కంగారు ఆభరణాలు | A Story On Komaraju Venkat Laxmanrao Book | Sakshi
Sakshi News home page

కంగారు ఆభరణాలు

Published Mon, Aug 12 2019 12:56 AM | Last Updated on Mon, Aug 12 2019 1:03 AM

A Story On Komaraju Venkat Laxmanrao Book - Sakshi

జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు’ అని పలికినాడు. 

చెన్న పట్టణమందలి షాహుకారుపేట లక్ష్మికి నివాస స్థలము. ఒకనాడుదయము జగజీవన్‌ లాల్‌ నాలుగంతస్థుల మేడ యెదుట రెండు గుఱముల కోచి బండి   నిలచెను. బండిలో వెనుక ప్రక్కనొక పురుషుడును, అతని భార్యయు గూర్చుండియండిరి. వారికి నెదుట నైదారు నెలల పిల్లవాని నెత్తుకొని యొక దాసి కూర్చుండి యుండెను. బండి వెనుక చిత్రమైన దుస్తులు ధరించిన గుఱపు వాండ్రిద్దరు నిలిచి యుండిరి. బండికి ముందు భాగమున నెత్తుగనున్న యాసనముపై కోచిమన్, వాని ప్రక్కన మరియొక సేవకుడును గూర్చుండియుండిరి. యజమానుడు తన జేబులో నుండి విజిటింగ్‌ కార్డు నొకదానిని తీసిచ్చెను. జగజీవన్‌ లాల్‌ ఆ కార్డును చూచుకొని రాజా ఆఫ్‌ నర్సాపూర్‌ అని చదివి తత్తరపాటుతో బండియొద్దకు వచ్చెను.

ఈ వర్తకుడు రవ్వలు, కెంపులు, పచ్చలు, వైఢూర్యముల వర్తకమే చేయుచుండును. పుష్యరాగముల వంటి తక్కువ వెలగల రాళ్ళనుగాని, వెండి బంగారములను గాని ముట్టనే ముట్టడు. అతని పద్దులన్నియు వేలు లక్షలు. రాజులు, మహారాజులితని వద్ద లక్షల కొద్ది వెల గల రాళ్ళను తీసికొని పోవుచుండిరి. అతడు బండి సమీపమునకు వచ్చిన తోడనే, సేవకుడు బండి తలుపుల దీసెను. బండిలో నుండి జమీందారు దిగి, షాహుకారుతో షేక్‌ హాండు చేసి ‘మీరేనా జగజీవనలాలు షేట్జీగారు’ అని యడిగెను. ‘కుబేరుని తరువాత తామే కుబేరులని వినియున్నాను’.
‘మీ వంటి రాజాధిరాజుల యనుగ్రహముండ నేను కుబేరుడనే, దయచేయుడు’ అని మాట్లాడుకొనుచు వారిద్దరును లోనికి పోయిరి. జమీందారు భార్యయు, పిల్లను నెత్తుకొన్న దాసియు లోనికి ప్రవేశించిరి. ఈ జమీందారుడు ఇంగ్లిషు ఫ్యాషన్‌ గలవాడగుటచే తన భార్యకు ఘోషా లేకుండజేసినట్లు కానవచ్చుచున్నది. ఘోషా లేదుకాని, యీమెకు వంటిమీద నగలు మాత్రము పరిమితముగా నుండెను. మెడలోనున్న సూర్యహారమే యొక పదివేలు, చంద్రహారమే పదియైదు వేలు చేయవచ్చును. కాళ్ళకున్న బంగారు పాంజేవులు అయిదువేలయిన ఖరీదు చేయవో? దాసి భుజముపై నిద్రించుచున్న బాలునికి మిక్కిలి విలువగల నగలు పెట్టబడెను.

మేడమీద గొప్ప గొప్ప రాజుల కొఱకై అలంకరించబడిన హాలులోనికి దీసికొనిపోయి జమీందారు నొక కుర్చీమీద కూర్చుండబెట్టి అతని భార్యకు కొంచెము చాటుననున్న యొక స్థలమును చూపించెను. 
జగ: ‘అయ్యా, తమ రాజధాని ఏ జిల్లాలోదండి.’
జమీం: ‘మా సంస్థానము గోదావరి జిల్లాలోనున్నది. మేము కలక్టరును చూచుటకు వెళ్ళినపుడు పదిహేను ఫిరంగులు కాల్చెదరు. వెండి కుర్చీల మీదగాని మేము కూర్చుండము. కానీ నేనింగ్లిషు యెడ్యుకేటెడ్‌ జంటిల్‌మన్‌ అయినందున ఈ పిచ్చి ఆచారములు పాటింపను. టట్‌ నాన్సెన్సు అని మా ఆడవారి ఘోషా కూడా తీసివేసితిని. ఈ సంగతులకేమి గాని నిన్నటిదినము జయపురము మహారాజు మీవద్ద కొన్న లక్ష రూపాయల జవాహిరి చూచితిని. వారికి నాకు మిక్కిలి స్నేహము.’

జగ: ‘చిత్తము, మహారాజులంగారికి నాయందు మిక్కిలి అనుగ్రహము.’
జమీం: ‘రవ్వలంటే మీ వద్దనే రవ్వలు, ఏమి ఆ కాంతి? ఇంకను అట్టి రవ్వలు గలవా?’
జగ: ‘కొనువారుండిన రవ్వలకేమి తక్కువ. తెప్పించెదనా?’ అని అడిగి, లేచి లోనికి బోయి సేవకునిచే నొక పెద్ద ట్రంకు పెట్టెను పట్టించుకొని వచ్చి బల్లమీద పెట్టి దానిందెఱిచి రవ్వల పొట్లము నొకటి వెనుక నొకటి తీయుచు జమీందారు గారికి చూపదొడగెను. ఇవి బాగున్నదని బాగుండ లేదనియు జెప్పుచు, దీని వెల యెంత దాని వెల యెంత అని అడుగుచు ‘మీరు మిక్కిలి సత్యసంధులని జయపుర మహారాజా గారు నాతో చెప్పినంతనే వచ్చితిని. క్రమమైన వెల జెప్పవలయును సుమా’యని నడుమ నడుమ ననుచు తనకు చక్కగ గానుపించిన వానిని భార్య వద్దకి తీసుకొనివెళ్ళి చూపుచు మరల దెచ్చును. గంట వఱకు బేరము చేసెను. తుద కేబది వేల రవ్వలను బేరము చేసి విడిగా తీయించెను. షాహుకారు జమీందారు రత్నపరీక్ష జ్ఞానమునకు యాశ్చర్యమందుచు నడుమ నడుమ అతనిని పొగడుచుండెను.
ఇట్లు సిసలు పఱిచిన రవ్వలనన్నింటిని చిన్న చిన్న పొట్లములుగా గట్టి ఆ పొట్లముల నన్నింటిని జమీందారు తనయొద్దనున్న పెద్ద మనీగాన్‌లో పెట్టి దానిని తన జేబులో నుంచుకొని షాహుకారుతో నిట్లనియె.

‘అయ్యా, అప్పనగా నాకు చీదఱ. కొన్న సరుకులకు వెలవెంటనే ఇయ్యవలయునని నా తాత్పర్యము. ఇంటి నుండి బయలుదేరునప్పుడు మీవద్దకు రావలెనని యనుకొనలేదు. ఈ త్రోవన మఱియొక చోటికి పోవుచుండగా నదియే మీ యిల్లని మా బండివాడు చెప్పెను.  మిమ్ముల చూడవలెనని యాగితిమి. చూచినందుకు లాభమేయైనది. నిచ్చటికి వచ్చెదమని తలంపనందున పైకము తేలేదు. నేను యింటికి వెళ్ళి పైకము తీసుకొని వచ్చెదను. అంతవఱకు మన వాండ్రిక్కడనే యుండెదరు. తండియార్పేట వఱకు మనవాళ్లను తీసుకొని వెళ్ళవలసిన పనివున్నది. కావున ఇప్పుడు వీని నింటికి తీసుకొని పోవుట యెందుకు’ అని చెప్పి యాతడు లేచి భార్యతో నే వచ్చువఱకు నీ విక్కడనే యుండుమని చెప్పి కోచిబండి నెక్కి వెళ్ళిపోయెను.
భార్యాపుత్రులను యుంచి వెళ్ళుటకు జమీందారు గారొక కారణము చెప్పినను, జగజీవనలాలు మాత్రమా కారణమును నమ్మక, జమీందారు మిక్కిలి మర్యాదగల వాడగుటచే, తన నమ్మకమునకై వారిని తన ఇంట దించిపోయెనని తలచి, సంతసించెను.

జమీందారు వెళ్ళి అరగంటయిన తరువాత సేవకుడు పరుగెత్తుకొని వచ్చి ‘దొరసానిగారూ? ఖజానా తాళపుచేతుల గుత్తి మీవద్దనే యున్నదట, దొరగారు మరచి వెళ్ళినారు. తొందరగా తీసుకొని రమ్మని నన్ను పంపినారు. ప్రొద్దెక్కుచున్నది. పైకము తెచ్చి షాహుకారుగారికిచ్చి మనము తండియార్పేట వెళ్ళవలసి యున్నది’ అని పలికెను. అంతనామె తాళపు చేతుల గుత్తి వానిపై వేసి తొందరగా పొమ్మని యాజ్ఞాపించెను. వాడు పదియడుగులు వేయగా మరల వానిని బిలిచి ఏమో యాలోచించి ‘గుత్తి నిటుతే’యని, ‘దినములు మంచివి కావు. లక్షల కొలది ధనమున్న ఖజానా తాళపుచేతులు వీనికిచ్చి పంపిన వీడేమి చేయునో? వీడు నమ్మిక కలవాడే గాని ధనముజూచిన ఎట్టి వారికి దుర్బుద్ధి పుట్టకమానదు. ఏమండీ షాహుకారుగారూ నిజమేనా?’ అని యడుగగా నాతడు ‘నిజమే నిజమే. డబ్బునెడల బహు జాగ్రత్తగా నుండవలెను’ అని తల యూపెను. ‘అట్లయిన నేనే తాళపుచెవుల గుత్తిని తీసుకొని వెళ్ళి పైకము తీసుకొని మేమిద్దఱము వచ్చెదము. నేను వచ్చు వఱకు అబ్బాయి పాలకేడ్చునేమో కావున కొంచెము పాలిచ్చి వెళ్ళెదనని ‘సీతా సీతా’యని దాసిని పిలిచెను.

దాసి పిల్లవానిని జోలపాడి నిద్రబుచ్చుచు మేడ క్రింద నొంటరిగా నుండెను. దాని జోల పాట మాత్రము పైకి వినబడుచుండెను. పిలిచిన తోడనేయది పిల్లవానిందీసికొని యజమానురాలి వద్దకు వచ్చెను. పిల్లవాని శరీరమంతయు నగలతో నిండియుండెను. రవ్వల, కెంపుల, పచ్చల పతకములు వ్రేలాడుచు ముఖమును కప్పివేసి యుండెను. యామె వానికి పాలిచ్చి యొక చిన్న పరుపు దెప్పించి వానినచ్చట బరుండబెట్టి భద్రమని దాసికి జెప్పి తన శరీరము మీది యేబది యరువది వేల విలువగల నగలను తీసి యాపిల్లవాని ప్రక్కనే యుంచి ‘మీ నమ్మిక కొఱకు వీనినిక్కడ నుంచుచున్నానని’ షావుకారుతో చెప్పెను. ‘కోటి వెలగల మీ కుమారునే ఇచ్చట నుంచుచున్నపుడు వేరే నగలుంచవలయునా? ఒకరిపై నొకరికి నమ్మకం లేని యెడల కలియుగ మెట్లుసాగు’నని, ‘మీరు వెళ్ళుటకు నా కోచిబండిని తెప్పింతునా’ అని యడిగెను. అచటనున్న సేవకుడు ‘అక్కర లేదు. నేను నడచి వచ్చిన తాళపు చేతి గుత్తి తీసికొని వచ్చుట కాలస్యమగునని నా యజమానుడు నన్ను కోచిబండి మీదనే పంపెను’ అని చెప్పెను. 

యజమానురాలు వెడలిన కొంతసేపటికి దాసి షాహుకారు వద్దకు వచ్చి ‘అయ్యా బీదదానిని. మా దొరవారు మీ యొద్దనెన్నో రాళ్ళు కొన్నారు. మీకింత లాభమైనప్పుడు నాకు కొంచెము యీనామియ్యకూడదా? దొరసానితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను’ అని పెక్కు మాటలు చెప్పి ఎప్పుడెవ్వరి కేమియు నియ్యని లుబ్ధాగ్రేసర చక్రవర్తియగు జగజీవనలాలు యొద్దనుండి యొక రూపాయి బహుమానము వడసెను. రూపాయి చేతిలో పడగానే ‘అయ్యా, కల్లుగాని, సారాగాని త్రాగనిది యుండలేము. మా దొరగారికి దొరసాని గారికీ పేరన్న గిట్టదు. నెలదినముల నుండి లేక చచ్చిపోవుచున్నాను. వారు వచ్చువఱకు ఈ ప్రక్క యంగడిలోనికి పోయి పావులా సారా తాగి వచ్చెదను. నిముసములో వచ్చెదను. అంతవఱకు చిన్నదొరగారికి కొంచెము చూచుచుండుడి. నిద్రలో ఏడ్చెనేని కొంచెము జోకొట్టుడి’ అని చెప్పి వెడలిపోయెను.

పది గంటలాయెను. పదునొకండు గంటలాయెను. పండ్రెండు గంటల సమయమై ‘ధమ్మ’ని ఫిరంగి మ్రోత వినబడెను. షాహుకారుకు సంశయము పుట్టదొడగెను. కడుపున పుట్టిన బిడ్డను, ఇంత ధనముని విడిచి వారేల పోయెదరని సమాధానము చేసికొనెను. నొంటిగంటయ్యె. అప్పటికైనను, ఎవ్వరు తిరిగి రాలేదు. నిద్రబోవుచున్న పిల్లడైనను యేడువలేదు. ఆహారము లేక సొమ్మసిల్లెనేమోయని షాహుకారు పిల్లవాని యొద్దకుపోయి నెత్తుకొని చూడ యాశ్చర్యము! అది పిల్లవాని యంతయాకారము గల యొక జాతి బొమ్మ!! షాహుకారు సేవకులనందఱిని పిలిచి చూపెను. వారందఱును అదియొక మోసమని తెలిసికొని ‘మోసమైన మనకేమి, మనరాళ్ళ వెలకంటె మించిన నగలున్నవి’ యని నగలకు మదింపు వేయసాగిరి. ఒక్కోనగ తీసి చూచిన కొలదిని అవి గిల్టు నగలేకాని నిజమైనవి కావని స్థిరపడెను. నగలన్నియు నూరు రూపాయల కంటె వెలచేయవు.

పోలీసు వారికీ సమాచారమును తెలిపిరి. పోలీసువారు కొందఱును జగజీవనులాలు సేవకులు కొందఱును మాఱు వేషములతో నర్సాపురము వెళ్ళి విచారించి, నర్సాపురపు జమీందారీ సృష్టియందెచ్చటను లేదని తిరిగివచ్చిరి. ఎంతమంది జమీందారులనో మోసపుచ్చిన తనను ఈ బూటకపు జమీందారు మోసపుచ్చె గదాయని చింతించుట తక్క జగజీవనులాలుకు మఱియేమి యుపాయమును లేకపోయెను.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు (1877–1923) కథ ‘ఏబది వేల బేరము’కు సంక్షిప్త రూపం. కె.రామానుజరావు అనే కలంపేరుతో రాశారు. ఆంధ్రపత్రికలో 1910లో ప్రచురితం. సౌజన్యం: వికీపీడియా. కొమర్రాజు తెలుగు, మరాఠీ భాషల్లో సమాన పండితుడు. సంస్కృతం, హిందీ, బెంగాలీ, గుజరాతీ భాషల మీదా పట్టుంది. శివాజీ చరిత్ర, హిందూ మహాయుగము, ముస్లిం మహాయుగము రాశారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక గ్రంథమండలి వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువరించారు. వ్యక్తి కాదు, సంస్థ అనిపించుకున్నారు. అనారోగ్యంతో 46 ఏళ్లకే మరణించారు. తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ ఈయన అక్క.
 
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement