ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం! | P. V. R. A Letter Written By Sivakumar.. Those Three.. A Letter Funday Story | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురూ... ఓ ఉత్తరం!

Published Sun, Jun 23 2024 2:24 AM | Last Updated on Sun, Jun 23 2024 2:24 AM

P. V. R. A Letter Written By Sivakumar.. Those Three.. A Letter Funday Story

సుమిత్ర చెప్పిన కథ: వాసుకి పిచ్చి పిల్ల. నాకన్నా ఎనిమిదేళ్ళే చిన్నది. అయినా, నా కూతురు స్థానంలోకి వచ్చింది. పొరబాటుగా అంటున్నాను, ఆమె పీడకలలో కూడా ఊహించని మారుటి అమ్మ స్థానంలోకి నేనే బలవంతంగా చొరబడిపోయాను.
      నా దురదృష్ట జీవితం గురించి చెప్పుకోవటం నా అభిమతం కాదు. నా మూలంగా అతలాకుతలమైన అమాయకురాలు వాసుకి గురించి చెప్పటానికే నా ప్రయత్నం.

తనకో బుల్లి తమ్ముడిని ఇచ్చే క్రమంలో, పసిగుడ్డుతో సహా ఆమె తల్లి పై లోకాలకి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా వాసుకి పసి మనసు తల్లడిల్లిపోయిన ఘడియలు అవి. 
      రెండేళ్లపాటు ఆమెకి ఇంక తన నాన్నతోనే లోకం అయిపోయింది. మాయమైపోయిన అమ్మ మీది ప్రేమ కూడా నాన్న మీదకి మళ్లించుకుని, నాన్న ఇంట్లో ఉన్నంతసేపూ వెన్నంటే ఉండేది. 
      ధన్వంతరిగారు, అంటే వాసుకి నాన్న, ఉద్యోగరీత్యా తరుచూ టూర్లు తిరగవలసి ఉండేది. ఆయన ఊళ్ళోలేనన్ని రోజులూ భయంకరమైన ఒంటరితనం వాసుకిని వణికిస్తూ ఉండేది. అలాగని ఎవరినీ తోడు పిలుచుకోవటమూ ఇష్టం ఉండేది కాదు. ఒక్కతే తన లోకంలో తను బిక్కుబిక్కుమంటూ గడుపుతూ ఉండేది.

      ధన్వంతరిగారు ఉద్యోగరీత్యా తరచూ వచ్చే ఊళ్ళలో మాదీ ఒకటి. నా మేనమామ నాగఫణి ఆయనకి సన్నిహితుడు. ఆయన మా ఊరు వచ్చినప్పుడల్లా మా యింట్లోనే ఉండేవారు. ఆయన మాటల్లో అస్తమానూ వాసుకి విషయాలే దొర్లేవి. వాసుకిని నేను చూడకపోయినా, ఆ విధంగా తన విషయాలన్నీ తెలుస్తూనే ఉండేవి. 
      తల్లీ, తండ్రీ లేని నేను నా మేనమామ పెంపకంలో ఉండేదాన్ని. మొదటి నుంచీ చదువు సంధ్యల మీద శ్రద్ధలేకపోవటంతో, టెన్త్‌ఫెయిలయ్యాక ఇంటికే పరిమితమైపోయాను. 
      చదువుకోవటం లేదనీ, పనీపాటా కూడా సరిగ్గా చేయటంలేదనీ ఎప్పుడూ విసుక్కుంటూ, అడపా దడపా చెయ్యి చేసుకుంటూ ఉండే మామయ్య, నైన్త్‌సెలవుల్లో నాలో శారీరకంగా మార్పులు చోటు చేసుకోవటం మొదలైనప్పటినుంచీ తిట్టటం, కొట్టటం తగ్గించాడు. నా పట్ల ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పుని, హద్దులు మీరిన చొరవనీ ‘అభిమానం’ అనే భావించాను.

      అయితే, అలా ఎన్నాళ్ళో సాగలేదు. ఒక రోజున జరిగిన పెద్ద గొడవ తరవాత మామయ్య దుబాయి పారిపోయాడు.
ఆ విషయం కూడా ధన్వంతరిగారు చెబితేనే నాకు తెలిసింది. ఎప్పటిలాగానే ఏదో టూర్‌ వెళ్లాడనుకున్న మామయ్య నన్ను వదిలించేసుకుని వెళ్లిపోయాడని తెలిశాక, నేనున్న పరిస్థితికి ఆత్మహత్య తప్ప మరోదారి తోచలేదు. ధన్వంతరిగారే అడ్డు పడకపోతే, అదే నా దారి అయ్యేది. నెల రోజులపాటు తర్జన భర్జనలు పడ్డాక, ధన్వంతరిగారు నన్ను తన జీవితంలోకి తీసుకుపోయారు.

ఇదేమిటీ, నా ప్రియమైన వాసుకి గురించి మొదలెట్టి, నా సొదలోకి వెళ్లిపోయాను?
నేను వాళ్ళింట్లో ప్రవేశించటం, అదీ ఆమెకి అమ్మగా వెళ్ళటం వాసుకికి పెద్ద షాక్‌. ఆమెకి నా మీద ద్వేషంతో పాటూ, తన తండ్రి మీద కూడా అసహ్యం జనించింది. నేనూ, ధన్వంతరిగారూ ఏం చెప్పబోయినా వినిపించుకోనంతగా తన చెవులను శాశ్వతంగా మూసి వేసుకుంది. నాతో మాటలే ఉండేవి కావు. వాళ్ళ నాన్నతో కూడా అత్యవసరమయితేనే అతి క్లుప్తంగా మాట్లాడేది. ఇంట్లో తక్కువగా ఉండేలా చూసుకునేది. వెళ్తే కాలేజీ, లేదా ఫ్రెండ్స్‌ ఇళ్ళలో గడిపేస్తూ ఉండేది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పూర్తిగా తనగదికే పరిమితమైపోయేది.

ఆఖరికి వాళ్ళింటికి వెళ్ళిన కొద్ది నెలలకి, నేను చావు బతుకుల్లో హాస్పిటల్‌ పాలైనప్పుడు, నన్ను చూడటానికి కూడా వాసుకి రాలేదు. ఇంటికి వచ్చాక అయినా పలకరించలేదు. అందుకు నేను ఏమీ అనుకోలేదు, నేనది ఆశించలేదు గనుక. 
      గతుకులబాటలో అతకని బతుకు అలాగే పదేళ్ళ పాటు గడిచింది. వాసుకి చదువు పూర్తయి ఉద్యోగం సంపాయించుకుంది. ఉద్యోగంలో చేరటానికి ఊరు వెళ్ళే ముందు రోజున తన పెళ్లి విషయం ప్రస్తావించారు ఈయన.

‘నా పెళ్లి గురించీ, నా బతుకు గురించీ ఇంక మీరు ఆలోచించవద్దు. అసలు కల్పించుకోవద్దు’ అని కరాఖండిగా చెప్పేసింది వాసుకి.       నేను మ్రాన్పడిపోయాను. ఆయన దిగులుపడిపోయారు. మర్నాడు వాసుకి వెళ్ళిపోయింది. 
ఏడాది గడిచింది. ఈ ఏడాదిలోనూ, వాసుకి ఒక్కసారి కూడా తొంగిచూడలేదు. ఫోన్‌ చేసినా తీసేది కాదు.
      నాది రాతి గుండె కాబోలు, ఇంకా బతికే ఉన్నాను. ఆయన గుండె మాత్రం అది తట్టుకోలేక ఆగిపోయింది. 
తండ్రి చివరి చూపుకోసం, చివరిసారిగా ఇంటికి వచ్చింది వాసుకి. 
      దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది, ఇంక నేను చెప్పలేకపోతున్నాను, క్షమించండి. 
...
వాసుకి చెప్పిన కథ:
నేను నాన్న గురించి చెప్తాను.. ముందు నేను అమితంగా ప్రేమించిన నాన్న, తరవాత అంతకన్నా ఎక్కువగా ద్వేషించిన నాన్న గురించి. నేను చేసిన దిద్దుకోలేని తప్పు గురించి!
      తమ్ముడిని తెస్తానని ప్రామిస్‌ చేసిన అమ్మ, హాస్పిటల్‌ నుంచి రాకుండా మోసం చేసి, తమ్ముడితో సహా పైకి వెళ్ళిపోయింది. ఏడుస్తూ నేనూ, ఓదారుస్తూ నాన్నా మిగిలాం.

    అమ్మంటే నాకు ఆరోప్రాణం. అందరికీ అంతేనేమో! కానీ, అందరమ్మల్లా కాకుండా, తొందరగా వెళ్లిపోయిందని బాధ. అందుకే, అమ్మ మీది ఆరవ ప్రాణాన్ని నాన్న మీదికి మళ్లించుకున్నాను. ఇంక నాకు మిగిలింది నాన్నేగా! 
    అమ్మ చనిపోతే నాన్న దిగులుపడ్డాడా? ఏమో! పడినట్టు కనిపించేవాడుకాదు. 
    ‘నీ కోసమే మీ నాన్న దిగులు దిగమింగుకుని బతుకుతున్నాడు’ అనేవాళ్లూ చుట్ట పక్కాలూ, ఇరుగుపొరుగూ.
‘అవునేమో’అనుకున్నాను నేనూనూ, కొన్నేళ్ళ దాకా. 
    ‘ఏమంత వయసు మీరిపోయిందని ఇలా మిగిలిపోతావ్‌? ఆ పిల్లకయినా ఓ తల్లిని తెచ్చే ఆలోచన చెయ్యి’ అంటూ అయినవాళ్ళు ఇచ్చే సలహాలను నిర్ద్వంద్వంగా కొట్టిపారేసేవాడు నాన్న.

‘దానికి అమ్మ చేతిలో పెరిగే యోగం ఉంటే, వాళ్ళమ్మ అర్ధాంతరంగా కన్ను మూసేది కాదు. మిగిలింది వాసుకి నేనూ, నాకింక వాసూ. ఇదే రాసిపెట్టాడు భగవంతుడు. ఇదే నిర్ణయం నాది కూడా’ అని చెప్పేసేవాడు మారు ఆలోచన లేకుండా. అలాంటి మాటలు వింటున్నప్పుడల్లా నేను నాన్నని గట్టిగా కౌగలించుకుని ఏడిచేసేదాన్ని.

అటువంటి నాన్న హఠాత్తుగా మారిపోయాడు. ఎన్నో ఏళ్లు కాదు, నాలుగేళ్ళు గడిచాయేమో, అంతే. 
    ఉద్యోగం పని మీద అప్పుడప్పుడూ ఊరు వెళుతూ ఉండే నాన్న ఓసారి ఊరి నుంచి మా ఇద్దరి మధ్య నిలిచేలా ఓ పెద్ద అడ్డు గోడని తెచ్చాడు. అది ‘అమ్మ’ అని చెప్పాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. పట్టరాని ఏడుపు వచ్చింది.
    ఆ వ్యక్తి ముందర ఏడవటానికి కూడా అసహ్యం వేసింది.
వెంటనే నాగదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకున్నాను. అంతటితో ఆగకుండా నా మనసు కూడా మూసేసుకున్నాను. 
    ఆ రోజు నుంచీ నాన్నంటే కూడా అసహ్యం వేసింది.

