![Biovet developed BIOLUMPIVAXIN vaccine for Lumpy Skin Disease](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/biovet01.jpg.webp?itok=O3xvyWfU)
కొవాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలోని బయోవెట్ ఇటీవల లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్ఎస్‌డీ) కోసం వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. పాడి పశువుల చర్మంపై వచ్చే లంపీ స్కీన్ వ్యాధికి ఈ వ్యాక్సిన్ ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది. దేశంలో మొదటిసారిగా ఈ వ్యాధి నివారణకు ‘బయోలంపీవాక్సిన్’కు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఆమోదం లభించినట్లు సంస్థ పేర్కొంది.
బయోలంపీవాక్సిన్
బయోలంపీవాక్సిన్ అనేది పాడి పశువులను ఎల్ఎస్‌డీ నుంచి రక్షించడానికి తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సిన్. మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న జంతువులకు ఏటా ఒకసారి దీన్ని ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది. బయోవెట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) పరస్పర సహకారంతో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సిన్‌ను క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా ఐసీఏఆర్-నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్విన్స్ (ఐసీఏఆర్-ఎన్ఆర్‌సీఈ), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఐవీఆర్ఐ)ల్లో విస్తృతంగా పరీక్షించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Aero India 2025 బీఈఎల్ కొత్త ఉత్పత్తులు
ఈ వ్యాక్సిన్ తయారు ప్రాజెక్ట్‌కు ఎన్‌ఆర్‌సీఈ శాస్ట్రవేత్తలు నవీన్ కుమార్, బీఎన్ త్రిపాఠి నేతృత్వం వహించారు. ఎల్ఎస్‌డీ వల్ల దేశంలో పాడి ఉత్పాదకత గణనీయంగా ప్రభావం చెందుతోంది. గడిచిన రెండేళ్లలో దాదాపు రెండు లక్షలకుపైగా పాడి పశువులు ఈ వ్యాధి బారినపడి మరణించాయని కంపెనీ తెలిపింది. ఈ వ్యాధివల్ల 2022 సంవత్సరంలో రూ.18,337.76 కోట్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తి 26% క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment