
సనాతన ధర్మంలో దంపతుల వైశిష్ఠ్యం, ముఖ్యంగా స్త్రీ వైశిష్ట్యం ఎంత గొప్పగా ఉంటుందంటే... వివాహం అయిపోయిన తరువాత అగ్నికార్యం చేసేటప్పుడు పురుషుడు భార్యను ఉద్దేశించి కొన్ని విషయాలు అడుగుతాడు... వాటిలో ఒకటి–‘‘నీవు పది మంది పిల్లల్ని కని నన్ను పదకొండవ కొడుకుగా చూడు’’–అని. అంటే దానర్థం?భార్య పురుషునికి శాంతి స్థానం. పురుషుడు ఎన్ని ఆటుపోట్లకు గురయినా పురుషుడి శాంతి అంతిమంగా స్త్రీ చేతిలో ఉంటుంది. నేనీ మాట ఉబుసుపోక చెప్పట్లేదు... అగ్ని సాక్షిగా అడుగుతాడు ఇలా... ఆయనకు పదిమంది కొడుకులు పుట్టారు. ఆయన సహస్ర చంద్ర దర్శనోత్సవాలకు అందరూ వచ్చారు. ఏదో పని అలా కాదు ఇలా చేయమని తండ్రి చెబితే ఒక కొడుకు ‘నాన్నగారూ, ఇంకా మీ కెందుకివన్నీ, మేం పెద్దవారమయ్యాం.
మేం చూసుకుంటాం. మీరు ఇన్నాళ్ళూ మమ్మల్ని పెంచి పెద్దచేయడంలో మీకు తీరిక దొరకక రామాయణ భారతాలు చదవలేకపోయారు. ఇప్పుడు హాయిగా అవి చదువుకోండి’..అనడంతో తన మాటకు పిల్లలు గౌరవం ఈయడం లేదని అలిగి ఆయన అన్నం తినకుండా ఓ మూలన కూర్చుంటే... ఆయన మనసెరిగిన ఇల్లాలు ఆయనను పిల్లల్ని బుజ్జగించినట్లు బుజ్జగించి, కాస్తచనువుతో గదమాయిస్తూ ఆయనను చేయిపట్టి తీసుకొచ్చి విస్తరి దగ్గర కూర్చోబెడుతుంది. తర్వాత కొద్ది సెకన్లలోనే ఆ కారుమేఘాలన్నీ మాయమయి పరిస్థితి మామూలు స్థాయికి చేరిపోతుంది.రామాయణాన్ని పరిశీలించండి. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా రాముడు తట్టుకున్నాడు. రాజ్యం పోయింది. బెంగ పెట్టుకోలేదు, తండ్రి మరణించాడు, దిగులుపడలేదు.
అరణ్యవాసం చేసాడు, రాక్షసులు మీద పడ్డారు, ఎన్నో కష్టాలొచ్చాయి. కించిత్ మథనపడలేదు. సీతమ్మ కనబడలేదు. అంతే! రాముడు ఉగ్రుడయిపోయాడు. అప్పటివరకు చేయనివాడు రావణ సంహారం చేసాడు. రాక్షసులను తుదముట్టించాడు. అంటే అసలు నిజానికి రాముడు శ్రీరాముడిగా సీతమ్మ కారణంగా అంత శాంతిని పొందాడు.అందుకే సుమంతుడు తిరిగి వచ్చిన తరువాత ‘సీతారాములెలా ఉన్నారు?’ అని దశరథ మహారాజు, కౌసల్యాదేవి అడిగితే ముందు సీతమ్మ గురించి చెప్పాడు. పక్కన నా భర్త రాముడు ఉన్నాడని చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంటోంది, అంత సంతోషంగా ఉంది’ అన్నాడు. భార్య అంత సంతోషంగా ఉంటే రాముడూ అంత సంతోషంగా ఉన్నాడు. స్త్రీ పురుషుడి శాంతికి కారణమవుతుంది. ఆమె పరిమితి, ఆమె ఉపాసన ఈ దేశంలో, ఈ ధర్మంలో ఒక అద్భుతం.
Comments
Please login to add a commentAdd a comment