మేలు చేయడం పుణ్యం... పీడించడం పాపం! | doing good is great thing | Sakshi
Sakshi News home page

మేలు చేయడం పుణ్యం... పీడించడం పాపం!

Published Sat, Jan 25 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

మేలు చేయడం పుణ్యం... పీడించడం పాపం!

మేలు చేయడం పుణ్యం... పీడించడం పాపం!

పద్యానవనం
  నీవు భుజింపుమా కడుపు నిండ, క్షుథార్తుల కింత పెట్టుమా! నీవు సుఖింపుమా, పరుల నీవలెనే మననీయుమా, మరే త్రోవల కడ్డురాకు, పెడత్రోవల కాలిడబోకు మిద్దియే జీవితమన్న, పంకిలము సేయకు స్వామి వర ప్రసాదమున్!
 
 మనిషి జీవితం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. జీవులలోకెల్లా ఉత్కృష్టమైంది మానవజన్మ అంటారు. మననిలా మనుషుల్లా పుట్టించినందుకు ఆ సృష్టికర్తకు కృతజ్ఙులమై ఉండి ఆయన కృషిని సార్థకం చేయాలి. అంటే ఏం చేయాలి? పెద్దగా ఏదేదో చేసేయాలేమో అని బెంబేలుపడి పోనవసరం లేదు. ఇంగ్లీషులో ‘లివ్ లెట్ లివ్’ అనే మాటుంది. అంటే, బతుకు బతకనివ్వు. ఇక్కడ కూడా, ‘నువు తిను, ఇతరుల్ని తిననియ్, నీలాగే సుఖపడనీయ్, ఎవరికీ అడ్డుపడకు, చెడుపోకడలు పోకు...’ అనే జీవిత కర్తవ్యాన్ని అందంగా చెప్పాడు తన రుబాయిల్లో పారశీక కవి ఉమర్ ఖయ్యామ్. దాన్ని భావానుకృతి రూపంలో ‘అమర్ ఖయామ్’గా తెలుగించారు కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి. అలతి అలతి పదాలతో పద్యాన్ని పరువులెత్తించే మంత్రదండమేదో శాస్త్రి వద్ద ఉండి ఉంటుంది.
 
 బుద్ధుడి చరిత్ర రాసినా, పుష్ప విలాపం వినిపించినా, కుంతి కథ చెప్పినా... ఆయనది అదే ఒరవడి. ఆయన పద్యాల్లో అక్షర రమ్యతే కాకుండా అరటిపండు ఒలిచిపెట్టినట్టు భావం కూడా ఇట్టే అర్థమైపోతుంది. మచ్చుకు ఈ పద్యమే చూస్తే, ప్రతిపదార్థం విడదీసి భావం చెప్పనవసరం లేదు. దేవుడిచ్చిన వర ప్రసాదాన్ని బురదమయం చేయొద్దంటున్నాడు. అలా చేయొద్దంటే, ఏం చేయాలో క్లుప్తంగా చెబుతున్నాడు. ఇటువంటి వ్యక్తీకరణలు మన పురాణేతిహాసాల్లో తరచూ కనిపిస్తాయి. ధర్మాలలోకెల్లా ఉత్తమోత్తమమైన ధర్మమేది? అన్న ప్రశ్నకు మహాభారతంలో ఓ చక్కని పద్య రూపంలో సమాధానముంది.  ‘...ఇతరులు మనకు ఏం చేయగూడదని కోరుకుంటామో, అవేవీ మనం ఇతరులకు చేయకూడదు’ అనే అద్భుతమైన సందేశాన్ని ‘ఒరులేయవి యొనరించిన...’అనే చిన్న పద్యంలో చెబుతాడు తిక్కన. వ్యాసుడు ఒక సందర్భంలో ఇదే మాట అత్యంత సంక్షిప్తంగా చెబుతాడు. ‘‘శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యధుక్తం గ్రన్థకోటిభిః...’’ కోటి గ్రంథాలకు సమానమైన భావాన్ని అర్ధ శ్లోకంలో చెబుతానంటాడు. అదేమంటే, ‘‘పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం’’. ఇతరులకు మేలు చేయడం పుణ్యం. ఇతరులను పీడించడం పాపం. చూశారా, సూక్ష్మంలో మోక్షం అంటే ఇదే!                                                       
 - దిలీప్‌రెడ్డి
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement