Lumpy Skin Disease
-
పశువుల్లో పంజా విసురుతున్న లంపీస్కిన్.. పాలు తాగడం సురక్షితమేనా?
పశువుల్లో వచ్చే వ్యాధుల్లో అధిక శాతం నివారించదగ్గవే. వ్యాధి రాకముందు టీకాలతోను, వ్యాధి వచ్చిన తరువాత వైద్యుల సలహాలతో పాటు సూచించిన మందులతో పాడి రైతులు నయం చేసుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం మూగజీవాలకు సోకిన లంపీస్కిన్ వ్యాధి తీవ్రతరంగా మారింది. దీంతో పాడి పశువులు బక్కచిక్కిపోవడంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువులు కూడా మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. వీటిలో అధికంగా తెల్లజాతి పశువుల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా కనిపిస్తుంది. వ్యాధి తీవ్రతరం కాకుండా గోట్‌ఫాక్స్ వ్యాక్సినేషన్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చి టీకాలు వేసే కార్యక్రమం ముమ్మరం చేసింది. జిల్లా వ్యాప్తంగా 13 ప్రాంతీయ ఆస్పత్రులు, 65 పశు వైద్యశాల లు, 40 గ్రామీణ పశువైద్య కేంద్రా లు ఉన్నాయి. వీటి పరిధిలో జిల్లాలో 3 లక్షల 77 వేల ఆవులు ఉన్నా యి. జిల్లాలో 3,02,450 టీకాలు లక్ష్యం కాగా ఇప్ప టివరకు సుమారు 1.35లక్షల వరకు టీకాల కార్యక్రమం చేపట్టారు. మున్సిపాల్టీ పరిధి కొత్తవలస గ్రామంలో బి.హరనాథరావుకు చెందిన మూడు ఆవులు ఈ నెల 2న ఒకే రోజు లంపీస్కిన్ వ్యాధి బారిన పడి మృతి చెందాయి. పశువులకు లంపీస్కిన్ (ముద్దచర్మం) వ్యాధి సోకక ముందు గ్రామంలో పశువైద్యాధికారులకు తెలియజేసినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని లబోదిబోమంటున్నాడు. ఇలా ఎక్కడో ఒక చోట పశువులకు వ్యాధులు సోకడంతో మృత్యువాత పడుతున్నాయి. అధికారులు స్పందించి వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. మురుగు నీరు నిల్వ ఉన్న చోట దోమలు, ఈగలు అధికంగా ఉంటాయి. దీంతో లంపీస్కిన్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడువునా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ వర్షాకాలంలోనే అధికంగా కనిపిస్తుంది. దీంతో ఓ వైపు మేత కొరత, మరోవైపు వ్యాధితో బాధపడుతున్న పశువుల నుంచి పాలు తగొచ్చా అన్న సందేహం కూడా వ్యక్తమవుతుంది. అంతే కాకుండా ఈ వ్యాధి కారణంగా పాల దిగుబడి కూడా తగ్గుముఖం పడుతుంది. వ్యాధి సోకిన పశువులను మొదట్లోనే గుర్తించి ఇతర పశువులకు సోక కుండా జాగ్రత్త పడాలి. పశువైద్యులను సంప్రదించి ముందస్తుగా టీకాలు వేయించుకుంటే ప్రమాదం తప్పేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే ఉపశమనం పాడి పశువులకు లంపీస్కిన్ వ్యాధి సోకిన సమయంలో సాంప్రదాయ పద్ధతులు పాటిస్తే కొంతమేర వ్యాధిని అరికట్టవచ్చు. పది తమలపాకులు, పది గ్రాముల మిరియాలు, పది గ్రాములు ఉప్పుతో లేపనం తయారుచేయాలి. దీనికి తగినంత బెల్లం కలపి పశువులకు తినిపించాలి. మొదటి రోజు ఇలా తయారు చేసిన మందును రోజుకు మూడు సార్లు, రెండో రోజు నుంచి రెండు వారాల పాటు రోజుకు రెండు సార్లు తినిపించాలి. రెండు వెల్లుల్లి పాయలు, ధనియాలు పది గ్రాములు, జీల కర్ర పది గ్రాములు, గుప్పెడు తులసి ఆకులు, పది గ్రాముల బిరియాని ఆకులు, పది గ్రాములు మిరియాలు, ఐదు తమలపాకులు, పది గ్రాములు పసుపు, గుప్పెడు వేప ఆకులు, నేరేడు ఆకులు, వంద గ్రాముల బెల్లం తీసుకుని మందును తయారుచేసుకోవచ్చు. దీనిని పశువు ఆరోగ్యం మెరుగుపడే వరకు మొదటి రోజు నాలుగుసార్లు, రెండో రోజు నుంచి రెండు సార్లు చొప్పున తినిపించాలి. లంపీ స్కిన్‌తో పశువు చర్మంపై గాయమైతే సాంప్రదాయ పద్ధతిలో మందు తయారుచేసి రాయాలి. వెల్లుల్లి పది రెక్కలు, కుప్పింటాకులు, వేపాకులు గుప్పెడు, 500 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనె, గోరింటాకు, తులసి ఆకులు గుప్పెడు చొప్పున తీసుకుని బాగా మిక్సీ చేసుకుని గాయంపై పూయాలి. గాయంపై పురుగులు ఉంటే సీతాఫలం ఆకురసం రాయడం ద్వారా త్వరగా నయం అవుతుంది. -
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి తగ్గింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి స్థిరంగా ఉందని, వ్యాధి వ్యాప్తి తగ్గిందని పశుసంవర్థక శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 8,263 గోజాతి పశువులు ఈ వ్యాధి బారిన పడగా.. 7,543 పశువుల్లో రికవరీ అయిందని తెలిపాయి. మొత్తం 54 పశువులు ఈ వ్యాధి సోకి మరణించాయని అధికారికంగా నిర్ధారించారు. ప్రస్తుతం 703 పశువుల్లో లంపీస్కిన్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఉందని, రాష్ట్రంలోని మొత్తం 1,635 గ్రామాల్లోని పశువులకు వ్యాధి సోకిందని పశుసంవర్థక శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,53,955 డోసుల గోట్‌పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చామని, అయితే మరణాల రేటు కొంత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 1,709 పశువులకు ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోని 1,502 పశువులకు ఈ వ్యాధి సోకగా, నల్లగొండ జిల్లాలోని 920 పశువులు ఈ వైరస్ బారిన పడ్డాయి. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 2, మెదక్‌లో 12, కరీంనగర్లో 18 పశువులకు ఈ వైరస్ సోకింది. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని, రాష్ట్రంలోని అన్ని గోజాతి పశువులకు మరో వారం, పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ వ్యాధి బారిన పడిన పశువులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు సంసిద్ధత వ్యక్తంచేశారు. తమకు మందులు సరఫరా చేస్తే వీలైనన్ని గ్రామాలకు వెళ్లి గోజాతి పశువులకు ఈ వ్యాధి సోకకుండా, సోకిన పశువులు కోలుకునేలా సేవలందిస్తామని డిప్లొమా హోల్డర్ల సంఘం ప్రభుత్వానికి వెల్లడించింది.