క్షణికం! ట్రైన్‌లో అడుగు పెట్టి.. బెర్త్‌ కింద సూట్‌కేసు తోసి.. | Kanshikam Fundy Is A Long Story Written By Chaganti Prasad | Sakshi
Sakshi News home page

క్షణికం! ట్రైన్‌లో అడుగు పెట్టి.. బెర్త్‌ కింద సూట్‌కేసు తోసి..

Published Sun, Jul 28 2024 10:44 AM | Last Updated on Sun, Jul 28 2024 10:44 AM

Kanshikam Fundy Is A Long Story Written By Chaganti Prasad

ట్రైన్‌లో అడుగు పెట్టి బెర్త్‌ కింద సూట్‌కేసు తోసి సీట్‌లో కూర్చున్నాను. ఢిల్లీకి వెడుతున్న ఈ రైలు టూ టైర్‌ ఏసీ కంపార్టుమెంట్‌లో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రయాణికులు ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది లేరు. విండో గ్లాస్‌లోంచి బయటకి చూస్తూ కూర్చున్నాను. సూర్యాస్తమయవుతోంది.. నెత్తురు రంగు పూసుకున్న మబ్బులు వేగంగా కదులుతున్నాయి. టీలు, కాఫీలు అమ్ముకుంటున్న హాకర్స్, ప్రయాణికులతో ఫ్లాట్‌ఫారం హడావుడిగా ఉంది. కాళ్ళు పారజాపి చేతిలో వున్న మొబైల్‌ చూస్తూ కూర్చున్నాను.

రైలు కదిలే సమయంలో ‘ఎక్స్‌క్యూజ్‌ మీ’ అంటూ ఒకామె హడావుడిగా చేతిలో చిన్న సూట్‌కేసుతో వచ్చి పక్కనే నిలబడింది. కాళ్లు వెనక్కి లాక్కున్నాను. సూట్‌కేసు బెర్త్‌ కిందకు తోసి, ‘హుష్‌’ అంటూ నిట్టూరుస్తూ ఎదురు సీట్లో కూర్చుంది.  నుదుటన పట్టిన చెమటని కర్చీఫ్‌తో తుడుచుకుంది. ఆమెకు ఏభై ఏళ్లు దాటి ఉండవచ్చు. జుత్తు అక్కడక్కడ నెరిసింది. మొహంలో అలసట కనిపించింది. కిటికీ దగ్గరకు జరిగి కూర్చుంది. ఆమెకేసి తేరిపార చూశాను. ఎక్కడో చూసినట్టుగా అనిపించింది.

ఆమె కళ్ళలో ఏదో ఆందోళన లీలామాత్రంగా కనబడింది. ఆమె నాకేసి అభావంగా చూసి, తన మొబైల్‌ ఫోను చూసుకోవడంలో నిమగ్నమైంది. ఆమెకు ఎవరో చాలాసార్లు ఫోన్‌ చేశారు.. కానీ చూసీచూడనట్టుగా మొబైల్‌ పక్కన పెట్టేసింది. మరో ఫోన్‌ కాల్‌ మటుకు ఆన్‌ చేసి.. ‘అవునండి! అలా చేద్దాం .. నా నిర్ణయం మారదు’ అంటోంది.

ఆకాశంలో చిన్నగా మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం వచ్చేలా ఉంది. ఢిల్లీ వెళ్ళే సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులతో పాటు వాళ్ళ ఆనందాలని, బాధలని .. వెంట మోసుకుని వెడుతోంది వేగంగా. నా జీవితంలో ఆనందం ఆమడ దూరం.  బాధ ఐతే మోయలేనంత బరువుగా! జీవితంలో పడిన కష్టాలకి మనస్సు కరడు కట్టేసింది.. చిన్నగా మొదలైన వాన ఉద్ధృతమైంది. కంపార్ట్‌మెంట్‌ పార్టిషన్‌ ఎవరైనా తీసినప్పుడు పిడుగుల శబ్దాలు గట్టిగా లోపలికి  వినబడుతున్నాయి.

చిన్నప్పుడు పిడుగుల శబ్దానికి భయపడితే.. ‘అర్జునా! ఫల్గుణా అని.. ప్రార్థిస్తే .. పిడుగులు పడవురా!’ అని మా బామ్మ చెప్పేది. ఇప్పుడు సామాన్యుల, దీనార్తుల నెత్తి మీద ఎన్నో బాధల పిడుగులు పడుతున్నా .. ఎంత గొంతెత్తి ప్రార్థించినా .. కాపాడటానికి ఏ అర్జునుడు, ఫల్గుణుడు రావడం లేదు. అప్రయత్నంగా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకున్నాను.

ఎదురుగా వున్నామె రైల్వే వారు ఇచ్చిన తెల్లని దుప్పటి ఒంటిమీద సగం వరకు కప్పుకుని కూర్చుని బయటకి చూస్తోంది. మళ్ళీ బుర్ర దొలచడం మొదలెట్టింది.. ఈమెని ఎక్కడ చూశాను? తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంతలో టీసీ వచ్చి.. ‘టికెట్‌ చూపించండి..’ అంటూ మా పేర్లు, బెర్త్‌ నంబర్లు బయటకి చదివాడు. నేను నా టికెట్‌ను ఫోన్‌లో చూపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘ధరణీధరి’ అన్న పేరు చెవిన బడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. వెంటనే ఆమెని గుర్తుపట్టాను. అవును! ఆమే! ఆ ఘాతుకం జరిగి ఎంతో కాలమైనా.. ఆ కుటుంబసభ్యుల పేర్లు ఎలా మర్చి పోగలను? గుండె రగిలిపోయింది.. ఎస్‌ .. ఆరోజు అందరం మూకుమ్మడిగా కర్రలు, రాళ్ళు పుచ్చుకుని దుర్గారావు ఇంటి మీద దాడి చేసినప్పుడు చూశాను ఈమెను.

పచ్చి మోసగాడు, పరమనీచుడు, ఎందరో అభాగ్యులను మోసం చేసిన .. ‘ధరణిధరి ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ’ ఓనర్‌ దుర్గారావు గాడి భార్య ఈ ధరణి. చిన్న చితకా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిరు ఉద్యోగులు, రాత్రనకా పగలనకా ఎంతో కాయకష్టం చేసి చెమటోడ్చి రోజువారీ కూలి చేసుకునే వాళ్లు తమ పిల్లల చదువులకని,పెళ్ళిళ్ళకు పైసా పైసా కూడబెట్టిన డబ్బులను ఎక్కువ వడ్డీ ఇస్తానన్న వాడి మాయ మాటలు నమ్మి వాడి దొంగ సంస్థలో దాచుకున్నారు. కంపెనీలో పెట్టిన డబ్బులు మూడు ఏళ్లలో రెట్టింపు అయిపోతుందని మభ్యపెట్టాడు. ఆశల పల్లకి ఎక్కించాడు. ఊహల రంగుల ఇంద్రధనుస్సులు చూపించాడు.

ఏజెంట్లను నియమించి వాళ్ళకి  కమిషన్‌ ఆశ చూపి.. వ్యాపారాన్ని చుట్టు పక్కల ఊర్లకి విస్తరింప చేశాడు. అందర్నీ నమ్మించడానికి కొంతకాలం బాగానే నడిపాడు. ఆ డబ్బులతో ఆస్తులు కూడబెట్టాడు. దాచుకున్న డబ్బులు అవసరం వచ్చినప్పుడు తీసుకోవడానికి వెడితే, చెల్లించకుండా సాకులు చెప్పాడు. అనుమానం వచ్చి కొందరు నిలదీశారు. హఠాత్తుగా ఒకరోజు బోర్డు తిప్పేశాడు. మాయ మాటలు చెప్పి తప్పించుకుపోతుంటే, అందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. దుర్గారావుని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కానీ క్షణంలో బెయిల్‌ మీద బయటకి వచ్చాడు. దాచుకున్న ‘అసలు’ కూడా తిరిగి ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పాడు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది న్యాయం జరుగుతుందేమోనన్న ఆశ చావక.. కొన ఊపిరితో వేచి చూస్తున్నారు. మరికొందరు కాలసర్పం కాటుకు అసువులు బాశారు. వాడి మోసపు వలలో నా కుటుంబం కూడా అమాయకంగా చిక్కుకు పోయింది. అక్క పెళ్ళి కోసం నాన్న దాచుకున్న సొమ్ము మొత్తం  పోయింది.

చిన్నప్పటి నుండి.. ‘బంగారుతల్లి’ అంటూ ఎంతో మురిపెంగా పిలుచుకుని, గారంగా పెంచుకున్న అక్క కూడా ‘ఈ జన్మలో నా పెళ్ళి చేయలేవులే!’ అంటూ ఛీత్కారంగా మాట్లాడింది. అందరం తలో మాట అన్నాము. అది నాన్న జీర్ణించుకోలేక, ఒంటి మీద పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మంటలు ఇప్పటికీ నా గుండెలో ప్రజ్వలిస్తున్నాయి. అమ్మ.. నాన్న కోసం బెంగ పెట్టుకుని చనిపోయింది. అక్క ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రాణంతో ఉందో లేదో తెలియదు. నా చదువు మధ్యలో ఆగిపోయింది. అపురూపమైన మా పొదరిల్లు కూలిపోయింది. నేను ఒంటరి పక్షిగా మిగిలిపోయాను.

అనాథ శరణాలయంలో చేరి, ఎంతో కష్టపడి చదువుకుని.. మంచి కంపెనీ ఉద్యోగంలో  నిలదొక్కుకున్నాను. కానీ నా ఉన్నతిని, అభివృద్ధిని చూడడానికి నా కుటుంబంలో ఒక్కరూ మిగల్లేదు అన్న బాధ నన్ను పట్టి పీడిస్తోంది. మా చిన్నగూడుని చిన్నాభిన్నం చేసిన నీచుడి భార్య ఎంత ప్రశాంతంగా ఉందో? బాధ, కోపం ఆజ్యాలై .. నా గుండెలో రగిలిన మంటలని మరింతగా రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ నీచులను ఏ చట్టాలు శిక్షించలేదు. నేనే అమలుపరిస్తే? ఆ ఆలోచన విత్తుగా మొలకెత్తి మహా వృక్షమై, వేళ్లూనుకుంది. అవును .. ఆ దుర్గారావు గాడిని మానసికంగా దెబ్బతీయాలి. వాడు కుళ్ళికుళ్ళి చావాలి.. దానికి మార్గం.. ధరణిని ఎవరికి తెలియకుండా చంపేస్తే? ఎన్నో కుటుంబాలని రోడ్డుకీడ్చి ఊపిరి తీసేసిన పాపానికి, వాడికి ఇదే సరైన శిక్ష. అదను కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను.

ఇంతలో ఆమె టాయ్‌లెట్‌ వైపు వెళ్ళింది. రెండు నిమిషాలు గడిచాయి. నేను కూడా టాయ్‌లెట్‌ వైపు నడిచాను. కంపార్ట్‌మెంట్‌ ఎగ్జిట్‌ డోర్‌ తీసి వుంది. పార్టిషన్‌ డోర్‌ పక్కన సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరూ చూడటానికి అవకాశం లేదు. బయటకి చూశాను. కటిక చీకటిని ఆకాశం తన మొహానికి కాటుకలా  పులుముకుంది. ఆకాశం బద్దలైనట్టు, దిక్కులు పిక్కటిల్లేలా శబ్దం చేస్తూ పిడుగులతో కూడిన వర్షం హోరున పడుతోంది. అక్కడక్కడ మెరుపులు మేఘాలకు దారిచూపిస్తున్నాయి. అంత వర్షంలోనూ చీకటిని, వర్షాన్ని  చీల్చుకుంటూ రైలు వేగంగా పరుగెడుతోంది. ఒక తెలివైన ఆలోచన వచ్చింది.

ఇదే సమయం.. ధరణి టాయ్‌లెట్‌ బయటకి రాగానే తెరిచి ఉంచిన కంపార్ట్‌మెంట్‌ ద్వారంలోంచి బయటకి ఒక్క తోపు తోసేస్తే.. ఆమె అరిచినా ఈ గాలివాన హోరులో వినబడదు. ఆమె బయటపడ్డ వెంటనే రైలు చక్రాలు ఆమెని నుజ్జునుజ్జు చేసేస్తాయి. శవం గుర్తుపట్టలేనంతగా ఛిద్రం అయిపోతుంది.. ఒక వేళ పక్క పట్టాల మీద ఈమె శరీరం పడ్డా వేగంగా వస్తున్న ఏదో రైలు దీని ప్రాణం తీస్తుంది. కసిగా అనుకుంటుంటే .. మనస్సుకి తృప్తిగా అనిపించింది.  మూడో కంటి వాడికి కూడా  తెలియదు.. చంపేయి! మనసు రెచ్చ కొడుతోంది. వద్దు పాపం. వాళ్ళ ఖర్మన వాళ్ళే పోతారు.. చంపొద్దని లోపలి మనిషి హెచ్చరిస్తున్నాడు. లోపల సంఘర్షణ మొదలైంది. ఎన్నో రాత్రులు కంటికి మింటికి ధారాపాతంగా ఏడ్చిన మా అమ్మానాన్నల దీనమైన ముఖాలు హఠాత్తుగా గుర్తుకు వచ్చాయి. నా వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది .. మనసు చెప్పినట్టే చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాను.

ఇంతలో టాయ్‌లెట్‌ తలుపు తెరిచిన శబ్దం వినిపించింది. నేను వెంటనే ఎడమ వైపున్న సింక్‌ దగ్గరకు వెళ్ళి చేతులు కడుక్కున్నట్టు నటిస్తున్నాను.. ధరణి బయటకి వచ్చింది. నెమ్మదిగా అడుగులు వేస్తోంది. నేను వేగంగా .. ఆమె వైపు దూసుకు వెళ్ళాను.. ఇంతలో పక్క కంపార్ట్‌మెంట్‌ నుంచి ఒకతను.. మా ఇద్దరి మధ్యలోకి వచ్చాడు. నేను నిగ్రహించుకుని ఆగిపోయాను.

ఆమె పార్టిషన్‌ డోర్‌ పుష్‌ చేసుకుని తన బెర్త్‌ వైపు వెళ్ళిపోయింది. ‘ఛ ఛ చాన్స్‌ మిస్‌ అయ్యింది!’ తలబాదుకుని.. నిరాశగా నా బెర్త్‌ వైపు నడిచాను. 
‘ఆమె చేతిలో ఏదో ఫైల్‌.. కళ్లజోడు పెట్టుకుని చదువుతోంది. నేను బెర్త్‌ మీద దుప్పటి, తలగడ, సర్దుకుని.. కాళ్ళ షూస్‌ విప్పి..  వాటర్‌ తాగి.. కళ్ళుమూసుకున్నాను.

ఆమె వెంట తెచ్చుకున్న టిఫిన్‌ తింది. ఒక గంట పోయాకా చేయి కడుక్కోవడానికి టాప్‌ దగ్గరకు బయలుదేరింది. కంపార్ట్‌మెంట్‌ మధ్యలో లైట్లు ఆపేసి ఉన్నాయి. అక్కడక్కడా ఉన్న ప్రయాణికులు పార్టిషన్‌ కర్టె¯Œ ్స వేసుకుని పడుకున్నారు. నేను మా బెర్త్‌ల దగ్గర కూడా లైట్లు ఆపేశాను. మొత్తం చీకటి అయిపోయింది. కానీ టాయ్‌లెట్‌ దగ్గర వెలుగుతున్నాయి. అయినా ఫర్వాలేదు. వేగంగా ఆమె వైపు వెళ్ళాను. ఆమె చేతులు కడుక్కుని, వెనక్కి రాబోతోంది. నేను ఆమెకు అతి దగ్గరగా వెళ్ళగానే.. ఆ  హఠాత్పరిణామానికి ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి.

కంగారుపడి గట్టిగా అరవబోతుంటే, చేత్తో నోరు నొక్కి ఆమె భుజం మీద చేయి వేసి తెరిచి ఉంచిన ఎగ్జిట్‌ డోర్‌లోంచి బలంగా రైలు బయటకి ఒక్క తోపు తోశాను. వేగంగా అప్పుడే పక్క పట్టాల మీద ఒక రైలు రావడం, ఆమె దాని కింద పడటం లిప్త పాటులో జరిగిపోయింది. ఆమె అరిచిన కేక వర్షపు ధ్వనిలో కలిసిపోయింది. భార్య చనిపోయిందన్న వార్త తెలియగానే, భోరుభోరుమంటూ ఏడుస్తున్న దుర్గారావు గాడి మొహం మనసులో మెదిలింది. ఈ శిక్ష పరోక్షంగా వాడికే! వేగంగా కొట్టుకుంటున్న గుండెని అదిమి పెట్టుకుని, నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ ఏమీ తెలియనట్టు వచ్చి బెర్త్‌ మీద పడుకున్నాను.. 
∙∙ 
ఎవరో పిలుస్తున్నట్టు , తడుతున్నట్టనిపించి ఉలిక్కిపడి ఒక్క ఉదుటన లేచాను. ఎవరూ లేరు.. రైలు ఆగినట్టుంది. బయట నుంచి చాలా మంది ప్రయాణికులు గట్టిగా మాట్లాడుకుంటూ సీట్లు వెతుక్కుంటున్నారు. మెడ కింద పట్టిన చెమటని తుడుచుకున్నాను. గట్టిగా కొట్టుకున్న గుండె వేగం కాస్త తగ్గింది. మంచి నీళ్ళు తాగుదామని లైటు వేశాను. ఎదురుగా మెడ వరకు దుప్పటి కప్పుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెని చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆమెని బయటకి తోసేశాను కదా.. ఎలా బతికింది? కళ్ళు నులుముకున్నాను. అంటే.. అంటే .. నేను నిద్రలోకి జారుకున్నానన్న మాట .. అంతా కలన్నమాట? అయ్యో దొరికిన అవకాశాన్ని చేతులారా వదిలేశాను.

చేతిని బర్త్‌ మీద కసిగా కొట్టుకున్నాను. నిద్రపట్టక  కిటికీలోంచి బయటకి చూశాను నిరాశగా. నాగపూర్‌ స్టేషన్‌ అన్న పేరు కనబడింది. ఇంతలో మా కంపార్ట్‌మెంట్‌లోకి ఎవరో ఒకతను చిన్న సూట్‌కేసు పుచ్చుకుని ఎక్కాడు.. ధరణి బెర్త్‌ దగ్గరకు వచ్చి ‘ధరణి మేడమ్‌..’ అంటూ దూరంగా నిలబడి ఆమెని పిలిచాడు.

‘ఆమె .. నిద్రలోంచి వెంటనే లేచి.. సారీ.. నిద్రపట్టేసింది లాయర్‌ గారు..’ అంటున్న ఆమె మొహంలో సిగ్గు కనబడింది. అతను ‘నో ప్రాబ్లం మేడమ్‌’అంటూ వినయంగా ఆమెకి దూరంగా బెర్త్‌ చివర కూర్చున్నాడు. ఆమె జుట్టు సరిచేసుకుంది. కళ్ల జోడు పెట్టుకుంది. నేను వెంటనే పడుకుని, నిద్రపోతున్నట్టు నటిస్తూ కనురెప్పల కింద నుంచి చూస్తూ, నెమ్మదిగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోనని, చెవులు రిక్కించి వినసాగాను.

‘నాగపూర్‌ కోర్టులో పని అయి పోయిందా లాయర్‌ గారు? అడిగింది. ‘పోస్ట్‌పోన్‌ అయ్యింది మేడమ్‌! అందుకనే మీరు ఢిల్లీ వస్తున్నారని చెప్పగానే ఇక్కడ ట్రైన్‌ ఎక్కే ఏర్పాటు చేసుకున్నాను.’ ‘థాంక్స్‌ అండి..’ అంది వినయం ఉట్టిపడే గొంతుతో. పక్కన ఉన్న చిన్న లైట్‌ కాంతిలో ఆమె మొహం కనబడుతోంది. లాయర్‌ నెమ్మదిగా, లోగొంతుకతో ‘మేడమ్‌! రేపు మీరు జడ్జ్‌ గారి ముందు అన్నీ చెప్పుకోవచ్చు. మీరు రాసిచ్చిన కాగితాలన్నీ కోర్టులో ఆల్రెడీ సబ్మిట్‌ చేశాం. మీరు చేసిన పని హర్షించ తగ్గది’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయి ఏంటో ఈ మహాతల్లి చేసిన హర్షించదగ్గ పని.. వెటకారంగా అనుకుని వాళ్ళ మాటలను ఏకాగ్రతగా వినసాగాను.

ధరణి విరక్తిగా నవ్వి ‘ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది లాయర్‌ గారు. డబ్బు పాపిష్టిది అని తెలుసుకోవడానికి ఇంత టైం పట్టింది. మనకి ఈ పాపపు సంపాదన వద్దండీ అన్నా కూడా  నా మాటలు పెడచెవిన పెట్టి , అమాయకుల్ని మోసం చేసిన పాపానికి మా ఆయనకి కాలు చేయి పడిపోయి, మంచం మీద తీసుకుని తీసుకుని చనిపోయాడు. కొన్ని ఆస్తులు నా పేరు మీద ఉన్నాయి. మరి కొన్ని కోర్టు అధీనంలో ఉన్నాయి. కొడుకులిద్దరూ నా పేరు మీద ఉన్న ఆస్తుల కోసం నన్ను చంపడానికి కూడా వెనుకాడడం లేదు. నాకు అన్నం పెట్టే దిక్కు లేదు. ఎందరో అమాయకుల ఉసురు మాకు తగిలింది. మాకు తగిన శాస్తి జరిగింది. ఇప్పుడు నా కొడుకులు నా కోసం వెతుకుతూ ఉండవచ్చు.

అందుకనే, రేపు కోర్టు వారిని అభ్యర్థించి ఈ కేసుని ముగించమని, ప్రజలని మోసం చేసి కూడబెట్టిన ఆస్తులన్నీ కోర్టు ద్వారా అమ్మి .. డిపాజిటర్స్‌కి చెల్లించమని వేడుకుంటాను. అప్పుడు గాని నాకు మనఃశాంతి ఉండదు’ అంటూ కర్చీఫ్‌తో కళ్ళు తుడుచుకుంది. ఆమె మాటలు వినగానే నాకు గుండె ఒక్క క్షణం ఆగినట్టనిపించింది. అయ్యో! ఎంత ఘోరం తలపెడదామనుకున్నాను? క్షణికావేశంలో ఆమెని చంపేసి ఉంటే.. నా వాళ్ళందరికీ ద్రోహం చేసిన వాడినై,  జీవితాంతం ఆ పాపం నన్ను వెంటాడేది.

ఆలస్యం అయినా.. ఇన్నాళ్ళకి మా అందరికీ న్యాయం జరగబోతోంది. ఏదో తెలియని ఆనందం కలిగింది. నా కనుకొలనులోంచి కన్నీటి బొట్టు జారీ తలగడ మీద పడి ఇంకిపోయింది. లాయర్‌ అప్పర్‌ బెర్త్‌ మీద పడుకుని ఉన్నాడు. తెలతెలవారుతోంది. బెర్త్‌ దిగి రైలు కిటికీ గ్లాస్‌లోంచి చూశాను. వర్షం లేదు.. ఆకాశం స్వచ్ఛంగా ఉంది. పది నిమిషాలలో రైలు ఢిల్లీ చేరుతుంది అని మొబైల్‌లో రైల్‌ స్టేటస్‌ ట్రాక్‌ చూపిస్తోంది. ధరణి  మేడమ్‌కేసి చూశాను. నిద్రపోతోంది. మొహంలో  ప్రశాంతత. ఇంక అక్కడ ఉండలేక ఆమె పాదాలని దూరం నుంచి నమస్కరించుకుని .. ట్రైన్‌ ఎగ్జిట్‌ డోర్‌  దగ్గరకు చేరాను. – చాగంటి ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement