అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి.
‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు.
వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు.
మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు.
నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు.
‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది.
ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు.
Comments
Please login to add a commentAdd a comment