కష్టాలలో పడి బాధలను అనుభవిస్తున్న మనిషికి తన చుట్టూ చోటుచేసుకుంటున్న సుఖ సంతోషాలను గురించిన స్పందన, కాలం గడిచే కొద్దీ తగ్గిపోయి, చివరకు దాదాపుగా నశించిపోతుంది. బతుకంతా కష్టంతోనే కూడుకున్నట్లుగా కనబడి అంతులేని నిరాశకు, అయోమయానికి గురిచేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ విపరీత మానసిక స్థితిని ఎదుర్కొనని మనిషి దాదాపుగా ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. ఈ విపరీత మాన సిక స్థితిని ఒక సరసమైన సన్నివేశంలో చెప్పాడు కనుపర్తి అబ్బయామాత్యుడు ‘కవిరాజ మనోరంజనము’ కావ్యం ద్వితీయాశ్వాసంలో.
మానవలోకంలో చంద్రవంశానికి చెందిన ప్రభువైన పురూరవుడిని ప్రేమించింది దేవేంద్రుడి సభలో నర్తకియైన ఊర్వశి. అయితే, లోకాలు వేరైన కారణంగా, పురూరవుడితో సాంగత్యాన్ని ఎలా పొందాలో తెలియని అవస్థలో పడింది. అలా పురూరవుడి ధ్యాసలో పూర్తిగా మునిగిపోయిన ఊర్వశి సర్వమూ మరిచి దుఃఖిస్తూ ఉన్న స్థితిని ఇలా వర్ణించాడు అబ్బయా మాత్యుడు.
'పువ్వులు మానె దావి మెయిపూతలు మానె సఖీజనంబుతో
నవ్వులు మానె గీరవచన ప్రతిభాషలు మానె మానె దా
నెవ్వియు నింపుగాక సుఖహేతువు లెల్ల మనోజబాధ నా
జవ్వని ‘దుఃఖితే మనసి సర్వమసహ్యమ’ నంగ లేదొకో'
పూవులు పెట్టుకోవడం మానేసింది; సుగంధ పరిమళాలు వెదజల్లే లేపనాలను శరీరంపై రాసుకోవడం మానేసింది; తోటివారితో నవ్వులు మానివేసింది; సరస మైన సంభాషణలతో సమాధానాలను మానివేసింది; ఈ శోకం కారణంగా, ఒకప్పుడు ఆహ్లాదంగా అనిపించినవి అన్నీ ఇప్పుడు సుఖం ఇచ్చేవిగా కనుపడడంలేదు ఊర్వశికి. భరింపరాని దుఃఖంలో మునిగిపోయిన మనిషికి లోకంలో అంతా దుఃఖమయంగానూ, సహింపరానిదిగానూ కనపడడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు కదా! అని పై పద్యం భావం. శోకంలో మునిగివున్న మనిషికి సర్వమూ సహింపరానిదిగా కనబడుతుందన్నది స్వతహాగా అనుభవించకపోయినప్పటికీ అందరూ గ్రహించగలిగే సంగతే! కష్టమే అయినప్పటికీ ప్రయత్నం చేసి శోకంలోంచి ఎంత త్వరగా బయటపడితే అంతగా మేలు జరుగుతుందన్నది అందరూ సారాంశంగా గ్రహించవలసిన విషయం. – భట్టు వెంకటరావు
Comments
Please login to add a commentAdd a comment