పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్‌.. పాలు తాగడం సురక్షితమేనా? | What Is Lumpy Skin Disease In Cattle Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

Lumpy Skin Disease In Cattle: పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్‌.. పాలు తాగడం సురక్షితమేనా?

Published Mon, Sep 4 2023 1:08 PM | Last Updated on Mon, Sep 4 2023 1:43 PM

What Is Lumpy Skin Disease In Cattle Symptoms And Treatment - Sakshi

పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్‌ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్‌ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు.

మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్‌ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్‌ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు.

మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్‌ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ  వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది.

ఇలా చేస్తే ఉపశమనం

పాడి పశువులకు లంపీస్కిన్‌ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి.

రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి.

లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement