సీతాఫలాలు తింటున్న వాజ్‌పేయి
హన్మకొండ వరంగల్ : భరత జాతి గొప్ప నాయకుడిని, మహనీయుడిని కోల్పోయిందని బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు సంతాపసభ నిర్వహించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతికి పార్టీ నాయకులు మౌనం పాటించి నివాళులర్పించారు. మందాడి సత్యనారాయణరెడ్డి జనసంఘ్ నుంచి అటల్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాము ముందుగా జనసంఘ్ ఏర్పాటు చేసినప్పుడు ఇదెక్కడి పార్టీ అని అవహేళన చేసిన వారు ఉన్నారని తెలిపారు.
1967లో నాగ్‌పూర్‌లో జరిగిన జనసంఘ్ జాతీయ సమావేశాలకు తనతోపాటు జిల్లా నుంచి మరికొందరు హాజరు కాగా, వాజ్‌పేయి ప్రసంగం విన్న తర్వాత తమలో ఎంతో స్ఫూర్తి కలిగిందన్నారు. అప్పటినుంచి ఆయన వచ్చే సమావేశాలన్నింటిలో పాల్గొని అతని ప్రసంగం విని స్ఫూర్తి పొందేవారమన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ 55ఏళ్ల పాటు బీజేపీ సౌధాన్ని నిర్మించి అప్పగించారన్నారు. 23 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భావజాలాన్ని ప్రచారం చేసి దేశంలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించేలా కృషి చేశారన్నారు.
1984లో ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయినప్పుడు అటల్ జీ వచ్చి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తాను ఎమ్మెల్సీగా ఉన్నానని, ఆ సమయంలో ఆ సమయంలో పార్టీ ఆదేశించగా తోడుగా మెలిగానని గుర్తు చేసుకున్నారు. పూర్వ బీజేపీ, ప్రస్తుత టీఆర్‌ఎస్ నాయకుడు మంద ఐలయ్య మాట్లాడుతూ 1983లో పరకాలలో అటల్ పాల్గొన్న సభకు తాను అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశం వచ్చిందని చెప్పారు. మరో పూర్వ బీజేపీ, ప్రస్తుత టీఆర్‌ఎస్ నాయకుడు కోల జనార్థన్ మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అటల్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్నారు.
1983లో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రామప్పకు తీసుకెళ్లానని, రామప్ప దేవాలయం, చెరువును చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారని, కాకతీయులు నిర్మించారని చెప్పితే అబ్బుర పడ్డారని వివరించారు. బీజేపీ నాయకురాలు డాక్టర్ టి.విజయలక్ష్మి మాట్లాడుతూ ఇతర పార్టీ నాయకులు అటల్‌ను గౌరవిస్తున్నారంటే వాజ్‌పేయి వ్యక్తిత్వతం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చన్నారు.
బీజేపీ సీనియర్ నాయకుడు నాగపురి రాజమౌళి మాట్లాడుతూ పరకాల, కరీంనగర్‌లో అటల్ పాల్గొన్న సభలో తనకు పాటపాడే అవకాశం వచ్చిందన్నారు. తాను రాసిన పాట పార్టీ గీతంగా మారిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చాడా శ్రీనివాస్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, గుజ్జ సత్యనారాయణ, మారెపల్లి విష్ణువర్థన్‌రెడ్డి, బండి సాంబయ్య యాదవ్ పాల్గొన్నారు.
వరంగల్ సీతాఫలాల రుచి చూసిన అటల్
హన్మకొండ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వరంగల్ సీతాఫలాల రుచిని చూశారు. 1983లో జిల్లా పర్యటనకు వచ్చిన ఆటల్ బిహారీ వాజ్‌పేయి జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు వన్నాల శ్రీరాములు ఇంటిలో భోజనం చేశారు. ఈ సందర్భంగా భోజనంతోపాటు సీతాఫలాలు అందించగా వాటిని ఎంతో ఆసక్తిగా తిన్నారని వన్నాల శ్రీరాములు తెలిపారు. సీతా ఫలాల రుచి బాగుందని తెలిపారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment