Custard apples
-
సీతాఫల్.. వెరైటీస్ ఫుల్
ఈ సీజన్లో సీతాఫలం రుచి చూడని వాళ్లు అరుదేనేమో... పండ్లలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమృతం లాంటి రుచిని కోల్పోకుండా అందించే ఏకైక ఫలంగా సీతాఫలాన్ని చెప్పుకోవచ్చు. దాదాపు అందరికీ అందుబాటు ధరల్లోనే ఉండే ఈ ఫలం.. ఇప్పుడు నగర మార్కెట్లో సందడి చేస్తోంది. మరోవైపు ఈ సీజన్లో సీతాఫలాన్ని ఆధారం చేసుకుని రుచులను వడ్డించే రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్ సైతం నగర వాసులకు వెరైటీలను అందించేందుకు సిద్ధమైపోతున్నాయి. కాదే ఫలమూ తినడానికి అనర్హం అన్నట్టే.. కాదే ఫలమూ మేళవింపునకు అనర్హం అంటున్నారు నగరంలోని చెఫ్స్. సీతాకాలంలో విరివిగా లభ్యమయ్యేది సీతాఫలం. ఇది తీపి, క్రీము గుజ్జుతో కూడిన ఉష్ణమండల ఫలం ఇది. ఈ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నందున గణనీయమైన పోషక విలువలను కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. జీర్ణక్రియను సైతం మెరుగుపరుస్తుంది. అయితే మ్యాంగో సీజన్లో మామిడి పండ్లను వంటకాలలో విరివిగా జత చేసే నగర నలభీములు.. సీతాఫలంతోనూ పలు రకాల వంటకాలు తయారు చేస్తూ నోరూరించడం ఆహార ప్రియులకు సుపరిచితమే.ఆరోగ్యానికి మేలు.. ఉపవాసం సమయంలో ప్రత్యేక ట్రీట్‌గా కూడా దీనిని వడ్డిస్తారు. రబ్దీ పాలలోని కాల్షియం ప్రొటీన్ కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, దీనికి బాదం, పిస్తాలను గారి్న‹Ùగా ఉపయోగిస్తారు. కాబట్టి అవసరమైన కొవ్వు, ఆమ్లాలు, విటమిన్–ఈ లను ఇవి అందిస్తాయి. ఒక లీటరు పాలు, పావు కిలో బెల్లం, అర టీస్పూన్ యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు ఒక కప్పుతో చేసిన ఈ రబ్దీని కూల్‌గా సర్వ్ చేసుకోవచ్చు. మరెన్నో రుచులు.. ఇవే కాకుండా పలు రెస్టారెంట్స్‌లో కస్టర్డ్ యాపిల్ ఖీర్, కుల్పీ తదితరాలను కూడా తయారు చేస్తున్నారు. కస్టర్డ్ యాపిల్‌తో ఫుడింగ్ కూడా చేస్తున్నారు. ఫిర్ని అనే నార్త్ ఇండియన్ డిజర్ట్ కూడా దీన్ని జోడిస్తున్నారు. కస్టర్డ్ యాపిల్ పల్ప్‌ను వేడి వేడి జిలేబీ తదితర స్వీట్స్‌పై దీన్ని జతచేసి సర్వ్ చేయడం కూడా కొన్ని రెస్టారెంట్స్‌లో పరిపాటిగా మారింది.స్వీట్ విత్ ఫ్రూట్.. రబ్దీ అనేది భారతీయ వంటకాల్లో ఒక క్లాసిక్ డెజర్ట్, ఇది చాలా కాలం నుంచి వండి వడ్డిస్తున్నారు. సంప్రదాయ పండుగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో, విందు వినోదాల చిహ్నంగా దీనిని వడ్డిస్తారు. రబ్దీకి సీతాఫలాన్ని జోడించడం వల్ల ప్రత్యేకమైన రుచిని మాత్రమే కాకుండా మరిన్ని బలవర్ధకాలు సంతరించుకుని ఉత్తమ పోషకాహారంగా మారుతోంది. పండుకు సహజంగా ఉండే తీపి దీనికి చక్కెర అతిగా జత చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది, వంటకాన్ని ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది. ఈ సీజన్లో వచ్చే కర్వా చౌత్, దీపావళి తదితర పండుగల సమయాల్లో కుటుంబ సమేతంగా ఆస్వాదించేందుకు ఈ డెజర్ట్ బాగా వినియోగిస్తారు. ఐస్‌క్రీమ్స్ షురూ.. నగరంలో పలు ఐస్‌క్రీమ్ పార్లర్స్ ఈ సీజన్లో సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ విక్రయాలకు పేరొందాయి. సీజనల్ పండ్లతో చేసిన ఐస్‌క్రీమ్స్‌ను అందించడంలో పేరొందిన నేచురల్స్‌లో ఇప్పటికే సీతాఫల్ ఐస్‌క్రీమ్స్ అందుబాటులోకి వచ్చాయి. అదే విధంగా క్రీమ్‌స్టోన్ తదితర పేరున్న పార్లర్స్లోనూ ఇవి అందిస్తున్నారు.. ఇక పాతబస్తీలో అచ్చమైన ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్‌కు దశాబ్దాల నాటి నుంచి కేరాఫ్‌గా ఉన్న ఫేమస్ ఐస్‌క్రీమ్స్ కూడా సీతాఫల్ హిమ క్రీముల్ని అందిస్తోంది. నగరంలోని అబిడ్స్‌లో ఉన్న నార్సింగ్ భేల్పురి జ్యూస్ సెంటర్ సైతం ఈ వంటకాలకు పేరొందింది. సీతాఫల్ మలాయ్ పేరుతో ఈ ఫుడ్ అవుట్లెట్ అందించే సీజనల్ రుచి ఫుడ్ లవర్స్‌కి చిరపరిచితమే. ఇలా అనేక రకాలుగా సిటీలోని సీతాఫల ప్రియుల్ని రారమ్మని ఆహా్వనించేందుకు ఓ వైపు రుచిని మరోవైపు ఆరోగ్య ఫలాన్ని అందించేందుకు రెస్టారెంట్స్, ఐస్‌క్రీమ్ పార్లర్స్, కేఫ్స్ పోటీపడుతున్నాయ్. -
సీతాఫలం తరచూ తింటున్నారా? దీనిలోని గ్లైసెమిక్ ఇండెక్స్..
గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో సీతాఫలాల సీజన్ ప్రారంభమైంది. తియ్యని ఈ పండ్లలో ఎన్నో పోషక విలువలుండడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్యాల నివారిణిగా పనిచేస్తుంది. ఈ పండే కాకుండా చెట్టు ఆకులు, బెరడు కూడా ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం (ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం) గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త వై.ఉమాజ్యోతి తెలిపారు. సీతాఫలం తీసుకుంటే కలిగే ఉపయోగాల గురించి ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్నో విటమిన్ల కలబోత సీతాఫలంలో ఎన్నో రకాల పోషకాలతో పాటు విటమిన్లు ఉన్నాయి. ఈ పండు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ (ఎ), విటమిన్ (బి) మెగ్నిషియం, పొటాషియం, ఫైబర్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉదయాన్నే తినడం ద్వారా కండరాలు, నరాల బలహీనత వంటి రుగ్మతలు తొలగిపోతాయి. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. విటమిన్ (ఎ) పుష్కలంగా ఉండడంతో కంటి సమస్యలు దూరమవుతాయి. మెగ్నీషియం, పోటాషియం, సోడియం సమపాళ్లలో ఉండడం వల్ల రక్తపోటును అదుపు చేసి గుండె సమస్యలు తలెత్తకుండా చూస్తుంది. పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది. అల్సర్, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గర్భిణులు తినడం ద్వారా పుట్టబోయే బిడ్డల మెదడు చురుగ్గా ఉంటుంది. క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. బలహీనంగా ఉండే చిన్న పిల్లలకు సీతాఫలాలను ఎంత ఎక్కువగా తినిపిస్తే అంత మేలు. ఈ పండ్లను ఎక్కువగా తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది. కడుపులో మంట, జీర్ణ సంబంధ సమస్యలున్న వారు ఈ పండ్లను ఎక్కువగా తినడం మంచిది. డైటింగ్ చేసేవారు ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. ఎదుగుతున్న పిల్లలు నిత్యం తింటుంటే కాల్షియం లాంటి పోషకాలు అధికంగా లభిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా ఉంటాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తం శుధ్ధి అవుతుంది. గుండె ఆరోగ్యానికి మెరుగు సీతాఫలం చూడడానికి కూడా హృదయాకారంలో ఉంటుంది. శరీరమంతా రక్తప్రసరణ సరిగ్గా ఉండేలా చూస్తుంది. అందువల్ల రక్తహీనత దరి చేరదు. ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సరిగ్గా ఉంటాయి. సీతాఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ 54, అంటే లో–గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు కూడా సీతాఫలం తినవచ్చు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని అరికడుతుంది. ఉదర ఆరోగ్యానికి.. దీనిలో విటమిన్ సి సమృధ్ధిగా దొరుకుతుంది. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేటందుకు దీనిలోని పీచుపదార్థం తోడ్పడుతుంది. అల్సర్లను నయం చేస్తుంది. ఎసిడిటీకీ చెక్ పెడుతుంది. డయేరియా లాంటి సమస్య రాకుండా అడ్డుకుంటుంది. చర్మ ఆరోగ్యానికి దోహదం ఈ పండులో స్మూత్ స్కిన్ టోన్ అందించే సూక్ష్మపోషకాలు ఉంటాయి. దీన్ని తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి స్కిన్ మెరుస్తుంది. ఆకులతోనూ ప్రయోజనం ఒక్క పండేకాదు, సీతాఫలంచెట్టు ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఆకుల్లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం చర్మ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకుల్ని మెత్తగా నూరి రాస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకుల్ని మెత్తగా నూరి బోరిక్ పౌడర్ కలిపి మంచం, కుర్చీల మూలల్లో ఉంచితే నల్లుల బెడద ఉండదు. చెట్టు బెరడును కాచగా వచ్చిన కషాయాన్ని అధిక విరేచనాలతో బాధపడేవారికి ఔషధంగా ఇస్తుంటారు. సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు. అయితే కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. నేరుగా తినడమే మంచిది గర్భిణులు ఈ పండును సాధ్యమైనంత తక్కువగా తినాలి. పొరపాటున గింజలు లోపలికి వెళితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మోతాదుకు మించి తినకూడదు. మధుమేహ వ్యాధి గ్రస్తులు, ఊబకాయులు ఈ పండ్లను వైద్యుల సలహాలతో తీసుకోవాలి. జలుబు, దగ్గు, ఆయాసం, ఎలర్జీ సమస్యలతో బాధపడేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. ఈ ఫలాన్ని రసం రూపంలో కాకుండా నేరుగా తినడమే ఉత్తమం. ఎందుకంటే గుజ్జు నోటిలోపల జీర్ణరసాలను పెంచుతుంది. తద్వారా జీర్ణక్రియ వేగవంతమవుతుంది. పండుగుజ్జును తీసుకుని రసంలా చేసి పాలు కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుంది. – వై.ఉమాజ్యోతి, శాస్త్రవేత్త, కేవీకే, రస్తాకుంటుబాయి -
కలర్‌ఫుల్.. ప్రూట్స్
కడియం: పనస తొనలు తెలుపు లేత గోధుమ లేదా పసుపు రంగులో ఉండటం సహజమే. అవే తొనలు చూడగానే ఆకర్షించేలా ఆరెంజ్ కలర్లో ఉంటే ఆశ్చర్యమే. సీతాఫలాలు పైకి ఆకుపచ్చగా.. లోపల తెల్లటి గుజ్జుతో ఉండటం సహజమే. అవే ఫలాలు పైకి పింక్ కలర్లో కనిపిస్తే ‘ఎంత బాగున్నాయో’ అనిపించక మానదు. సాధారణంగా నేరేడు పండ్లు నల్లగా ఉంటాయి. అవే పండ్లు తెల్లగా ఉంటే..! సహజ సిద్ధంగా లభిస్తున్న ఫండ్లను ఇలా సరికొత్తగా అభివృద్ధి చేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు కడియం ప్రాంత నర్సరీ రైతులు. సాధారణంగా మనం చూసే పండ్లను భిన్నమైన రంగుల్లో కాసే అనేక రకాల మొక్కలను తమ నర్సరీల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మన దేశంలో లభించే వివిధ రకాల పండ్లకు ఉండే సహజ గుణాలకు భిన్నంగా రూపొందిస్తున్న ఈ మొక్కలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగని వీటి తయారీ ప్రకృతి విరుద్ధంగానో లేక జీన్ మోడిఫైడ్గానో చేయడం లేదు. ప్రకృతి సహజంగా లభించే పండ్ల మొక్కల్లో భిన్నమైన లక్షణాలను ముందుగా గుర్తిస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక మొక్కలో వచ్చేవిధంగా అంటు కట్టి తయారు చేస్తున్నారు. ఇలా దేశ, విదేశాల్లో విభిన్న రకాలైన పండ్ల మొక్కలను ఇక్కడకు తీసుకువచ్చి, సరికొత్తగా అభివృద్ధి చేసి, కొనుగోలుదార్లకు అందుబాటులో ఉంచుతున్నారు. నిబంధనల ప్రకారం.. సాధారణంగా వేరే ప్రదేశం నుంచి ఏదైనా మొక్కను తేవాలంటే ప్లాంట్ క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా పండ్ల మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి. విభిన్న రకాల మొక్కలను ఆయా నిబంధనలకు లోబడి ఇక్కడి నర్సరీ రైతులు తీసుకువస్తున్నారు. ముంబై, పుణే, కోల్‌కతా, కేరళ, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో క్వారంటైన్ లైసెన్సులు ఉన్న పలువురు నర్సరీ రైతులు ఇతర దేశాల నుంచి ఈ రకమైన పండ్ల మొక్కలకు మన దేశానికి తీసుకువస్తున్నారు. వీటిని కడియం ప్రాంత నర్సరీ రైతుల ద్వారా అభివృద్ధి చేస్తున్నారు. కంటికి భిన్నంగా కనిపించినప్పటికీ రుచిలో ఏ మాత్రం తేడా లేకపోవడంతో వీటి ప్రత్యేకతగా చెబుతున్నారు. తెల్ల నేరేడు, పింక్ జామ, ఎరుపు రంగు తొనలు ఇచ్చే పనస, సీడ్ లెస్ నిమ్మ, పింక్ కలర్ సీతాఫలం, ఎరుపు రంగులో ఉండే గులాబీ జామ, వెరిగేటెడ్ అరటి, స్వీట్ గుమ్మడి, పింక్ కొబ్బరి, వివిధ రంగుల్లో చిలగడదుంప, ఉసిరి, డ్రాగన్‌ఫ్రూట్, రామాఫలం, ఎర్రని చింత/సీమచింత తదితర రకాల పండ్ల మొక్కలను స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. పింక్ కలర్ గులాబీజామ ,ఆరెంజ్ పనస స్వీట్ గుమ్మడికొనుగోలుదారులను ఆకట్టుకుంటాయి సాధారణంగా ఉండే పండ్ల కంటే భిన్నంగా కనిపిస్తుండడంతో కొనుగోలుదారులను ఇవి ఆకట్టుకుంటున్నాయి. వీటి అభివృద్ధి శ్రమతో కూడినది. కానీ నాణ్యమైన దిగుబడి ఇస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఔత్సాహిక రైతులు వీటిని నాటి మంచి ఫలసాయం పొందుతున్నారు. ఇవి సహజసిద్ధంగా రూపుదిద్దుకున్నవే. – కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ, బుర్రిలంక సహజమైనవే.. కొన్ని రకాల పండ్లు, పువ్వులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రంగు, రుచి, వాసన కలిగి ఉంటాయి. మన దేశంలో పనస సాధారణంగా తెలుపు, లేత గోధుమ, పసుపు రంగుల్లో ఉంటుంది. థాయ్‌లాండ్‌లో ఎరుపు రంగులో ఉంటుంది. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన భిన్న లక్షణాలుంటాయి. వీటిని సేకరించి తీసుకువచ్చి, స్థానిక నర్సరీ రైతులు అభివృద్ధి చేస్తున్నారు. సంబంధిత రకాన్ని అభివృద్ధి చేయడంగానే దీనిని చెప్పవచ్చు. – సుధీర్‌కుమార్, ఉద్యాన అధికారి, కడియం -
జనగామ టు విజయవాడ
తెలంగాణ ఆపిల్‌గా పేరొందిన సీతాఫలం వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. రోజుకు రూ. రెండు లక్షలకు పైగానే అమ్మకాలు అవుతున్నాయి. ప్రస్తుతం ఉపాధి పనులు నిలిచిపోవడంతో కూలీలు, రైతుల కుటుంబ సభ్యులు అడవిబాట పడుతూ సీతాఫలాలనే నమ్ముకుంటున్నారు. ఒకప్పుడు గ్రామీణులకు అందుబాటులో ఉన్న పండు నేడు పక్క రాష్ట్రాలతో పాటు మహానగరాలకు తరలిపోతోంది. దీంతో సీతాఫలం తినాలనే కోరిక ఉన్నా ధరలను చూసిన సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. సాక్షి, జనగామ: జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, మద్దూరు, లింగాలఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల నుంచి పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద ఉన్న మార్కెట్‌కు సీతాఫలాలను కూలీలు తీసుకొస్తున్నారు. నిత్యం జనగామ మార్కెట్లో రూ. రెండు లక్షలకు పైగా వ్యాపారం సాగుతుంది. జనగామ నుంచి హైదరాబాద్, మిర్యాలగూడ, కోదాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, రాజ మండ్రి, విజయనగరం, ఒంగోలు, గుంటూరుతో పాటు ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలకు సీతాఫల్ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. విజయవాడకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో ఒక్కో గంపను రూ.150 నుంచి రూ.300 వరకు కొనుగోలు చేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యాపారులు చిన్న, పెద్ద సైజు పండ్లను వేరుచేసి ఎగుమతి చేస్తున్నారు. విజయవాడలో పెద్ద సైజులలో ఉన్న డజను పండ్లకు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటే హైదరాబాద్‌లో రూ.150కి పైగా డిమాండ్ ఉంది. రోజుకు పది వాహనాలు.. జనగామ నుంచి ప్రతీ రోజు పది వాహనాలకుపైగా సీతాఫల్ పండ్లను విజయవాడ కేంద్రంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన ఏజెంట్లు జనగామలోనే మకాం వేసి రోజువారీగా కొనుగోలు చేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యే సీతాఫల్ మార్కెట్లో రాత్రి వరకు క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోనే అనేక గ్రామాల్లో రోజువారి కూలీలతో పాటు రైతులు, యువకులు, అన్ని వర్గాల వారు కుటుంబ సమేతంగా తెల్లవారు జాము నాలుగు గంటలకే అడవికి వెళ్లి సీతాఫల్ పండ్లను సేకరిస్తున్నారు. నెలరోజులుగా జోరుగా సాగుతున్న ఈ సీజన్ మరో 20 రోజులకు పైగానే ఉంటుం ది. తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా దిగుబడినిచ్చే ప్రాంతం జనగామ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు మామిడితోటలకు బదులుగా సీలాఫల్ తోటలను సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఔషధ గుణాలు సీతాఫల్ ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాలను అనేకరకాల వ్యాధుల నివారణలో వినియోగిస్తారని నమ్మకం. వీటి ఆకులకు మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు అధికబరువు తగ్గించే గుణం ఉందని నమ్మకం. ఆకుల కషాయం జలుబును నివారిస్తుందని పెద్దలు అంటుంటారు. పండ్ల నుంచి నుంచి కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్–సి వంటి గుణాలు కలిగిన విటమిన్లు సమృద్ధిగా వస్తాయి. పండును రసం రూపంగా కాకుండా నేరుగా తింటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతూ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. పండు గుజ్జును తీసి రసంలా తయారు చేసి పాలల్లో కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుం టారు. ఇందులో ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు, ఎముకల పరిపుష్టికి దోహదం చేస్తాయి. మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆకుల్లోని హైడ్రోసైనిక్ ఆమ్లం చర్మసంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకులను మెత్తగా నూరి కొంచెం పసుపు కలిపి మానని గాయాలపై రాస్తే తగ్గుముఖం పడుతుంది. ఆకులను మెత్తగా నూరి బోరిక్‌పౌడర్ (క్యారం బోర్డు పౌడర్)ను కలిపి మంచం, కుర్చీల మూలాల్లో ఉంచితే నల్లుల బెడద తప్పుతుంది. -
గొప్ప నేతను కోల్పోయిన దేశం
హన్మకొండ వరంగల్ : భరత జాతి గొప్ప నాయకుడిని, మహనీయుడిని కోల్పోయిందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు సంతాపసభ నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి పార్టీ నాయకులు మౌనం పాటించి నివాళులర్పించారు. మందాడి సత్యనారాయణరెడ్డి జనసంఘ్ నుంచి అటల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ముందుగా జనసంఘ్ ఏర్పాటు చేసినప్పుడు ఇదెక్కడి పార్టీ అని అవహేళన చేసిన వారు ఉన్నారని తెలిపారు. 1967లో నాగ్‌పూర్‌లో జరిగిన జనసంఘ్ జాతీయ సమావేశాలకు తనతోపాటు జిల్లా నుంచి మరికొందరు హాజరు కాగా, వాజ్‌పేయి ప్రసంగం విన్న తర్వాత తమలో ఎంతో స్ఫూర్తి కలిగిందన్నారు. అప్పటినుంచి ఆయన వచ్చే సమావేశాలన్నింటిలో పాల్గొని అతని ప్రసంగం విని స్ఫూర్తి పొందేవారమన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ 55ఏళ్ల పాటు బీజేపీ సౌధాన్ని నిర్మించి అప్పగించారన్నారు. 23 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భావజాలాన్ని ప్రచారం చేసి దేశంలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేలా కృషి చేశారన్నారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయినప్పుడు అటల్ జీ వచ్చి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్సీగా ఉన్నానని, ఆ సమయంలో ఆ సమయంలో పార్టీ ఆదేశించగా తోడుగా మెలిగానని గుర్తు చేసుకున్నారు. పూర్వ బీజేపీ, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు మంద ఐలయ్య మాట్లాడుతూ 1983లో పరకాలలో అటల్ పాల్గొన్న సభకు తాను అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశం వచ్చిందని చెప్పారు. మరో పూర్వ బీజేపీ, ప్రస్తుత టీఆర్ఎస్ నాయకుడు కోల జనార్థన్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అటల్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు. 1983లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రామప్పకు తీసుకెళ్లానని, రామప్ప దేవాలయం, చెరువును చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారని, కాకతీయులు నిర్మించారని చెప్పితే అబ్బుర పడ్డారని వివరించారు. బీజేపీ నాయకురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఇతర పార్టీ నాయకులు అటల్‌ను గౌరవిస్తున్నారంటే వాజ్‌పేయి వ్యక్తిత్వతం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు నాగపురి రాజమౌళి మాట్లాడుతూ పరకాల, కరీంనగర్లో అటల్ పాల్గొన్న సభలో తనకు పాటపాడే అవకాశం వచ్చిందన్నారు. తాను రాసిన పాట పార్టీ గీతంగా మారిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చాడా శ్రీనివాస్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణ, మారెపల్లి విష్ణువర్థన్‌రెడ్డి, బండి సాంబయ్య యాదవ్ పాల్గొన్నారు. వరంగల్ సీతాఫలాల రుచి చూసిన అటల్ హన్మకొండ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వరంగల్ సీతాఫలాల రుచిని చూశారు. 1983లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆటల్ బిహారీ వాజ్‌పేయి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు వన్నాల శ్రీరాములు ఇంటిలో భోజనం చేశారు. ఈ సందర్భంగా భోజనంతోపాటు సీతాఫలాలు అందించగా వాటిని ఎంతో ఆసక్తిగా తిన్నారని వన్నాల శ్రీరాములు తెలిపారు. సీతా ఫలాల రుచి బాగుందని తెలిపారని వివరించారు. -
స్వీటాఫలం
చక్కెర్లో చెరకు రసం పోసినట్లుండదూ! బెల్లం పాకంలో తేనె కాచినట్లుండదూ! ఎగ్జాట్లీ!! సీతాఫలంతో స్వీటు చేస్తే ఇట్ విల్ బి సో.... స్వీట్! ఎంజాయ్.. స్వీటాఫలం. సీతాఫల్ సగ్గుబియ్యం పాయసం కావలసినవి: కొబ్బరి పాలు – 2 కప్పులు; సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన సగ్గుబియ్యం – అరకప్పు; పంచదార – పావు కప్పు; నీళ్లు – అర కప్పు; యాలకుల పొడి – అర టీ స్పూన్, జీడిపప్పు – 10, కిస్మిస్ – 15. తయారి: స్టౌ పైన మందపాటి నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఇదే పాన్‌లో నీరు పోసి నానబెట్టిన సగ్గుబియ్యం కలిపి ఉడకనివ్వాలి ∙సగ్గుబియ్యం మరీ మెత్తబడకుండా ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోసి పది నిమిషాలు ఉడికించుకోవాలి ∙సీతాఫలం గుజ్జు, పంచదార, యాలకుల కూడా జతచేసి మరొక పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ∙చల్లారిన ఈ మిశ్రమానికి జీడిప్పు, కిస్మిస్ జతచేసి అర గంట సేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లాగా సర్వ్ చేస్తే బాగుంటుంది. సీతాఫల్ ఫిర్నీ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నానబెట్టిన బియ్యం – అర కప్పు (2 గంటల సేపు నానబెట్టుకోవాలి); వెన్నతీయని పాలు – అర కప్పు; కాచి చల్లార్చిన వెన్నతీయని పాలు – మూడున్నర కప్పులు; పంచదార – 5 టేబుల్ స్పూన్స్, యాలకులు – 4. తయారి: ∙నానబెట్టుకున్న బియ్యానికి అరకప్పు చల్లని పాలు కలిపి మిక్సీ జార్లో వేసి కొంచెం (రఫ్‌గా) బరకగా ఉండేలా తీసుకోవాలి ∙స్టౌ వెలిగించి మందపాటి నాన్‌స్టిక్ గిన్నెలో మిగిలిన మూడున్నర కప్పుల పాలు, మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కలిపి, మీడియమ్ మంటపైన అయిదు నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙సిమ్‌లో పెట్టి మరొక పది నిమిషాలు కలుపుతూ ఉండాలి ∙బియ్యం, పాల మిశ్రమం ఉడికేలా మధ్య మధ్యలో చూసుకుంటూ మరికాసేపు ఉంచాలి ∙పూర్తిగా ఉడికిన తర్వాత సీతాఫలం గుజ్జును కూడా వేసి బాగా కలపాలి ∙పూర్తిగా చల్లారిన తర్వాత రెండు గంటల సేపు ఫ్రిజ్‌లో ఉంచాలి ∙ఫ్రిజ్‌లో తీసిన తర్వాత యాలకులను దంచి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. సీతాఫల్ కలాకండ్ కావలసినవి:పాలు – 2 రెండు లీటర్లు; నిమ్మరసం– 2 టీ స్పూన్స్; పంచదార – అర కప్పు (పొడి చేసుకోవాలి); యాలకుల పొడి – 1 టీ స్పూన్, సీతాఫలం గుజ్జు – 1 కప్పు; నెయ్యి – 1 టీ స్పూన్, పిస్తా – 2 టేబుల్ స్పూన్స్; బాదం – 2 టేబుల్ స్పూన్స్. తయారి: మందపాటి గిన్నె తీసుకుని ఒక లీటరు పాలను అర లీటరు మిగిలేలా మరించాలి ∙మరొక గిన్నెలో లీటరు పాలను తీసుకుని మరుగుతుండగా స్టౌను సిమ్‌లో పెట్టుకోవాలి ∙ఈ పాలకు నిమ్మరసం కలిపి విరగనివ్వాలి ∙పలుచటి కాటన్ బట్టను తీసుకుని విరిగిన పాలను వడపోయాలి ∙ఇలా తయారైన పనీర్‌ను చల్లటి నీటిలో మరొకసారి కడిగి, ముందుగా మరిగించి పెట్టుకున్న పాలలో ఈ పనీర్‌ను కలిపి తిప్పుతూ ఉండాలి ∙పాలు పనీర్ మిశ్రమానికి పంచదారను కలిపి మరికాసేపు కలుపుతూ ఉండాలి ∙ఇప్పుడు సీతాఫలం గుజ్జును, యాలకుల పొడిని కూడా జతచేసి చిక్కబడేంత వరకు కలిపి స్టౌ ఆఫ్చేసుకోవాలి ∙ఒక ప్లేటుకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని సమానంగా పరుచుకోవాలి ∙పిస్తా, తరిగిన బాదం పైన వేసి కాసేపు చల్లారిన తర్వాత కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ∙సీతాఫల్ కలాకండ్ను ఎయిర్‌టైట్ కంటెయినర్లో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే 5 రోజుల వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. సీతాఫల్ స్మూతీ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 2 కప్పులు; అరటిపండు గుజ్జు – 1 కప్పు; తేనె – 1 టీ స్పూన్, వెనీలా కస్టర్డ్ పౌడర్ – పావు కప్పు; దాల్చినచెక్క పొడి – చిటికెడు; ఐస్ క్యూబ్స్ – 3 తయారి:సీతాఫలం గుజ్జు, అరటిపండు గుజ్జు, తేనె, కస్టర్డ్ పౌడర్ అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి అయిదు నిమిషాలు బ్లెండ్ చేయాలి ∙గ్లాసులోకి పోసి, దాల్చిన చెక్క పొడి, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి. సీతాఫల్ ఐస్‌క్రీమ్ కావలసినవి: సీతాఫలం గుజ్జు – 1 కప్పు; ఒకటిన్నర కప్పు – మిల్క్ క్రీమ్; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్ తయారి: ∙గిన్నెలో సీతాఫలం గుజ్జు, మిల్క్ క్రీమ్‌ను కలిపి బీట్ చేయాలి ∙కండెన్స్డ్ మిల్క్, వెనీలా ఎసెన్స్‌ను కూడా కలిపి బీట్ చేయాలి (మిక్సీ జార్లో కూడా వేసి బ్లెండ్ చేసుకోవచ్చు) ∙ప్లాస్టిక్ కంటెయినర్లోకి తీసుకుని 8 గంటలు లేదా ఒక రాత్రంతా డీఫ్రిజ్‌లో ఉంచాలి. (పిల్లలకు ఐస్‌లా ఇవ్వాలనుకుంటే ఐస్ మౌల్డ్‌లో ఈ మిశ్రమాన్ని పోసి రాత్రంతా ఉంచాలి) సర్వ్ చేయడానికి అయిదు నిమిషాలు ముందుగా ఫ్రిజ్ నుండి తీసి స్కూప్‌తో సర్వ్ చేసుకోవాలి. -
సీతాఫలాల కోసం వెళ్లి..
పెద్దవంగర (వరంగల్) : సీతాఫలాలు తెంపడానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ధారావత్ జీవన్(11) స్నేహితులతో కలిసి సీతాఫలాలు కోసేందుకు చెట్టెక్కాడు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.