    ‘భార్య పోయిన నాలుగేళ్ళకి మరో భార్య మీదికి మనసు పోయింది! మగాళ్ళంతా ఇంతేనా? నాన్నలాంటి మగాళ్లు కూడా ఇంతేనా? నేననుకునే లాగా ఏ నాన్నలూ ఉండరా? రామావతారంతోనే, రాముడి గుణాలూ లోకంలో అంతరించిపోయాయా?’
    నాన్న అంత తేలికగా ఎలా బలహీనపడిపోయాడో అర్థం కాలేదు. గీత దాటాడని తెలిశాక, కారణాలు, సంజాయిషీలు వినాలన్న కోరిక కూడా మిగల్లేదు. ఆయన పెట్టిన అడ్డుగోడ మీద నుంచి తొంగి చూడాలని కూడా అనిపించలేదు. 
    నేనే గనక మగపిల్లవాడినయి ఉంటే, ఆరోజే ఇంట్లోంచి పారిపోయేవాడిని. ఆడపిల్లగా నాకు కొన్ని పరిధులు, పరిమితులు ఉన్నాయి గనుక, ఆ పని చేయలేదు. ఇంట్లోనే నా చుట్టూ ఇనుప చట్రాన్ని బిగించుకున్నాను. మూతికి చిక్కం కట్టుకున్నాను. అత్యవసరమైతే తప్ప వాటిని సడలించకుండా నెట్టుకు వచ్చాను.

అయ్యో, నేను చెప్పదలుచుకుంది నాన్న గురించి కదా, అదే చెప్తాను. 
    నా అభిప్రాయం మారి ఉండకపోతే, నాన్నని అసలు తలుచుకునేదాన్నే కాదు. 
నాన్న సుమిత్ర పిన్నిని మా ఇంట్లో ప్రవేశపెట్టినప్పుడు కలిగిన ద్వేషం ఆయన పోయాక కూడా తగ్గలేదు, 
    ఇన్నేళ్ల వరకూ.. ఆ ఉత్తరం .. ఇన్నేళ్ళూ అజ్ఞాతంలో ఉండిపోయిన ఆ ఉత్తరం నా కంట పడేవరకూ!
ఇప్పుడు నా తొందరపాటు, దురుసుతనం, పెడసరి ప్రవర్తనతో జీవితంలో నేనేం కోల్పోయానో, నన్ను అమితంగా ప్రేమించిన నాన్నకి     ఎంత అన్యాయం చేశానో తెలుస్తుంటే, పశ్చాత్తాపంతో మనసు కాలిపోతోంది. నాన్నకి ఇప్పటికైనా ఆత్మశాంతి కలగాలంటే ఏం చేయాలో మాత్రం స్పష్టంగా బోధపడింది. ఆ బోధ కూడా అన్యాపదేశంగా తన ఉత్తరం ద్వారా నాన్న చేసినదే! 
∙∙ 
ధన్వంతరి చెప్పిన కథ:
    నేనిలా మీతో మాట్లాడవచ్చో, మీకు నా మాటలు చేరతాయో లేదో తెలియదు. మనుషులు మాట్లాడుకుంటారు. నేనిప్పుడు మనిషిని కాదు. ఒకప్పటి మనిషికి ఆశలు తీరని ఆత్మని! 
    అయినా, నా ప్రయత్నం చేస్తాను. నా మిగిలిన ఆశలేమిటో మీకు చెప్పుకుంటాను. 
నేను ముందుగా చెప్పబోయేది అభాగిని సుమిత్ర గురించి. 
    సుమిత్ర నాకు పరిచయమయ్యింది నాగఫణి దగ్గర. నాగఫణి, తన ఊళ్ళో ఉన్న మా కంపెనీ బ్రాంచ్‌కి హెడ్‌. 
నేను కంపెనీ పని మీద తరచూ ఆ ఊరు కూడా వెళ్తుండటం మూలాన నాకు సన్నిహితుడయ్యాడు. సన్నిహితుడయ్యాక అతడి అలవాట్ల వలన దూరమయ్యాడు.. మానసికంగా!

నాగఫణికి ఆ ఊళ్ళో సొంత ఇల్లు ఉంది. తన ఇంట్లో ఒక గది మా కంపెనీకి గెస్ట్‌ రూమ్‌గా లీజుకి ఇచ్చాడు నాగఫణి. అందుకే ఆ ఊరు వెళ్ళినప్పుడు, కంపెనీ నిబంధనల ప్రకారం ఆ రూమ్‌లోనే నా బస. 
    ఆ ఇంట్లోనే నాగఫణి మేనకోడలయిన సుమిత్ర పరిచయం అయింది. అమాయకంగా ఉండే సుమిత్రకి తల్లిదండ్రులు లేరని తెలిసి బాధ పడ్డాను. ఆమె మీద నాకు  జాలిగా ఉండేది. 
    మొదట్లో, నాగఫణి ఆమె చేత ఇంటిపనులన్నీ చేయిస్తూ కూడా, ఆమె మీద దాష్టీకం చలాయిస్తున్నట్టు తోచేది. సొంత మేనకోడలు, అతడి సంరక్షణలో ఉంది కనుక అది సహజం అనుకుని సరిపెట్టుకున్నాను. రెండు మూడేళ్ళ తరవాత ఆమె పట్ల నాగఫణి ప్రవర్తనలో కొంత వికృతి కనిపించసాగింది. అయితే, నాకు సంబంధంలేని విషయం అనుకుని ఊరుకుండిపోయాను.

    ఉన్నట్టుండి ఆఫీసులో దుమారం చెలరేగింది. నాగఫణి బ్రాంచ్‌ అకౌంట్ల విషయంలో పెద్ద మొత్తం తేడా కనబడింది. అ బ్రాంచ్‌ పరిధిలోకి వచ్చే కస్టమర్ల దగ్గర వసూలు చేస్తున్న డబ్బు సవ్యంగా కంపెనీ అకౌంట్‌కి జమ కావటంలేదని తేలింది. యాజమాన్యం అతడి నుంచి తేడా వచ్చిన మొత్తం డబ్బు వసూలు చేయటమే కాక, అతడిని ఉద్యోగం నుంచి కూడా తొలగించింది. ఆ ఆర్డర్స్‌ వచ్చేసరికి నేను అతడి ఇంట్లోనే ఉన్నాను. 
    ఆ రాత్రి సుమిత్ర, నాగఫణి మధ్య ఏదో ఘర్షణ జరగటం వినపడింది. మర్నాడు ఉదయమే నేను బయలుదేరి వచ్చేశాను. ఒక వారం తరవాత ఆఫీస్‌లోని నాగఫణి సన్నిహితుల ద్వారా తెలిసింది, ముందునుంచే ప్రయత్నంలో ఉన్న నాగఫణి, ఇది జరగగానే దుబాయి వెళ్లిపోయాడని. సుమిత్ర విషయం తెలియలేదు.

    ‘ఆమెని కూడా తీసుకు వెళ్లాడేమో’ అనుకున్నాను. 
తరవాతి వారం ఆ ఊరు వెళ్లినప్పుడు తెలిసింది, నాగఫణికి ఆపాటి ఔదార్యం కూడా లేదని! 
    సుమిత్రను కలిశాను. నాగఫణి ఉద్యోగం పోయిన విషయం గానీ, అతడు దేశం విడిచి వెళ్ళిన విషయం గానీ ఆమెకి తెలియదు! 
నేను చెప్పగానే భోరుమంది. అప్పుడు చెప్పుకొచ్చింది తన పరిస్థితి. సుమిత్ర అమాయకత్వాన్నీ, నిస్సహాయతనీ ఆసరాగా తీసుకుని, నాగఫణి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నాడు. తగిన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి, గత రెండేళ్లుగా ఆమెతో సంబంధం కొనసాగించాడు. కష్టాలు కలిసికట్టుగా వస్తాయన్నట్టు, ఇప్పుడామె గర్భవతి. ఆ విషయం తెలిసి, జాగ్రత్తలు తీసుకోలేదని ఆమెనే నిందించి, ఆ రాత్రి ఘర్షణ పడ్డాడు. ఆమెకి చెప్పకుండా పలాయనమై పోయాడు.

    విషయం వినగానే నిర్ఘాంతపోయాను. ఏం చేయగలనో తోచలేదు. 
‘తొందరపడి ఏమీ చేసుకోవద్దనీ, నేను మళ్ళీ పై వారం వస్తాననీ, ఆలోచించి ఒక దోవ చూపిస్తాననీ’ చెప్పి వచ్చాను.
స్వంత ఇల్లు కాబట్టి, నాగఫణి వెళ్లిపోయినా గూడు మిగిలింది సుమిత్రకి. 
    తరవాతి వారం వెళ్ళినప్పుడు, ఆమెను అబార్షన్‌ చేయించుకోమని సలహా ఇచ్చాను. అప్పటికే సమయం మించిపోయిందనీ, సాధ్యపడదనీ చెప్పింది డాక్టర్‌. సుమిత్రని ఎలా ఓదార్చాలో తెలియలేదు.
    ‘నా పరువు బజార్న పడిపోయింది. ఇంక నాకు చావు తప్ప గత్యంతరం లేదు’ అని హిస్టీరికల్‌గా ఏడ్చేసింది. 
నాతో వచ్చేయమన్నాను. ‘వచ్చి, ఏం చేయాలని?’ సూటిగా అడిగింది. వెంటనే సమాధానం దొరకలేదు. 
    ఎంతో ఆలోచించాక చెప్పాను, ‘నిన్ను పెళ్లి చేసుకుంటాను.. బయటివాళ్ళ కోసం. నీ బిడ్డకి తండ్రిని అవుతాను.. నీ పరువు నిలవటం కోసం. అంతవరకే మన సంబంధం!’

ఆమె అంగీకరించింది. మర్నాడు ఇంట్లోనే దేవుడి పటం ముందు ఆమె మెళ్ళో తాళి కట్టి, మా ఇంటికి తీసుకు వెళ్ళాను. చిన్నదైన వాసుకికి సర్దిచెప్పగలను అనుకున్నాను. ఎంత తప్పుగా ఆలోచించానో వాసుకి రియాక్షన్‌ చూశాక తెలిసివచ్చింది. సుమిత్రని ఆదుకున్నానుగానీ, నన్ను నేను నిప్పుల్లోకి నెట్టుకున్నాను. నా చిన్నారి వాసుకిని అంతులేని క్షోభకి ఆహుతి చేశాను.

ఇంతా చేస్తే, సుమిత్రకి తన బిడ్డ కూడా దక్కలేదు. నెలలు నిండుతుండగా తెలియని ఆరోగ్య సమస్య ఏదో ముంచుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడటమే గగనమైపోయింది. అంతవరకూ, ఆ తరవాతా కూడా సుమిత్ర నా యింట్లో మనిషిగా ఉందే గానీ, నా భార్యగా కాదు. ఒక్కనాడు కూడా ఆమె స్పర్శ నేనెరగను. ఆ విషయం నా కూతురికి ఎలా తెలుస్తుంది? నేనేదో వయసు ప్రలోభంలో పడి సుమిత్రని చేసుకున్నాననే ఆమె అభిప్రాయం మార్చలేక పోయాను. చివరికి ఉద్యోగం పేరుతో నాకు శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోయింది నా ఏకైక ప్రాణం. తట్టుకోలేకపోయాను.

నా నోరు కట్టేసింది. చేతులు కాదుగా! ఒకనాటి రాత్రి కూర్చుని, జరిగినదంతా వివరంగా పెద్ద ఉత్తరం రాశాను. మర్నాడు కొరియర్‌ చేయాలని అనుకున్నాను. ఉత్తరం మడిచి, టేబుల్‌ మీద ఉన్న పుస్తకంలో పెట్టాను. అది చదివితే, నా చిన్నారి తల్లి నన్ను అర్థం చేసుకుంటుందనే విశ్వాసం కలిగింది. మనసు తేలిక పడింది.

‘ఈ పని ఇన్నాళ్ళూ ఎందుకు చేయలేదా’ అనిపించింది. 
‘వెర్రివాడా, నీ మాటలే వినని నీ కూతురు నువ్వు రాసే రాతలు చదువుతుందని అనుకుంటున్నావా? అందగానే చించి పారేస్తుంది’     నా అంతరాత్మ వెక్కిరించింది. నిజమేనేమో!
మళ్ళీ నా గుండె బరువెక్కింది. ‘అది తేలికపడితే, ఇక కలిసేది గాలిలోనే’ అని తెలిసే సరికి అంతపనీ జరిగింది. 
    నా ఉత్తరం పుస్తకంలోనే నిక్షిప్తమైపోయింది.

    ముహూర్తం మంచిది కాదని, నా ఇంటిని ఏడాది పాటు మూసిపెట్టారు. మూసే ముందు కింది వస్తువులనీ, టేబుల్‌ మీది పుస్తకాలనీ తీసి అటకల మీద సర్దేశారు. నా చివరి ఆశ అక్కడే మూలబడిపోయింది. 
    సుమిత్ర తన ఊరికి వెళ్ళిపోయింది.. వితంతువు హోదా అయినా దక్కిందిగదా!
ఏడాది దాటాక ఇల్లు అమ్మకానికి పెట్టింది వాసుకి. అమ్మే ముందు అటకలు ఖాళీ చేస్తుంటే ఆ పుస్తకంలో నుంచి జారిపడిన నా        ఉత్తరం, చివరికి చేరవలసిన చేతుల్లోకి చేరింది! 
‘నాన్న దస్తూరీ’ అనుకుంటూ ఆబగా ఆ కాయితాలన్నీ చదివేసిన నా చిట్టితల్లి కళ్ళలో ధారాపాతంగా నీళ్లు!
    ఆత్మకి కనులుంటే నా కళ్ళలోనూ ఊరేవేమో నీళ్ళు!
∙∙ 
రాత్రి తొమ్మిది గంటలు దాటుతోంది. పాలసంచీ బయటి గడియకు తగిలించి, తలుపు మూసేసి, తాళం పెట్టుకోబోతున్న సుమిత్ర  కాంపౌండ్‌ గేటు కిర్రుమంటూ మోగిన చప్పుడుకి మూయబోతున్న తలుపు కొద్దిగా తెరిచి, ‘ఇంత రాత్రి వేళ తన ఇంటికి వచ్చేది ఎవరా’ అన్నట్టు ఆ చీకట్లోకి చూసింది.

గేటుకీ, వరండాకీ ఉన్న దూరాన్ని దాటి, వరండాలో వెలుగుతున్న నైట్‌ బల్బ్‌ వెలుగులోకి వచ్చిన స్త్రీ మూర్తి వాసుకి! సుమిత్ర నివ్వెరపోయింది. తల వంచుకునే మెట్లెక్కి, వరండాలో నిలబడిపోయింది వాసుకి. మాటలు రాని సుమిత్ర ఓరగా తెరిచి ఉన్న తలుపు బార్లా తెరిచి, వాసుకికి దారి ఇస్తున్నట్టు తను ఒక పక్కకి ఒత్తిగిలింది. తడబడుతున్న అడుగులతో లోపలికి నడిచింది వాసుకి. తలుపు వేసుకుని వెనక్కి తిరిగిన సుమిత్ర భుజం మీదకు ఒక్క ఉదుటున వాలిపోయింది. ఆమె కన్నీళ్లతో సుమిత్ర భుజం తడిసిపోయింది. సుమిత్ర వాసుకిని రెండు చేతులతో చుట్టేసి, దగ్గరగా హత్తుకుంది. – పి. వి. ఆర్‌. శివకుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement