భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేట్లు, ప్రతినిత్యం స్మరించేట్లు ప్రచారం చేసి యావత్ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు. ఆయన్ని ఆ రోజులలో ‘లైట్నింగ్ ఆరేటర్’ అని పిలిచేవారు.
1893 సెప్టెంబర్‌లో అమెరికాలోని చికాగోలో జరిగిన మహాసభల్లో అయన చేసిన ప్రసంగం ఈ రోజుకూ ప్రపంచ దేశాలంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాలలో పర్యటించి, అద్భుతంగా ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరిగి వచ్చి ‘రామకృష్ణ మిషన్’ స్థాపించారు.
వివేకానందుని ప్రసంగాలు యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. ఆయన ఓ ప్రచార కర్త కాదు, ఓ మతం. ప్రతి మనిషి ఆత్మలో దైవత్వాన్ని చూడడం ఆ మత సూత్రం. పేదవాడి సేవే భగవంతుని సేవ అని చాటి చెప్పిన యుగకర్త. భారతదేశం మళ్లీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యుడాయన.
1863 జనవరి 12న కలకత్తాలో జన్మించిన వివేకానందుని తొలినామం నరేంద్రుడు. ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలను కలిగిన ఆయన చివరికి అత్యున్నతమైన అద్వైత స్థితి కూడా పొందారు. దక్షిణేశ్వరంలోని రామకృష్ణ పరమహంసతో పరిచయమేర్పడిన అనతి కాలంలోనే నరేంద్రుడు ఆయనకు ముఖ్య శిష్యులయ్యారు. ఆయన మనోహర గాన మాధుర్యం రామకృష్ణుని ఆనందసాగరంలో ముంచెత్తేది. 1886లో పరమహంస నిర్యాణం అనంతరం నరేంద్రుడు పరివ్రాజకునిగా యావత్ భారత పర్యటన చేశారు. వివేకానందనామం స్వీకరించారు. దేశ సముద్ధరణకు, భారతజాతి పునరుజ్జీవనానికి అహర్నిశలు తపించారు.
‘బలమే జీవనం బలహీనతే మరణం’ అనే వివేకానంద ప్రవచనం జగద్విఖ్యాతం. ‘దేశంలో పస్తున్న ప్రతి ప్రాణికీ ఆహారం పెట్టి రక్షించటమే పరమధర్మం. ఇదే నా మతం. తద్భిన్నమంతా ఆదర్శమే, కృత్రిమ ధర్మమే. నిరుపేదయైన సోదర భారతీయునీ, నా ఇష్టదేవతలనూ అర్చించటానికి ఎన్ని జన్మలైనా ఎత్తగలను, ఎన్ని బాధలైనా ఓరుస్తాను’ అని ప్రకటించారాయన.
1902 జూలై 4న తన 39వ ఏట బేలూరు మఠంలో ఆయన తనువు చాలించారు. అన్నదాన, విద్యాదాన, జ్ఞానదానాల రూపంలో ప్రజాసేవ చేస్తూ యావద్భారతంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రఖ్యాతి వహించిన శ్రీ రామకృష్ణ మఠసేవా సంఘాలను స్థాపించిన ఘనత వివేకానందుడికే దక్కుతుంది.
గొప్ప దేశభక్తుడు. ఆయన యువతరాన్ని ప్రేరేపించిన మహాశక్తి. మానవునిలో లోపాలు వివరిస్తూ ‘మనం పని చేయం, చేసే వారిని చేయనీయం, వారిని విమర్శించి తప్పులెంచి అవహేళన చేస్తాం. మానవ జాతి పతనానికి ముఖ్యమైనదీ లక్షణమే’ అన్నారు. దైవ విశ్వాసం కంటె మానవ విశ్వాసం ముఖ్యమనీ... దేశ ప్రజలందరికీ ఆత్మవిశ్వాసం, క్రియా శూరత్వం అవసరం తనకు స్పష్టంగా కనిపిస్తున్నదనీ చెప్పారు. – నందిరాజు రాధాకృష్ణ; సీనియర్ జర్నలిస్ట్ ‘ 98481 28215 (రేపు స్వామి వివేకానంద వర్ధంతి)
Comments
Please login to add a commentAdd a comment