సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్‌ ఇండెక్స్‌.. | Health Tips: Surprising Health Benefits Of Custard Apple And Its Leaves In Telugu - Sakshi
Sakshi News home page

Custard Apple Health Benefits: సీతాఫలం ఆకుల్లో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం.. షుగర్‌ పేషెంట్స్‌ తినొచ్చా?

Published Wed, Aug 23 2023 12:26 PM | Last Updated on Wed, Aug 23 2023 1:25 PM

Surprising Custard Apple Benefits on Your Health - Sakshi

గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్‌ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి.



ఎన్నో విటమిన్ల కలబోత
సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్‌ (ఎ), విటమిన్‌ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్‌, ఐరన్‌ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్‌ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి.

మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్‌, గ్యాస్‌, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్‌ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది.

బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్‌ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది.

గుండె ఆరోగ్యానికి మెరుగు
సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్‌ లెవెల్స్‌ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 54, అంటే లో–గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్‌ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ మలబద్దకాన్ని అరికడుతుంది.

ఉదర ఆరోగ్యానికి..
దీనిలో విటమిన్‌ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్‌ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్‌ స్కిన్‌ టోన్‌ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్‌ మెరుస్తుంది.



ఆకులతోనూ ప్రయోజనం
ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్‌ పౌడర్‌ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి.

నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది.
– వై.ఉమాజ్యోతి,
శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement