శరమ రాక్షస స్త్రీ. విభీషణుడి భార్య. శరూషుడు అనే గంధర్వుడి కుమార్తె. రామాయణంలో కొద్దిసేపు కనపడుతుంది. కానీ ఒక పెద్ద మెరుపు. విభీషణుడు ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయించి ఉంటాడు. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ చతుర్ముఖ బ్రహ్మని ఉద్దేశించి తపస్సు చేసారు. బ్రహ్మ ప్రత్యక్షమవగానే ఒక్కొక్కడు ఒక్కొక్క వరం కోరాడు. ‘‘మనసు ఎప్పుడూ ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి ఉండుగాక!’’ అని విభీషణుడు కోరగా బ్రహ్మ తథాస్తన్నాడు. అందుకే తప్పు చేస్తున్నావని చెప్పినా వినని రావణుడు రాజ్యబహిష్కారం విధిస్తే, విభీషణుడు ధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళిపోయాడు. అప్పుడు విభీషణుడి భార్య ఏం చేయాలి .. ఆమె కూడా ఆయన వెంటే వెళ్ళిపోవాలి. కానీ ఆమె వెళ్ళలేదు. భర్తమీద ప్రేమ లేక కాదు, భర్తతో కలిసి వెళ్ళాలని తెలియక కాదు. తన భర్తకు దూరమైన మరొక స్త్రీ దుర్మార్గుడైన రాక్షసుడు రావణుడివల్ల కష్టాలు పడుతుంటే, ఊరడించడానికి మనిషి లేకపోతే అది మహా పాపం–అని భర్తతో వెళ్లిపోవడం కన్నా, ఇక్కడే ఉండిపోతానని ప్రాణాలకు తెగించి ఉండిపోయింది.
యుద్ధం ప్రారంభమవుతుందనగా రావణుడు సీతమ్మ దగ్గరకు వెళ్లాడు...‘‘సీతా! నిన్న రాత్రి రామ లక్ష్మణులు పలువురు వానరులతో కలిసి వచ్చి సముద్రపు ఒడ్డున విడిది చేసారు. నా సేనాధిపతి ప్రహస్తుడు సైన్యంతో వెళ్ళి నిద్రపోతున్న రాముని శిరస్సును కోసేశాడు. మిగిలిన వానరులందరూ పారిపోయారు. లక్ష్మణుడు కూడా పారిపోయాడు. రాముడి శిరస్సును నా సైన్యం తీసుకొచ్చింది... ఇదిగో చూడు’’ అని ఒక రాక్షసుడిని పిలిచి తల అక్కడ పెట్టు అన్నాడు. ఇంద్రజాల మహిమ ఎంత గొప్పగా ఉందంటే సీతమ్మ కూడా దిగ్భ్రమ చెందింది. ‘‘చూసావా ధనుస్సు. ఈ కోదండం పట్టుకునే కదా నన్ను సంహరిస్తాడన్నావు... ఈ రాముణ్ణి నమ్ముకునే కదా నా పాన్పు చేరలేదు. రాముడి తల తెగిపోయింది. ఇప్పుడు నిన్ను రక్షించే వారెవరు’’ అన్నాడు. సీతమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తోంది.
ఆ సమయంలో తన కష్టం చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేరక్కడ. అంత శోకంలో ఎవరికయినా మనసు పనిచేస్తుందా... తను కనబడితే చంపేస్తాడని తెలిసినా సరే, నిర్భయంగా శరమ ఆకాశంలో నిలబడింది. రావణుడు చూడలేదు. ఈలోగా ఎవరో వచ్చి రమ్మంటే రావణుడు అటు వెళ్ళాడు. ఆమెను చేరిన శరమ ‘‘అమ్మా సీతమ్మా ! బెంగపెట్టుకోకు. అదంతా రావణుడి మాయ... నేనిప్పుడు ఆకాశగమనం చేసి రామచంద్రమూర్తిని చూసి వచ్చాను. అయినా రాముడికి విశ్వామిత్రుడి వరం ఉంది కదా.
ఆయనకు శ్రమ ఉండదు, జ్వరముండదు. నిద్రపోతున్న ఆయనను ఎవరూ సంహరించలేరు... అటువంటిది ఈ ధూర్తు్తడు ప్రహస్తుడు చంపగలడా... నన్ను నమ్ము... రాముడు పరమ సంతోషంగా ఉన్నాడు’’ అంది. అయినా ఊరడిల్లని సీతమ్మ రావణుడు ఏం చేస్తున్నాడో చూసి రమ్మంది. వెళ్ళి వచ్చిన శరమ ‘‘అమ్మా ఇప్పుడు విను. అవిగో నగారాలు మోగుతున్నాయి...అవిగో భేరీల శబ్దాలు.. యుద్ధసంరంభం జరుగుతున్నది. నిజంగా రావణుడు చెప్పినదే నిజమయితే రాముడు నిహతుడు అయిన తరువాత ఇంకా యుద్ధం ఏముంటుంది? అమ్మా నన్ను నమ్ము. ఉపశాంతికోసం నీ భర్త విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యక్ష దైవమయిన సూర్యుణ్ణి ఉపాసించు’’ అంటూ ఎలా చేయాలో ఉపదేశించింది. అంతటి త్యాగమూర్తులు ఈ దేశ స్త్రీలు. ఇవి కాల్పనిక కథలు కావు. ఇతిహాసాలు. పరమ సత్యాలు.
Comments
Please login to add a commentAdd a comment