ఆ అవార్డులన్నీ నేనే వచ్చేలా చేశా... తప్పేముంది?!
అందరినీ బాగా పొగుడుతాను...నన్నెవరు పొగిడినా సంతోషిస్తాను!
రోడ్ నంబర్ 1.. బంజారా హిల్స్‌లోని ఆ ఇంట్లో ఉదయాన్నే హడావిడిగా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, విశాఖపట్నాల మధ్య ప్రయాణాలతో... రోజుకో చోట ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు తిక్కవరపు సుబ్బరామిరెడ్డి ఆ రోజు హైదరాబాద్‌లో ఉన్నారు. విశాఖపట్నంలో సెప్టెంబర్ 17న జరిగే పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లలో ఆఫీసు సిబ్బంది బిజీగా ఉన్నారు.
పూజ ముగించుకొని, ఆధ్యాత్మికవాది నుంచి ఆచరణవాదిగా మారి, ట్రేడ్ మార్క్ కుర్తా, కోటుతో నవ్వుతూ వచ్చారు - సుబ్బరామిరెడ్డి. ఏడు పదుల పైగా జీవితం చూసి, వేల కోట్లు సంపాదించిన ఈ రైతుబిడ్డ చేతిలోని బేసిక్ మోడల్ నల్ల రంగు నోకియా ఫోన్‌ను టేబుల్ మీద పెట్టి, సంభాషణకు ఉపక్రమించారు. సినిమా, వ్యాపారం, రాజకీయం, ఆధ్యాత్మికత, సేవ - ఇలా ఎన్నో కోణాలున్న ఒకే నాణెం టీయస్సార్తో ముఖాముఖి..
ఇంత సంపాదించి, ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో ఇంకా బేసిక్ ఫోనా?
సుబ్బరామిరెడ్డి: ఫోన్ అనేది మాట్లాడుకోవడానికి, సమాచారం చేరవేయడానికి. దానికి ఇంతకన్నా ఎందుకు? ఐ ఫోన్ ఇంట్లో తెచ్చారు. కానీ, అది వాడను. జీవితమైనా, ఫోనైనా సంక్లిష్టత లేకుంటేనే సుఖం.
ఇంత వేదాంతిలా మాట్లాడతారు. మళ్ళీ విందులంటూ భౌతికవాదిలా ఉంటారే!
వైరాగ్యమంటే ఒంటికి బూడిద రాసుకొని, జీవితంలో ఏదీ వద్దనుకోవడం కాదు! జీవితంలో ఏదో సాధించాలనే అభిలాష ఉండాలి. అదే సమయంలో ‘సాధించినది, సంపాదించినది ఏదీ నాది కాదు, నా వెంట రాద’నే వైరాగ్యమూ ఉండాలి. అప్పుడు అనుకున్నది కాకపోయినా బాధపడరు.
డెబ్భై రెండో ఏటా చేపట్టిన అన్ని రంగాల్లో క్రియాశీలంగా ఉన్నారు. మీ నిత్యనూతనోత్సాహం వెనుక రహస్యం?
ఇదంతా ఈశ్వర తపస్సు వల్ల లభించిన ఉత్సాహం. రోజూ గంటన్నర పూజతో మానసిక వ్యాయామం, రెండు గంటల శారీరక వ్యాయామం - పదేళ్ళుగా నా జీవితంలో భాగమైంది. అదే నాలో నిత్యనూతనోత్సాహం నింపుతోంది. మరో కారణం - నా లోని పాజిటివ్ మైండ్. దాంతో శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేసుకోవచ్చు.
కానీ, మీరు కోరి, ఆశపడ్డ పదవి అంటూ ఇంతవరకూ లేదా?
ఉంది. చిన్నప్పటి నుంచి భక్తెక్కువ. టి.టి.డి. బోర్డు చైర్మన్ కావాలనుకున్నా. కోరి మరీ ఆ పదవిని రెండుసార్లు చేపట్టా.
మీకు కళలు, సినిమాల పట్ల ఆసక్తి ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచి నాకు ఆ ఆసక్తి ఉండేది. పైగా, అప్పటి మేటి సినీ కమెడియన్ రమణారెడ్డి మా సొంత బాబాయే! సహజంగానే ఆ ప్రభావం నా మీదా ఉంది. నెల్లూరులో హైస్కూల్లో చదివే రోజుల నుంచే ఏకపాత్రాభినయాలు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో పాల్గొనేవాణ్ణి. స్కూలు చదువు కాగానే, హైదరాబాద్‌కు వచ్చి నిజామ్ కాలేజ్‌లో డిగ్రీ చదివా. పద్ధెనిమిదేళ్ళ వయసులోనే వ్యాపార రంగంలోకి వచ్చా. కానీ, కళాభిరుచి కారణంగా 1973లో పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ‘కాస్మొపాలిటన్ కల్చరల్ సెంటర్’ నెలకొల్పి, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపా. తరువాత సినీ ఎగ్జిబిటర్నయ్యా, నిర్మాతనయ్యా. సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా చేశా.
వ్యాపారానికీ, కళకూ లంకె కుదరడం కష్టం కదా!
కళ అనేది ఒక మహాశక్తి. అది మనిషికి తెలియని ఎనర్జీనిస్తుంది. ముందుకు తీసుకెళుతుంది. కానీ, కోట్లు సంపాదించిన వ్యాపారవేత్తలకూ, బడా రాజకీయ నాయకులకూ ఆ సంగతి తెలియదు. ఎంతసేపటికీ తమ పనుల్లోనే మునిగిపోతుంటారు. ఈ రహస్యం తెలుసు కాబట్టి, కళా రంగాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగా. గడచిన 52 ఏళ్ళుగా వ్యాపారంలో విజయాలు సాధిస్తున్నా. ఇటు ‘కళాబంధు’గానూ పేరు తెచ్చుకున్నా.
కానీ, వ్యాపార విస్తరణలో భాగంగానే సినీ రంగంలోకొచ్చినట్లున్నారు!
సినిమాను వ్యాపారంగా చూస్తే తప్పు. అది పవర్ఫుల్ మాస్ మీడియా. అనేక కళల అద్భుత సమాహారం. మీకో రహస్యం తెలుసా? నా భక్తికి ప్రధాన కారణమూ సినిమానే. ‘భూకైలాస్’లో రావణ బ్రహ్మ పాత్రలో ఎన్టీఆర్ పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడానికి పొట్ట చీల్చుకొని, పేగులతో వీణలా వాయిస్తాడు. ఆ పరమభక్తుడి జీవితం చూశాక, నాకెందుకు ప్రత్యక్షం కాడని కఠోర శివపూజ చేయడం మొదలుపెట్టా. ఆ తరువాత నాకు శివలింగ దర్శనం అనేకసార్లు జరిగింది.
ఆధ్యాత్మికత పక్కన పెడితే, సినీరంగ తొలినాళ్ళు గుర్తున్నాయా?
రిస్కు లేని వ్యవహారం కదా అని సినీ ప్రదర్శన రంగంతో మొదలయ్యా. 1981లో హైదరాబాద్‌లో ‘మహేశ్వరి - పరమేశ్వరి’ సినిమా కాంప్లెక్స్ నిర్మించా. రోమన్, స్పానిష్ ఆర్కిటెక్చర్‌తో అందంగా కట్టించిన హాలులో అప్పట్లోనే ఎస్కలేటర్ పెట్టించా. ఆ హాళ్ళ మీద వచ్చిన డబ్బుతో నిర్మాతగా మారా. హిందీలో మల్టీస్టారర్ ‘విజయ్’ తీశాను. ఆ తరువాత తెలుగులో శోభన్‌బాబు (‘జీవన పోరాటం’), వెంకటేశ్ (‘త్రిమూర్తులు’, ‘సూర్య ఐ.పి.ఎస్’), చిరంజీవి (‘స్టేట్ రౌడీ’), రాజశేఖర్ (‘గ్యాంగ్ మాస్టర్’), బాలకృష్ణ (‘వంశోద్ధారకుడు’) - ఇలా పెద్ద హీరోలతో సినిమాలు చేశా. హిందీలో ‘లమ్హే’, ‘చాందినీ’, డి.రామానాయుడుతో కలసి ‘దిల్వాలా’ చేశా. జి.వి. అయ్యర్ దర్శకత్వంలో ‘భగవద్గీత’ (సంస్కృతం, తెలుగు), ‘స్వామి వివేకానంద’ (హిందీ, ఇంగ్లీషు) లాంటి కళాఖండాలూ నిర్మించా.
జి.వి. అయ్యర్‌తో గొప్ప చిత్రాలు తీసే అవకాశమెలా వచ్చింది?
అప్పట్లో జాతీయ ఫిల్మ్ అవార్డుల జ్యూరీకి చైర్మన్‌గా పనిచేశా. జ్యూరీలో అయ్యర్ ఓ సభ్యుడు. సంస్కృతంలో ‘ఆది శంకరాచార్య’ తీసి పేరు తెచ్చుకున్న ఆయన మాటల సందర్భంలో ‘భగవద్గీత’ స్క్రిప్టు గురించి చెప్పారు. ఆ గొప్ప సబెక్ట్ను నేనే తెరకెక్కిస్తానన్నా. అలా ‘భగవద్గీత’ చేశాం. ఆ సంస్కృత చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ‘స్వర్ణకమలం’ దక్కింది. అంతకు ముందూ, ఆ తరువాతా ఏ తెలుగు సినిమాకూ ఉత్తమ చిత్ర పురస్కారం రాలేదు. ఆ అవార్డందుకున్న ఏకైక తెలుగు నిర్మాతను నేనే!
మరి, మన ‘శంకరాభరణం’ మాటేమిటి?
అది గొప్ప సినిమా. కానీ, దానికి వచ్చింది - కళాత్మక విలువలతో, అత్యధిక ప్రజాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రం అవార్డు మాత్రమే. ఉత్తమ చిత్రం అవార్డు కాదు. కాకపోతే, ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా ఎంపికైన హిందీ చిత్రంతో పాటు మన ‘శంకరాభరణం’కీ స్వర్ణకమలమిచ్చారు.
మీ జాతీయ అవార్డుల్లో మీ పాత్ర ఏమిటంటారు?
ఏమీ లేదు. నేను నిర్మాతను. అంతే! ‘భగవద్గీత’కు అవార్డు వస్తుందని నాకు తెలియదు. ఆ ఆలోచన కూడా నాకు లేదు. గొప్ప చిత్రాన్ని గుర్తించి, ఇచ్చారు. అలాగైతే, అయ్యర్‌తో నేను తీసిన తరువాతి చిత్రం ‘స్వామి వివేకానంద’కు ఇతర అవార్డులు వచ్చాయి కానీ, ఉత్తమ చిత్రం అవార్డు రాలేదు కదా! ఆ రెండు చిత్రాల ద్వారా అప్పట్లోనే రూ. 3 కోట్లు నష్టం వచ్చింది. అయినా, బాధ లేదు. మంచి చిత్రాలు తీశాననే తృప్తి మిగిలింది. అయ్యర్ తీసిన కళాఖండాలైన ‘ఆది శంకరాచార్య’, ‘భగవద్గీత’, ‘స్వామి వివేకానంద’ చిత్రాల డీవీడీలను సిద్ధం చేసి, అందుబాటులోకి తేవాలనుకుంటున్నా.
అప్పట్లో ‘స్వామి వివేకానంద’ వివాదాస్పదం అయినట్లుంది!
అదేమీ లేదు. నేను ఆ చిత్రానికి నిర్మాతనే తప్ప, కథ వ్యవహారం నాకు తెలియదు. అయ్యర్ తను రాసుకున్న స్క్రిప్టును తాను అనుకున్న పద్ధతిలో తీశారు. అయితే, అందులో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని రామకృష్ణ మఠం వారన్నారు. దాంతో, ఆ సన్నివేశాలు తొలగించాం. అంతే!
అప్పట్లో హిందీ ‘రోటీ కపడా ఔర్ మకాన్’లో అమితాబ్ చేసిన అతిథి పాత్రకు తెలుగు ‘జీవన పోరాటం’లో రజనీకాంత్నెలా ఒప్పించారు?
అమితాబ్, రజనీకాంత్ నటించిన ‘అంధా కానూన్’ శతదినోత్సవం మా ‘మహేశ్వరి’లో జరిగింది. అప్పుడొచ్చిన రజనీకాంత్ ఆ హాలు, మా ఇల్లు, నాకున్న కళాభిరుచి చూసి, నిజంగా నాకు అభిమాని అయ్యాడు. అందుకే, అడగగానే ‘జీవనపోరాటం’లో అతిథి పాత్రకు ఒప్పుకున్నాడు.
ఇలా పరిచయాలున్నా చిత్ర నిర్మాణంలో మమేకం కాలేదేం?
ఒక హాబీ కింద సినిమాలు తీశానే తప్ప, అది నా వృత్తి కాదు. కథ, ఆర్టిస్టుల ఎంపిక, పై పై పర్యవేక్షణే తప్ప షూటింగ్‌లకు కూడా తరచూ వెళ్ళేవాణ్ణి కాదు. ప్రతి సినిమాకూ ఒకరిని ఇన్‌ఛార్జ్‌గా పెట్టేవాణ్ణి. వాళ్ళే అంతా చూసేవారు. అలా నాకున్న సరదా తీర్చుకున్నా.
మరి, ఎంతో నచ్చి సినిమాల్లోకి వచ్చిన మీరు 2000వ సంవత్సరం తర్వాత సినిమాలు తీయడం లేదేం? సరదా తీరిందనా? రిస్కు పెరిగిందనా?
సినిమా అంటే చాలా టైవ్‌ు వెచ్చించాలి. అంత సమయం వెచ్చిస్తూ, సినీ రంగానికే పరిమితం కావడం నాకిష్టం లేదు. అందుకే, సినిమాలు చూడడం, ఆస్వాదించడం, కళాకారులను అభినందించడమే తప్ప, తీయడం మానేశా. పైగా, సినీ రంగాన్ని ఒక్కదాన్నే నమ్ముకొంటే, వేరే రంగాల్లో కాన్సన్ట్రేట్ చెయ్యలేనుగా!
సినిమాలు... ఆధ్యాత్మికత..., రాజకీయాలు... వ్యాపారం, ఇవి కాక సభలు, డిన్నర్ పార్టీలు... మీదో విలక్షణ జీవితమేనే?!
అవును. నేను ఆల్‌రౌండ్ మ్యాన్‌ను. సినిమా స్టార్లనూ, ప్రముఖులనూ పిలిచి, ఓ స్థాయిలో విందు వినోదాలు ఏర్పాటు చేసి ఆతిథ్యం అందించడం నాకిష్టం.
మీ వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంటుందేం?
(నవ్వేస్తూ...) నాకంటూ ప్రత్యేక గుర్తింపు కోరుకొనే లక్షణమే డ్రెస్సింగ్లోనూ పాటించా. ఈ స్టైల్ కూడా చాలా ఏళ్ళ క్రితం నేను డిజైన్ చేసుకున్నదే. ఈ చొక్కా మూడేళ్ళ క్రితం కుట్టించుకున్నది, ఈ కోటు అంతకన్నా పాతది. ఇక, కోటు పై జేబులోని ఈ రంగు కర్చీఫ్ అంటారా? అదో ప్రత్యేకత. అన్నట్లు ప్రధాని మోడీదీ, నాదీ పుట్టినరోజు సెప్టెంబర్ 17నే. ఆయన పి.ఎం (ప్రైమ్ మినిస్టర్) అయితే, నేను ఎం.పి (మెంబర్ ఆఫ్ పార్లమెంట్). అంతే తేడా. (నవ్వులు...).
రాజకీయాల్లోకి వచ్చాక - ఇన్నేళ్ళలో మీరూ పెరిగారు. మీ వ్యాపారాలూ పెరిగాయి. మరి, ఇక్కడ మీరు సంపాదించింది ఎంత?
వ్యాపారవేత్తగా గౌరవ ప్రతిష్ఠలు కొంత వరకే! రాజకీయాల్లో ఉంటే, అధికార హోదా కూడా తోడై, ఒక్క ఫోన్ చేసి, ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రజలకు కావాల్సిన మంచి పనులు చేయించవచ్చు. ఇక్కడ నేను సంపాదించినది - డబ్బుకు అతీతమైన ఈ గౌరవాన్నే!
పోనీ, మీరు పోగొట్టుకున్నది ఎంత?
పోగొట్టుకున్నది... కంటి నిండా నిద్ర! రోజూ పద్ధెనిమిది గంటల పని వల్ల అయిదారు గంటలు మించి నిద్ర పోలేకపోతున్నా.
కానీ, మీరు గోరంత చేసి కొండంత ప్రచారం పొందుతారని మీపై విమర్శ!
జీవితంలో ఏమీ సాధించకుండా, ఏమీ చేయకుండానే ప్రచారం చేసుకునేవారు ఒక రకం. చేసినదాని గురించి నలుగురిలో ప్రచారం చేసుకొనేవారు రెండో రకం. నేను రెండో వర్గానికి చెందినవాణ్ణి. అవును, నేను ప్రచారం చేసుకుంటా. చేసిన మంచి పని నలుగురికీ చెబితే తప్పా? ఉదాహరణకు, విశాఖపట్నంలో ప్రసిద్ధ కె.జి. హాస్పిటల్‌కు వచ్చే రోగులు, వారి బంధువులు చెట్ల నీడనే ఇబ్బందులు పడడం చూసి, దాదాపు రూ. 4 కోట్లతో 200 పడకలు ఉండేలా సత్రం కట్టించా.
అది జనానికి తెలియాలంటే, వారు ఉపయోగించుకోవాలంటే ప్రచారం చేయాలి కదా! ప్రచారం చేయడం వల్ల నలుగురూ మెచ్చుకోవడంతో మన మనసుకు తృప్తి కలుగుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే కోరిక పుడుతుంది. మనకొస్తున్న మంచి పేరు చూసి, మరికొందరు స్ఫూర్తి పొంది, వాళ్ళూ అలా చేయడానికి ముందుకొస్తారు. ఇవేవీ పట్టించుకోకుండా, కేవలం ప్రచారమంటూ విమర్శించేవాళ్ళు నా దృష్టిలో అసూయాపరులు!
రిలేషన్‌షిప్‌లు పెంచుకోవడానికే విందులిస్తుంటారనీ మీపై మరో విమర్శ!
మనుషుల మధ్య అనుబంధం లేకపోతే ఎలా? ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఎంతో సేవ చేసి, రిటైరయ్యాడనుకోండి. ఆయన సేవకు గుర్తుగా ఒక విందు ఇచ్చి, అందరినీ పిలిచామనుకోండి. అతను ఎంత సంతోషపడతాడు! అందరి మధ్య ఎంత మంచి వాతావరణం వస్తుంది! అక్కడ ఎవరూ మనం పెట్టే భోజనం చేయడానికి రారు. కబుర్లు చెప్పుకొని, ఒక చక్కటి సోషల్ మైండ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. దాని వల్ల ఉత్సాహం వస్తుంది.
పార్టీ పెద్దల్ని ఇట్టే బుట్టలో వేసుకుంటారని టాక్!
(పెద్దగా నవ్వి...) నా దగ్గర బుట్టలేమీ లేవు. (గంభీరంగా) స్వయంకృషితో నేను పెకైదిగా కాబట్టే, ఎవరొచ్చినా నాతో స్నేహంగా ఉంటారు.
బర్తడే భారీగా చేయడం, లక్షల ఖర్చు అవసరమా?
పుట్టినరోజనేది ఒక పని మీద భగవంతుడు మనల్ని ఈ లోకానికి పంపించిన రోజు. ఆ రోజున దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకొని, అప్పటి వరకు మనం సాధించినది ఏమిటి, సాధించాల్సినది ఏమిటన్నది సింహావలోకనం చేసుకోవాలి. పైగా, పుట్టినరోజు నాడు నేనేమీ కేక్‌లు కట్ చేయను. అన్ని మతాల ఆధ్యాత్మికవేత్తలనూ పిలిచి, సత్కరించి, ఆశీస్సులు తీసుకుంటా. రెండో రోజున సీనియర్ కళాకారుల కృషికి గుర్తింపుగా, వారిని ఘనంగా సత్కరించి, కళారాధన చేస్తా. గొప్పవాళ్ళను సత్కరించడం వల్ల ప్రజలు సంతోషిస్తారు. వాళ్ళ మంచి మనసు, దీవెనల వల్ల నాకు శక్తి వస్తుంది.
మీ విజయం వెనక మీ శ్రీమతి ఇందిర పాత్ర...
ఇదంతా నా బాస్ (శ్రీమతి ఇందిర) చలవే! నేను ఏ పని చేసినా ఆమె అడ్డుచెప్పదు. ఇంత ఎందుకు ఖర్చు చేస్తున్నారని కానీ, ఎందుకు, ఏమిటని కానీ అడగదు. ఆమె నాకు దేవుడిచ్చిన వరం.
మీ మీద మీ అమ్మ గారి ప్రభావం ఎక్కువని విన్నాం...
అవును. నాకు ఇద్దరన్నయ్యలు, ఒక అక్క. మా అన్నయ్య చంద్రశేఖరరెడ్డి దగ్గరే నేను తొలి రోజుల్లో నిర్మాణ కాంట్రాక్టుల్లో ఓనమాలు నేర్చుకున్నా. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి మా అమ్మ రుక్మిణమ్మ కారణం. ‘జీవితంలో ఏదైనా సాధించాలన్న లక్ష్యం ఉండాలి... నలుగురిలోనూ పేరు నిలిచిపోయేలా కృషి చేయాలి’ అని ఆమె నూరిపోసేది. నా పురోగతికి నా మనసులో ముద్ర వేసిన ఆమె మాటలే కారణం.
రాజకీయాల్లో ఇప్పుడు మీకున్న ఆశలు, అంచనాలు...
రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పటికి 18 ఏళ్ళుగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా. ప్రస్తుత రాజ్యసభ సభ్యత్వ కాలం (ఆరేళ్ళు) ముగిసేసరికి 24 ఏళ్ళవుతుంది. ఆ తరువాత కూడా పార్లమెంట్ సభ్యుడినై, పాతికేళ్ళ పైగా ఎం.పి.గా ప్రజలకు సేవ చేశాననే తృప్తి పొందాలని ఉంది.
ఇంతకీ, మీకున్న అతి పెద్ద బలం ఏమిటి?
నా మనోబలం, ఈశ్వరశక్తి.
మరి, బలహీనత మాటేమిటో?
(నవ్వుతూ...) అందరినీ బాగా పొగుడుతాను. నన్ను ఎవరు పొగిడినా బాగా సంతోషిస్తాను. భోళా శంకరుడిలా అడిగిన వరాలు ఇచ్చేస్తా. అది నాకున్న పెద్ద బలహీనత. ఇన్నేళ్ళుగా దాని నుంచి బయటపడలేకపోయా (నవ్వులు...).
జాతీయ, ఫాల్కే అవార్డుల మొదలు ‘పద్మ’ పురస్కారాల దాకా చాలామందికి అవార్డులు రావడం వెనుక మీ కృషి ఉందని జనశ్రుతి.
అవును. అది నిజం. అన్ని రకాల అర్హతలూ ఉన్నప్పటికీ, ప్రతిభావంతులైన మన తెలుగువాళ్ళకు ఇలాంటి అవార్డుల విషయంలో ఢిల్లీలో న్యాయం జరగడం లేదు. అలాంటప్పుడు పలుకుబడిని ఉపయోగించి, ఫలానా తెలుగువాళ్ళు అర్హులని చెప్పాను. తప్పేముంది! అన్ని భాషల్లో సినిమాలు తీసిన గొప్ప నిర్మాత రామానాయుడుకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేశా. అట్లానే, స్వయంకృషితో పైకొచ్చిన చిరంజీవికి పద్మభూషణ్ వచ్చేలా చేశా. హీరో కృష్ణ, గాయని పి. సుశీల, నటులు మోహన్‌బాబు, బ్రహ్మానందాలకు పద్మ పురస్కారాలు వచ్చేలా చేశా. అక్కినేనికి పద్మవిభూషణ్ వచ్చేలా చేశా. అర్హతలు లేనివాళ్ళకు మనం అడగం. ఒకవేళ మనం అడిగినా సరే, వాళ్ళూ ఇవ్వరు. అర్హత ఉన్నప్పుడు చెబితే నేరమా? తెలుగువారికి గుర్తింపు విషయంలో ఢిల్లీ వాళ్ళు కళ్ళు మూసుకుంటే, వారిని నిద్ర లేపా!
మీకు ‘పద్మ’ రాలేదు. అడగలేదా, ఆశించలేదా?
(వెంటనే అందుకుంటూ...) అవి నాకెందుకండీ! సిసలైన కళాకారులకు అవి ఇవ్వాలి. ప్రజల ప్రశంసలే నాకు అవార్డు!
ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