సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది.
ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్‌టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్‌గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది.
అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్‌పీఆర్‌సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్‌గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు.
తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్‌లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్‌తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది.
ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్‌పీఆర్‌సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment