కృతయుగంలో గులికుడు అనే కిరాతుడు ఉండేవాడు. అడవిలో జీవించే కిరాతులకు అతడే రాజు. వేటలో ఆరితేరిన గులికుడు పరమ దుర్మార్గుడు. ఇతరులను నిష్కారణంగా హింసించి, వారిని దోచుకునేవాడు. గులికుడి పాపాలను చెప్పుకోవాలంటే ఎంత కాలమూ సరిపోదు. ఒకనాడు గులికుడు సంపదలకు నిలయమైన సౌవీర రాజ్యానికి వెళ్లాడు. ఐశ్వర్యంతో తులతూగే రాజధాని నగరంలో అడుగుపెట్టాడు. అక్కడ బంగారు గోపురాలతో ధగధగలాడే శ్రీహరి మందిరాన్ని చూశాడు. ఎలాగైనా, ఆలయంలోని బంగారాన్ని దక్కించుకోవాలనుకున్నాడు. చీకటి పడిన తర్వాత నెమ్మదిగా ఆలయంలోకి చొరబడ్డాడు.
ఆలయంలోకి ప్రవేశించిన గులికుడు ఒక స్తంభం చాటున నక్కి పరిసరాలను పరిశీలించసాగాడు. గర్భగుడిలో శ్రీహరికి పరిచర్యలు చేస్తున్న ఒక మహాముని కనిపించాడు. ఆ మహాముని పేరు ఉత్తంకుడు. గర్భగుడిని ఆశ్రయించుకున్న ఉత్తంకుడు తన చౌర్యానికి అడ్డుగా ఉన్నందున గులికుడికి అసహనం పెరిగింది. ఉత్తంకుడిని చంపి అయినా, ఆలయంలోని సంపదను దోచుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే కత్తి దూసి, ఉత్తంకుడి మీద దాడికి వెళ్లాడు.
ఉత్తంకుడు కత్తితో దూసుకొస్తున్న గులికుడిని చూసి, ‘ఓ కిరాతుడా! నీవెందుకు నిష్కారణంగా నా మీద కత్తి దూశావు? నేను నీ పట్ల చేసిన అపరాధమేమిటి? సమర్థులు, వీరులు అపరాధులను శిక్షిస్తారు గాని, నిరపరాధులను కాదు. పరుల సొమ్మును దోచుకుని నువ్వు భార్యాబిడ్డలను పోషించుకుంటున్నా, అవసానకాలంలో నువ్వు ఒంటరిగానే మరణిస్తావు. నువ్వు దోచుకున్న సిరిసంపదలేవీ నీ వెంట రావు. నీ భార్యాబిడ్డలు కూడా నీ వెంట రారు. ఇహపరాలలో తోడుగా నిలిచేవి ధర్మాధర్మాలే తప్ప వేరు కాదు’ అని పలికాడు.
ఉత్తంకుడి మాటలతో గులికుడికి జ్ఞానోదయమైంది. కత్తి పట్టుకున్న అతడి చేతులు వణికాయి. ఉత్తంకుడిని చంపుదామని ఎత్తిన చేయిని దించి, కత్తిని జారవిడిచేశాడు. వెంటనే ఉత్తంకుడి పాదాలపై పడి క్షమించమని ప్రార్థించాడు. పశ్చాత్తాపం నిండిన హృదయంతో ఉత్తంకుడికి నమస్కరించి, ‘విప్రోత్తమా! ఇంత వరకు నేను ఎన్నో పాపాలు చేశాను. నేడు నీలాంటి మహాత్ముడి దర్శనంతో నాకు జ్ఞానోదయమైంది. నేను ఎన్నో ఘోరాలు, నేరాలు, అకృత్యాలు చేశాను. పూర్వజన్మలో నేనేదో భయంకరమైన పాపం చేసి ఉంటాను. అందువల్లనే ఈ జన్మలో కిరాతుడిగా పుట్టాను. ఈ జన్మలో కూడా లెక్కలేనన్ని పాపాలు చేశాను. ఇకపై నాకు ఏ గతి పడుతుందో?’అంటూ విలపిస్తూ ఉత్తంకుడి పాదాల మీద పడి గులికుడు ప్రాణాలు విడిచాడు.
పశ్చాత్తాపం చెంది మరణించిన గులికుడిని చూసి ఉత్తంకుడు జాలి చెందాడు. పరమదయాళువు అయిన ఆ మహాముని తన కమండలంలోని విష్ణుపాదోదకాన్ని తీసి, గులికుడి కళేబరం మీద చల్లాడు. శ్రీహరి పాదోదకం కళేబరాన్ని తాకగానే, గులికుడి పాపాలన్నీ నశించిపోయాయి. అతడికి ప్రేతశరీరం పోయి, దివ్యశరీరం వచ్చింది. విష్ణులోకం నుంచి వచ్చిన విమానం ఎక్కి, తనకు ఉత్తమగతిని కల్పించిన ఉత్తంకుడితో గులికుడు ఇలా అన్నాడు:
‘ఓ మహర్షీ! పాపాత్ముడినైన నా మీద జాలి తలచి, నాకు ఉత్తమగతిని కల్పించిన నీవే నా గురువు. నీ ఉపదేశంతో నాకు జ్ఞానోదయమైంది. దయామయా! నీ అపరిమిత దయ వల్లనే నేను హరిపదానికి చేరుకోగలుగుతున్నాను. దయచేసి, నా అపరాధాలను మన్నించి, ఆశీర్వదించు’ అని కోరి నమస్కరించాడు. వెంటనే విమానం అతడిని విష్ణులోకానికి తీసుకుపోయింది. ఈ అద్భుత దివ్యదృశ్యాన్ని చూసి, ఉత్తంకుడు ఆనంద పరవశంతో శ్రీహరిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రాన్ని పలికాడు.
ఉత్తంకుడి స్తోత్రం పూర్తవుతూనే, శ్రీమహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. తన ఎదుట నిలిచిన శ్రీహరిని చూసి, ఉత్తంకుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ఆనందబాష్పాలతో శ్రీహరికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘శ్రీమన్నారాయణా! పరంధామా! పురుషోత్తమా! పరమాత్మా! శరణు శరణు’ అని ప్రార్థించాడు.
శ్రీమన్నారాయణుడు ఉత్తంకుడిని ఆదరంగా లేవనెత్తాడు. తలపై అభయహస్తముంచి ఆశీర్వదించాడు. ‘వత్సా! ఏమి కావాలో కోరుకో!’ అన్నాడు. ‘స్వామీ! నన్నెందుకు మోహంలో పడేస్తున్నావు? నాకు వేరే వరాలతో పనిలేదు. ఎన్ని జన్మలెత్తినా నీ దివ్య పాదారావిందాలపై నిశ్చల భక్తి నిలిచి ఉండేలా అనుగ్రహించు. అదొక్కటి చాలు నాకు’ అని పలికాడు ఉత్తంకుడు.
ఉత్తంకుడి నిష్కల్మష భక్తిని గ్రహించిన శ్రీమన్నారాయణుడు అతడి శిరసును తన శంఖంతో స్పృశించి, పరమయోగులకు కూడా సాధ్యంకాని దివ్యజ్ఞానాన్ని అనుగ్రహించాడు. ‘ఉత్తంకా! నరనారాయణులు తపస్సు చేసిన బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు చేయి. నీకు మోక్షం లభిస్తుంది. నీవు పలికిన నా స్తోత్రాన్ని త్రికాలాల్లో పఠించేవారికి నా అనుగ్రహం నిరంతరం లభిస్తుంది’ అని పలికి అంతర్ధానమయ్యాడు. – సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment