిల్లావ్యాప్తంగా దాదాపు లక్షకు పైబడి మూగప్రాణులకు ఈ కార్డులు మంజూరు చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా పశువు ఆరోగ్య సంరక్షణకు చర్యలు, కృత్రిమ గర్భధారణ, సూడి పశువులు, దూడలు, పోషకాలు, పశుసంపద వివరాలు నమోదు చేస్తారు. ఆర్బీకే కేంద్రాల వద్ద పశువుల బోనులు ఏర్పాటుచేసి వాటి ఆరోగ్య తాజా స్థితిగతులు గుర్తిస్తారు. ఈ నేప థ్యంలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు కలిపి జిల్లావ్యాప్తంగా సుమారు 16 లక్షల 96వేల పైబడి ఉన్నట్లు సంబంధిత అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచిస్తున్నారు. పథకం తీరుతెన్నులు.. ఎలాంటి ముందస్తు రుసుములు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైఎస్సార్ పశు నష్టపరిహార పథకాన్ని అర్హులకు అందిస్తారు. జీవాల పునరుత్పాదక దశలో 2 నుంచి 10 ఏళ్ల వయసున్న ఆవులు, 3 నుంచి 12 ఏళ్ల వయసున్న బర్రెలకు వర్తింపజేస్తారు. పశువు మరణిస్తే మేలుజాతి స్వదేశీ ఆవు ఒక్కింటికి రూ.30 వేలు, దేశవాళీ బర్రె మరణిస్తే రూ.15వేలు పరిహారం అందిస్తారు. ఏడాదికి ఒక పాడి రైతు కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచి ఆపై వయసున్న మేకలు, గొర్రెలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఒకేసారి మూడు నుంచి అంతకన్నా ఎక్కువ జీవాలు మరణిస్తే పథకం వర్తిస్తుంది. ఒక్కో జీవానికి రూ.6వేల వంతున ఏడాదిలో ఒక్కో కుటుంబం గరిష్టంగా రూ.1.20 లక్షలు పరిహారం పొందవచ్చు. ఏడాది కాలంలో రూ.1.35 కోట్లు గడిచిన ఏడాది కాలంలో పథకం ద్వారా రూ.1.35 కోట్ల నష్టపరిహారం పశువులు, జీవాలను నష్టపోయి న అర్హులకు అందించాం. మరో రెండు కోట్ల పరిహారానికి సంబంధించి నగదు త్వరలో లబ్ధిదారులకు అందించనున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా పా డి రైతులు, యజమానులు, కాపర్లు తమ వివరాలు నమోదు చేసుకుంటే సరి పోతుంది. ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. అర్హులకు కార్డులను ఆర్బీకేల ద్వారా అందిస్తాం. ఈ కార్డులు నాలుగేళ్లు పనిచేస్తాయి. లబ్ధి పొందేందుకు ఈ పథకాన్ని సది్వనియోగపర్చుకోవాలి. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. – డాక్టర్ ఆరిక ఈశ్వరరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ -
చెరువుకు గండి.. కొట్టుకుపోయిన పశువులు
ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్ గ్రామ చెరువుకు గండిపడింది. గ్రామస్థులంతా నిద్రిస్తున్న సమయంలో శనివారం అర్ధరాత్రి చెరువుకు గండిపడటంతో.. దిగువకు దూసుకొచ్చిన నీరు కొద్దిసేపట్లోనే గ్రామాన్ని ముంచెత్తింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను రక్షించారు. వదర ఉధృతికి సుమారు 100 పశువులు కొట్టుకుపోయి ఉండవచ్చని స్థానికులు తెలిపారు. -
పశువుల్లో పడక జబ్బు
నివారణే ప్రధానం.. సకాలంలో చర్యలు చేపట్టాలి గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు... సూచనలు గజ్వేల్: పశువుల్లో పడక జబ్బు తలెత్తి రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి కారణంగా పశువులు తెలివిగా ఉండి కూడా లేచి నిలబడలేకపోతాయి. అధికంగా పాలిచ్చే పశువుల్లో ఈ వ్యాధి కనబడుతుంది. ఈ వ్యాధి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి(సెల్ : 9505056118) తెలిపారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు అందించారు. వ్యాధి సోకడానికి కారణాలు సాధారణంగా పశువులు ఈనిన వెంటనే వచ్చే పాల జ్వరం వ్యాధి చికిత్స సక్రమంగా పూర్తి చేయకపోతే అవి డౌనర్గా మారతాయి. తొడ, కండరాళ్లకు గాయాలవ్వడం, వాటికి సంబంధించిన నరాలు దెబ్బ తినడం వల్ల గర్భస్త దూడ పెద్దగా ఉన్నప్పుడు, అందించే మేపులో, రక్తంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం లోపమున్నప్పుడు, పొటాషియం లవణ లోపం వల్ల ఆవులు పడుకుని పాకుతూ ఉంటాయి. లక్షణాలు శ్వాస సాధారణంగా, నాడీరేటు అధికంగా ఉంటాయి. పడుకున్న ఆవులు తరచుగా నిలబడడనికి ప్రయత్నిస్తుంటాయి. కానీ నిలబడలేవు. మేత మేస్తుంటాయి. నెమరు వేస్తుంటాయి. కొన్ని ఆవులు కాళ్లను చాచి పడుకుని, తలను వెనక్కి లాక్కుని ఉండిపోతాయి. కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ గిలగిలా కొట్టుకుంటాయి. పడక వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. 7 రోజుల పాటు అదే పరిస్థితి ఉంటే పశువుల లేవడం కష్టం. చికిత్స అవసరాన్ని బట్టి పశు వైద్యుల సలహాపై నో విజాక్-పి, కార్టిజోన్స్, విటమిన్-ఈ, కాల్షియం, పాస్ఫరస్, సెలీనియం ఇంజక్షన్లు వాడాలి. అదే విధంగా బీ1, బీ6, బీ12కు సంబంధించిన ఇంజక్షన్లు వాడాలి. నీరు, మేత తీసుకోకుండా ఉంటే 20శాతం గ్లూకోజ్ ఎక్కించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని అటూ... ఇటు తిప్పుతుండాలి. పశువులకు మెత్తని పడకను ఏర్పాటు చేయాలి. వ్యాధి గ్రస్త పశువుల కండరాల్ని వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో మసాజ్ చేస్తుండాలి. ఇన్ఫ్రారెడ్ కిరణాల్లో కూడా మసాచ్ చేయవచ్చు. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు వాడుతుండాలి. ఇవే కాకుండా పడక వ్యాధితో బాధపడే పశువులను క్రమక్రమంగా పైకి లేపడం ద్వారా బాగు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్రలో పరికరాన్ని తయారు చేశారు. దీని ధర సుమారు రూ. 15వేల వరకు ఉంటుందని, స్థానికంగా కూడా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు.