స్ఫూర్తి
సైన్స్‌ను సామాన్యుల దగ్గరికి తీసుకుపోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి ఫాల్కి. ‘సైంటిఫిక్ స్టోరీ టెల్లర్’గా దేశవిదేశాల్లో పేరు తెచ్చుకున్న జాహ్నవి సైన్స్‌కు సంబంధించిన డాక్యుమెంటరీలు తీసింది. పుస్తకాలు రాసింది.
‘అడగడం’ ‘తెలుసుకోవడం’ అనే ప్రక్రియ జాహ్నవికి ఎంతో ఇష్టమైనది. ఆమెకు బాగా నచ్చే మాట.. రైట్ క్వశ్చన్. రిసెర్చ్ వర్క్ నుంచి కెరీర్‌కు సంబంధించి డైరెక్షన్‌ను మార్చుకోవడం వరకు ‘రైట్ క్వశ్చన్’ అనేది ఆమెకు ఎంతో ఉపయోగపడింది. అమెరికాలోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరకు తీసుకెళ్లింది. అక్కడ భారతదేశ శాస్త్ర సాంకేతిక చరిత్రను అధ్యయనం చేసింది. ఆ చరిత్రపై బాగా ఇష్టాన్ని పెంచుకుంది. తాను తెలుసుకున్న విషయాలను, తన అభిప్రాయాలను నలుగురితో పంచుకోవడానికి వివిధ మాధ్యమాలను ఎంచుకుంది.
'బాంబే యూనివర్శిటీ’లో సివిక్స్ అండ్ పాలిటిక్స్ చదువుకున్న జాహ్నవి ‘జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీలో డాక్టరేట్ చేసింది. సామాజిక శాస్త్రాల అధ్యయనం ద్వారా సామాజిక కోణంలో సైన్స్‌ను అర్థం చేసుకుంది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ‘సైన్స్ అనేది ఒంటరి కాదు’ సైన్స్‌ను ప్రభావితం చేసే అంశాలు సమాజంలో ఎన్నో ఉంటాయి. ఆ అంశాలకు సైన్స్‌కు మధ్య ఉండే అంతః సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసింది.
‘ఆటోమిక్ స్టేట్ బిగ్ సైన్స్ ఇన్ ట్వంటీయత్ సెంచరీ ఇండియా సైన్స్’ పుస్తకం జాహ్నవికి ఎంతో పేరు తెచ్చింది. ‘కీ కాన్సెప్ట్స్ ఇన్ మోడ్రన్ ఇండియన్ స్టడీస్’కు కో–ఎడిటర్‌గా వ్యవహరించింది. ‘సైక్లోట్రాన్’ పేరుతో సైన్స్ డాక్యుమెంటరీ తీసింది. సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ద్వారా కథలు చెప్పడం తనకు ఇష్టమైన పని. ‘మెనూ గురించి తెలుసుకోవాలంటే మనం మొదట ఉండాల్సింది టేబుల్ దగ్గర’ అంటున్న జాహ్నవి ‘సైన్స్’ అనే మెనూ గురించి తెలుసుకోవడానికి ‘సైన్స్ గ్యాలరీ’ అనే టేబుల్ దగ్గరికి ప్రజలను తీసుకువస్తుంది.
లండన్‌లోని కింగ్స్ కాలేజీ ఫ్యాకల్టీగా పనిచేసిన జాహ్నవి 2018లో ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ఫౌండింగ్ మెంబర్‌గా నియమితురాలైంది. ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచానికి కాస్త దూరంగా.. సృజనాత్మకంగా ఆలోచించేలా, సైన్స్‌కు దగ్గరయ్యేలా యువతను ఆకట్టుకోవడానికి ‘బెంగళూరు సైన్స్ గ్యాలరీ’ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి.
‘మ్యూజియం’ వాతావరణం ఆమెకు కొత్త కాదు. ‘సైన్స్ మ్యూజియం లండన్’ ఎక్స్‌టర్నల్ క్యురేటర్‌గా పనిచేసి ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ‘మా టార్గెట్ ఆడియెన్స్ పదిహేనేళ్ల పైబడిన వారు అయినప్పటికీ అండర్ గ్రాడ్యుయేట్‌లు, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లపై కూడా దృష్టి సారిస్తాం. అంతరిక్షానికి సంబంధించి సమకాలీన, భవిష్యత్ విషయాలపై దృష్టి పెట్టేలా గ్యాలరీ తోడ్పడుతుంది’ అంటుంది జాహ్నవి.
శాస్త్రీయ విషయాలతో యువత మమేకం కావడానికి డిజిటల్ ఎగ్జిబిషన్ ద్వారా ప్రయత్నిస్తోంది జాహ్నవి. ‘బ్రేకింగ్ ది వాల్స్ బిట్విన్ సైన్స్ అండ్ కల్చర్’ శీర్షికతో నిర్వహించిన ఆన్‌లైన్ సైన్స్ గ్యాలరీకి కూడా మంచి స్పందన వచ్చింది. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ జాహ్నవిని హ్యుమానిటీస్ విభాగంలో ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’తో సత్కరించింది. సైన్స్‌ను జాహ్నవి అర్థం చేసుకున్న కోణాన్ని, చేపడుతున్న కార్యక్రమాలను ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ప్రశంసించింది.
ఇవి చదవండి: Ruchira Gupta: చీకటి కూపం నుంచి వెన్నెల దారుల్లోకి..
Comments
Please login to add a commentAdd a comment