Seasonal Fruits
-
గుండెకు మేలు చేసే పండ్లు..!
గుండెజబ్బులను నివారించడానికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్లో భాగంగా డాక్టర్లు చాలా రకాల మార్గాలు సూచిస్తుంటారు. అందులో పండ్లు తినడమూ ఒకటి. అయితే కొన్ని రకాల పండ్లు చాలా రుచిగా ఉండటంతోపాటు, వాటిలో ఉండే కొన్ని రకాల పోషకాల వల్ల గుండెకు పటిష్టమైన రక్షణనిస్తాయి. వాటితోపాటు పూర్తి ఆరోగ్యానికీ తోడ్పడతాయి. అలా గుండెకు మేలు చేయడానికి వాటిల్లోని ఏయే పోషకాలూ, ఏయే అంశాలు ఉపయోగపడతాయో చూద్దాం. అన్ని చోట్లా దొరుకుతూ, అన్ని వేళలా లభ్యమయ్యే పండ్లలో అరటి, నారింజ, ఆపిల్ వంటివి చాలా ముఖ్యం. అలా గుండెకు మేలు చేసే ఆల్ సీజన్ పండ్ల గురించి తెలుసుకుందాం. అరటి పండు: ఈ పండులోని పొటాషియమ్, మెగ్నీషియమ్‌లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. హైబీపీ అన్నది గుండె΄ోటుకు ఒక రిస్క్‌ఫ్యాక్టర్ కాబట్టి అరటిలోని పొటాషియమ్ హైబీపీని తగ్గించడం ద్వారా పరోక్షంగా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలా అరటి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండు కేవలం రక్త΄ోటును అదుపు చేయడం, గుండె΄ోటు నివారించడమే కాకుండా... ఇందులోని విటమిన్ బి6, విటమిన్ – సి, పీచుపదార్థాలు దేహానికీ మేలు చేస్తాయి. ఇవి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతూనే ఉండటమన్నది ఓ సానుకూల అంశం. ద్రాక్ష: మన దేహంలో ఆయా అవయవాల ఆకృతికి దగ్గరిగా మంచి పోలిక కలిగి ఉండే పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఆయా దేహ భాగాలకు మేలు చేస్తాయనే భావన చాలామందిలో ఉంది. ఉదాహరణకు ఆక్రోట్ వంటివి మెదడుకు ఆకారంలో ఉండి మెదడుకు మేలు చేస్తాయనీ... అలాగే అడ్డుగా కోసినప్పుడు అచ్చం కన్నులోని నల్లగుడ్డులో ఉన్నట్లుగా రింగులు కనిపించే క్యారట్ కన్నుకు మేలు చేస్తుందంటారు. అలాగే ద్రాక్షగుత్తిని చూసినప్పుడు... ఆ పండ్లు ఉండే ఈనెలన్నీ దేహంలోని రక్తప్రసరణ వ్యవస్థలో ఉండే రక్తనాళాల్లా కనిపిస్తాయి. ఈ కారణం చేత ద్రాక్ష పండు గుండెకు మంచిదని అంటుంటారు. ద్రాక్షగుత్తి మొత్తాన్ని చూసినప్పుడు కూడా అది గుండె ఆకృతిలోనే ఉంటుంది. నిర్దిష్టంగా చూస్తే పండు ఆకృతి కీ, అది చేసే మేళ్లకూ సైంటిఫిక్‌గా ఎలాంటి నిదర్శనాలూ లేవు. అయినప్పటికీ కాకతాళీయంగానైనా ఇది రక్తనాళాల్లోని కొవ్వులను తొలగిస్తుంది. ద్రాక్షపండ్లు మన రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా గుండె΄ోటు అవకాశాలను నివారిస్తాయి. ద్రాక్షలోని పోషకాలైన లినోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ ఆలిగోమెరిక్ ప్రోయాంథో సయానిడిన్స్ వంటివి హైకోలెస్ట్రాల్ను తగ్గించి, అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. తద్వారా గుండెజబ్బులను నివారిస్తాయి. నారింజపండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి వంటి పండ్లన్నీ గుండెకు బాగా మేలు సమకూర్చేవే. బాగా పండిన నారింజలో విటమిన్ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుందనీ దాంతో గుండెకు రక్షణ కలుగుతుందన్న విషయం తెలిసిందే. ఇవి కూడా ఏ సీజన్లోనైనా దొరకే పండ్లు కావడం ఓ మంచి విషయం. ఆపిల్ : ఇందులోని ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాల్లోని ప్లేట్లెట్లు రక్తనాళాల గోడలకు అంటుకోకుండా చూస్తాయి. దాంతో΄ాటు రక్తనాళాలు మూసుకు΄ోకుండా చూడటం, కొలెస్టాల్ను తగ్గించడం కూడా చేస్తాయి. ఇలా అవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.కర్బూజ (కాంటలౌప్) : ఈ పండ్లలోని ΄÷టాషియమ్ రక్త΄ోటును నియంత్రించి గుండె΄ోటును నివారిస్తుంది. ఈ పండ్లలోని విటమిన్–ఏ, విటమిన్–బి6, ఫోలేట్, పీచుపదార్థాలు పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అన్ని చోట్లా దొరికే ద్రాక్ష, అరటి, నారింజ, ఆపిల్‌తోపాటు దాదాపుగా పట్టణ, నగర ప్రాంతాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లలో దొరకే మరికొన్ని పండ్లు కూడా గుండెకు మేలు చేస్తాయి. వాటిలో కొన్ని... బెర్రీపండ్లు: బెర్రీ పండ్లలో కూడా పొటాషియమ్ ఎక్కువగానే ఉంటుంది. పొటాషియమ్ రక్త΄ోటును నివారించడం ద్వారా గుండెకు మేలు చేస్తుందని అరటిపండు విషయంలో చూశాం కదా. అందుకే ఇది కూడా అరటి మాదిరిగానే గుండెకు మేలు చేస్తుంది. ఇక బెర్రీపండ్లలోని బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్బెర్రీలలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, ఫైబర్ అన్నీ పూర్తి శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి. కివీ: ఇప్పుడు నగర ప్రాంతాల్లోని పెద్దపెద్ద మార్కెట్ల తోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ కివీ పండ్లు దొరుకుతున్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పతాయి. కివీలోని విటమిన్–ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఫలితం గా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే గుణం తగ్గి గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అప్రికాట్: ముదురు నారింజ లేదా పసుపు రంగులో ఉండే అప్రికాట్స్ గుండెకు మంచివి. ఇందులో ఉండే విటమిన్–కె – రక్తకణాల ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాదు అప్రికాట్‌లో ఉండే విటమిన్– ఏ, విటమిన్– సీ, విటమిన్–ఈ వల్ల పూర్తి శరీర ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పైన పేర్కొన్నవాటి తోపాటు బ్రైట్‌గా ఉండి ముదురురంగుల్లో మెరుస్తున్నట్లు కనిపించే రంగులతో ఉండే పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. ఆపిల్ ఈ కోవలోనిదే. ఇక పండ్ల తోపాటు మిగతాజీవనశైలి మార్గాలను సైతం పాటిస్తూ ఉంటే గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. ∙ -
సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్ ఇండెక్స్..
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నో విటమిన్ల కలబోత సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ (ఎ), విటమిన్ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మెరుగు సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఉదర ఆరోగ్యానికి.. దీనిలో విటమిన్ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. ఆకులతోనూ ప్రయోజనం ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది. – వై.ఉమాజ్యోతి, శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి -
ఆషాడంలో నేరేడు పండ్లను తినాలని ఎందుకంటారో తెలుసా..!
ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ శాస్త్ర ప్రమాణం. వెంటనే మనకు మరీ శాకాహారులు అని సందేహం వచ్చేస్తుంది కదా! అక్కడకే వస్తున్న ముందుగా దీనిలో ఉండే అంతరార్థాన్ని నిశితంగా పరిశీలిస్తే.. మొక్కలకు ప్రాణముందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. అలాగే సంస్కృతంలో "ఓషధి" అంటే "ఫలమునిచ్చి మరణించునది" అని అర్థం. వరిధాన్యాన్నివ మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అంటే మొక్క మనకి ఆహారమిచ్చి, అది ప్రాణాన్ని కోల్పోతుంది. కాబట్టి అది మాంసాహారమే. ఆ విధంగా, ప్రతి ఒక్కళ్ళూ తినే ఆహారం, సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణమే కదా! అలాగే మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. వాటికి ప్రాయశ్చిత్తంగా పంచయజ్ఞాలు చేయాలి. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులో మొదటిది "ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పుడు జరిగే ప్రాణిహింస". అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం "బ్రహ్మయజ్ఞం". అంటే వేదాధ్యయనం చేయడం - చేయించడం. ఆషాఢ మాసంలో వేదవ్యాసుని జయంతి వస్తుంది కాబట్టి, వేదాలని న్యాసమొనరించి, ఈ రూపంలో అందించిన ఆయనను స్మరించి, వేదాలని కాపాడుకోవడం మన విధి. ప్రకృతిలో జరిగే మార్పు కోసం దేహానికి సహజ చికిత్సగా ఈ నేరేడు పళ్లను ఈ మాసంలోనే తీసుకోమని చెప్పడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కూడా. మొన్నటి వరకు వేసవి తీవ్రతకు దేహం నుంచి శ్వేద(చెమట) రూపంలో బయటకు వెళ్లిన నీరు కాస్త ఆషాఢంలో ఎండతగ్గి, మూత్రం రూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతి మూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరిగించే శక్తి దానికి ఉందనీ ఆయుర్వేదం చెబుతోంది. ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన విషయాలు 1. వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడం, 2. బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. అంటే శూన్యమాసమైన ఈ ఆషాడ మాసం మానవుడిని ఆరోగ్యాన్ని కాపాడుకోమని సూచించడమే గాక మన జీవనం కోసం చేసే పాపాలకు ప్రాయచిత్తం చేస్తుకునేలా వేదాధ్యయనం చేసి ప్రకృతికి కృతజ్క్షత చూపమని చెబుతోంది. మన ఆచారాల్లో దాగి ఉన్న గొప్ప శాస్త్రీయ వైదిక విజ్ఞానాన్ని తెలుసుకోవడమే గాక తరువాత తరాలకి చెబుదాం. (చదవండి: ఆషాడంలోనే ప్రత్యేకించి గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారంటే?..) -
అలాంటి వారు నేరేడు పండ్లు తినకపోవడమే మంచిది!
వర్షాకాలంలో దొరికే సీజనల్ ఫ్రూట్ నేరేడు పండు.ప్రకృతి సిద్ధంగా లభించే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.తియ్యగా, పుల్లగా పంటికి భలే రుచికరంగా ఉండే ఈ పండ్లు వర్షాకాలంలో విరివిగా దొరుకుతాయి. పండు పోషకాల గని, అనారోగ్యాల నివారిణి కూడా. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు , కేన్సర్ , కాలేయ సంబంధ వ్యాధుల్ని నివారించే ఎన్నో ఔషధగుణాలున్నాయి. నేరేడు పండులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి తో అనేక పోషకాలున్నాయి. నేరేడు పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేరుడుతో భలే ప్రయోజనాలు ► నేరేడు పండ్లు శరీరానికి చలువ చేస్తాయి.నీరసంగా ఉన్నప్పుడు నేరెడు పండ్లను తింటే తక్షణం శక్తి వస్తుంది. ► డయాబెటిక్ రోగులు రోజూ నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది ► ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి ► మహిళలకు రుతుస్రావం అధికంగా అయితే నేరేడు గింజల పొడిని కషాయంగా చేసుకొని చెంచాడు తాగితే మంచిది ► నేరేడు పండు ఊబకాయాన్ని తగ్గిస్తుంది.. ► నేరేడు పండ్లలోని యాంటీ అక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగు పర్చడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ► నేరెడు పండ్లలో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ► నేరేడు పండ్లు చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఈ సమస్యలు ఉంటే తినకూడదు నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. అలాగే రక్తంలోని చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. కాబట్టి ఆపరేషన్లకు ముందు, తర్వాత తినకపోవడం ఉత్తమం. అతిగా తినడం వల్ల లోబీపీ వచ్చే అవకాశం ఉంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలు, పచ్చళ్లు కూడా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను అస్సలు తినకూడదు. లేదంటే వికారం, వాంతులతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నేరేడు పండ్లు గర్భిణీ స్త్రీలు తినకూడదని అపోహ ఉంది. నేరేడు పండ్లు తింటే పుట్టబోయే పిల్లలు నల్లగా పుడతారని,వారి చర్మంపై నల్లటి చారలు ఏర్పడుతాయనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వైద్యులు అంటున్నారు. నేరేడు పండ్లలో కాల్షియం, విటమిన్-సి, పొటాషియం, మినరల్స్ శిశువు ఎముకలు పటిష్టపరచడానికి సహాయపడతాయని, అయితే ఇవి తిన్న వెంటనే పాలు మాత్రం తాగకూడదని అంటున్నారు. నేరేడు పండ్లు అధికంగా తినడం వల్ల మొటిమలు వస్తాయి. చర్మ సమస్యలు ఉన్న వారు వీటిని తినడం వల్ల అలర్జీలు ఎక్కువవుతాయి. -
మామిడి మార్కెట్లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: ‘మధురఫలం.. చైనా హాలాహలం’ శీర్షిక న మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగిం చింది. సీజనల్ ఫ్రూట్స్‌ను 24 గంటల్లో మగ్గపెట్టి సొమ్ము చేసుకునే లక్ష్యంతో కొంతమంది వ్యాపారులు నిషేధిత ఎథెఫాన్ పౌడర్‌ను మోతాదు కు మించి వినియోగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. పురుగుమందుల మాటున చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎథెఫాన్ పౌడర్‌ను ఇష్టానుసారం వినియోగిస్తున్న వ్యాపారులపై ఉక్కుపాదం మోపింది. ఆహార భద్రతా విభాగం, ఉద్యానశాఖ కమిషనర్లు కాటమనేని భాస్కర్, డాక్టర్ ఎస్. ఎస్.శ్రీధర్ ఆదేశాల మేరకు ఉద్యాన, రెవెన్యూ, పోలీస్‌శాఖలతో కలిసి ఆహార భద్రతా విభాగం అధికారులు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన మార్కెట్లలో తనిఖీలకు శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లాలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత ఆదేశాలతో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్.పూర్ణచంద్రరావు నేతృత్వంలో ఉద్యానశాఖ ఏడీ దయాకరబాబు, ఫుడ్ సేఫ్టీ అధికారులు శేఖరరెడ్డి, గోపాలకృష్ణ, శ్రీకాంత్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మ్యాంగో మార్కెట్లను విస్తృతంగా తనిఖీ చేశా రు. రాష్ట్రంలోని ప్రధాన మ్యాంగో మార్కెట్లలో ఒకటైన నున్న మ్యాంగో మార్కెట్‌తో పాటు జిల్లాలోని ఇతర మార్కెట్లలో దాడులు నిర్వహించారు. దాదాపు అన్ని మార్కెట్లలోను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిబంధనలకు విరుద్ధంగా ఎథెఫాన్‌ను విచ్చలవిడిగా విని యోగిస్తున్నట్టు గుర్తించారు. ఆ మార్కెట్లలో శాంపి ల్స్ సేకరించి కేసులు పెట్టారు. ఈదరలోని కేజీఎన్ మ్యాంగో కంపెనీ, చీమలపాడులోని రసాలు మ్యాంగో కంపెనీ, చీమలగూడెంలో శ్రీరామాంజనేయ ఫ్రూట్ మార్కెట్, ఎ.కొండూరులో కృష్ణ ఆగ్రోస్ (మ్యాంగో యార్డు), నున్న మార్కెట్లోని యశస్వినీప్రసన్నలక్ష్మి ఫ్రూట్ కంపెనీ, కోటేశ్వరరావు ఎస్బీఎఫ్ కంపెనీలపై 9 కేసులు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఈ దాడులు కొనసాగుతాయి. ఈరోజు కృష్ణాజిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఈ తనిఖీలు మ్యాంగో సీజన్‌కు పరిమితం కాదు. బొప్పాయి, బత్తాయి, జామ, అరటి తదితర పండ్లను మాగబెట్టే విషయంలో ఎథెఫాన్ వంటి విషపూరిత రసాయనాలు వినియోగిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. – స్వరూప్, జాయింట్ ఫుడ్ కంట్రోలర్ -
ఆలోచించి.. ఆరగించండి
*మామిడి రంగుచూసి మోసపోవద్దు * కాల్షియం కార్బైడ్‌తో కాయల పక్వం *తింటే అనారోగ్యమే * పట్టని అధికారులు తాళ్లూరు, న్యూస్‌లైన్: పీచు పదార్థాలతో పాటు ఏ, సీ విటమిన్లు పుష్కలంగా లభించే సీజనల్ ఫ్రూట్స్‌లో మామిడి ప్రధానమైంది. మామిడికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కాసులకు కక్కుర్తిపడి చెట్టుమీద కాయలు పండకుండానే కోసి మాగబెడుతున్నారు. తొందరగా పండటం కోసం కాల్షియం కార్బైడ్ వంటి వాటిని వాడుతున్నారు. మామిడి తోటల్లో నుంచి తెచ్చిన పచ్చి కాయల్ని ఒక గదిలో రాశిగా పోసి..ప్రతి 50 కాయల మధ్య 200 గ్రాముల కార్బైట్ ఉంచుతారు. కార్బైడ్ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తుంది. రసాయనాల ప్రతిచర్యతో ఉష్ణోగ్రతలు పెరిగి కాయలు పండ్లుగా మారుతాయి. పచ్చని రంగు వస్తాయి. అనంతరం మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా పండిన పండ్లలో ఉండే పోషక విలువలు వీటిలో ఉండవు. ఈ పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులంటున్నారు. రసాయనాలతో మగ్గబెట్టిన మామిడి పండ్లు తింటే గ్యాస్ట్రబుల్ రావడం, జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థ నిర్వీర్యమవడంతో పాటు క్యాన్సర్ బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భిణులకు ముప్పు.... కార్బైడ్‌తో మగ్గించిన పండ్లు తింటే గర్భిణులకు ప్రమాదకరం. ఒక్కోసారి అబార్షన్ అయ్యే అవకాశం కూడా ఉందని వైద్యులంటున్నారు. పిల్లలు అంగవైకల్యంతో పుట్టవచ్చని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు. ఎండు గడ్డితో పండేవి మంచివి... మామిడి కాయలు చెట్టు మీద పక్వానికి వచ్చిన తర్వాత కోస్తారు. వీటిని గంపల్లో వేసి ఎండు గడ్డి కప్పి వారం రోజుల పాటు మగ్గ బెడతారు. తర్వాత గడ్డిని తొలగించి చూస్తే మంచి వాసనతో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా.. రుచికరంగా ఉంటాయి. - రసాయనాలతో మాగబెట్టినప్పుడు పండ్ల తొక్కలపై అధిక ప్రభావం ఉంటుంది. తొక్కలోనే రసాయనాలు అధికంగా ఉంటాయి. పండ్లను ఉప్పునీటిలో కడిగి పైన తొక్కను తీసేసి తింటే కొంత మేలని వైద్యులు పేర్కొంటున్నారు. - ఒంగోలు పరిసర ప్రాంతాల్లోని గోడౌన్లలో మామిడి కాయల్ని కృత్రిమ పద్ధతుల్లో మాగబెట్టి..జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. మండలంలోని పండ్ల దుకాణాల్లో విక్రయించే వాటిని కూడా అక్కడి నుంచే తెస్తున్నారు. అధికారులు స్పందించి అటువంటి పండ్లను మార్కెట్లోనికి రాకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.