సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లంపీస్కిన్ వ్యాధి స్థిరంగా ఉందని, వ్యాధి వ్యాప్తి తగ్గిందని పశుసంవర్థక శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి 8,263 గోజాతి పశువులు ఈ వ్యాధి బారిన పడగా.. 7,543 పశువుల్లో రికవరీ అయిందని తెలిపాయి. మొత్తం 54 పశువులు ఈ వ్యాధి సోకి మరణించాయని అధికారికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం 703 పశువుల్లో లంపీస్కిన్ వ్యాధిని కలుగజేసే వైరస్ ఉందని, రాష్ట్రంలోని మొత్తం 1,635 గ్రామాల్లోని పశువులకు వ్యాధి సోకిందని పశుసంవర్థక శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ వ్యాధిని నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 19,53,955 డోసుల గోట్‌పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చామని, అయితే మరణాల రేటు కొంత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటివరకు అత్యధికంగా వనపర్తి జిల్లాలో 1,709 పశువులకు ఈ వ్యాధి సోకింది.
ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లాలోని 1,502 పశువులకు ఈ వ్యాధి సోకగా, నల్లగొండ జిల్లాలోని 920 పశువులు ఈ వైరస్ బారిన పడ్డాయి. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 2, మెదక్‌లో 12, కరీంనగర్‌లో 18 పశువులకు ఈ వైరస్ సోకింది. కాగా, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని, రాష్ట్రంలోని అన్ని గోజాతి పశువులకు మరో వారం, పది రోజుల్లో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని పశుసంవర్థక శాఖ అధికారులు వెల్లడించారు.
కాగా, ఈ వ్యాధి బారిన పడిన పశువులకు ఉచితంగా వైద్య సేవలందించేందుకు పశుసంవర్థక పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లు సంసిద్ధత వ్యక్తంచేశారు. తమకు మందులు సరఫరా చేస్తే వీలైనన్ని గ్రామాలకు వెళ్లి గోజాతి పశువులకు ఈ వ్యాధి సోకకుండా, సోకిన పశువులు కోలుకునేలా సేవలందిస్తామని డిప్లొమా హోల్డర్ల సంఘం ప్రభుత్వానికి వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment