
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది.
30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలో సకాలంలో టీకాలు
లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది.
రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది.