
వినండి... వినడం నేర్చుకోండి
విద్య - విలువలు
ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే, ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి మీరు కానీ, ఒక్క మాట అందులో పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... అటువంటి వాడి జీవితం చక్కదిద్దబడటానికి అవకాశం ఉంటుంది. రామాయణంలో మారీచుడు రావణాసురుడితో ఒక మాట చెప్పాడు. రామాయణమంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక్క శ్లోకం ఒక ఎత్తు. అది రాముడు చెప్పడు, విశ్వామిత్రుడు చెప్పడు, వశిష్ఠుడు చెప్పడు. రాక్షసుడైన మారీచుడు చెబుతాడు. కానీ నాకు ఎంతిష్టమో ఆ శ్లోకం. అందులో మారీచుడంటాడు. ‘‘సులభః పురుషః రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పత్యస్య క్తాశ్రోతాచ దుర్లభః’’
మీరు ఏది చేస్తే అది కరెక్ట్ అనే వాళ్లు మీకు జీవితంలో చాలామంది దొరుకుతారు. మీరు చేసేది తప్పు. ఇలా చేయొద్దు అనేటటువంటి మిత్రులు ఒక్కరు కూడా ఉండరు. మీరు ఎదుగుతున్న కొద్దీ మీకు చెప్పేవారు దొరకరు. మీరు ఆఫీసరు అయ్యారనుకోండి. మీరు తప్పు చేస్తే ఆఫీసులో మాట్లాడుకుంటారుగానీ, మీ ఎదురుగా వచ్చి మాట్లాడరు. ఒకవేళ చెప్పినా నిష్పక్షపాతంగా మీ అభ్యున్నతి కోరి చెప్పరు. మీరు గోతిలో పడిపోతున్నా మిమ్మల్ని పొగిడే వారు మీ చుట్టూ ఎంతోమంది ఉంటారు. కానీ మీకు మేలు కలిగించే అప్రియమైన మాటలు చెప్పడానికి ఎవరూ ముందుకు రారు. మీ మేలు కోరి చెప్పేవారి మాటలు పట్టించుకోకుండా మీ అహం దెబ్బతింటుందని దూరంగా పెడితే, మీరు గోతిలో పడిపోక తప్పదు. మారీచుడు చెప్పిన మాట రావణాసురుడు విని ఉంటే రావణుని పతనమే తప్పేది. చెప్పిన మాట వినకపోవడమన్న దోషం నీతో పోదు. నిన్ను నమ్ముకున్న కోట్లాది మంది నీతో పోతారు అన్నాడు. అందుకనే మీరు ఎప్పుడూ శాస్త్ర పఠనం చేస్తూ ఉండాలి. రాక్షసులకు ఎంత జ్ఞానం ఉంటే అంత అపాయం.
ఏమీ తెలియని వాడు తప్పు చేస్తే చెప్పడానికి చాలామంది ఉంటారు. బాగా చదువుకుని, పెద్ద పనిలో ఉన్నవాడు తప్పు చేస్తుంటే చెప్పడానికి ఎవరూ ఉండరు. జ్ఞాని ఖలుడైపోతే లోకానికి ఉపద్రవం వస్తుంది. చదువుకునే వాడికే క్యారెక్టర్ చాలా అవసరం. రేపొద్దున మీరే సంఘానికి ఉదాహరణలవుతారు. మీకు ఒక మాట మనవి చేస్తాను బాగా గుర్తు పెట్టుకోండి. సచ్చిదానంద శివాభినందనృసింహ భారతి అని శృంగేరి పీఠాధిపతులు అరణ్యం గుండా వెళుతున్నారు. చీకటి పడితే ఆ అరణ్యంలోనే ఒకచోట గుడారాలు వేసుకుని పూజ చేసుకుంటున్నారు. ఫారెస్టు రేంజర్ వచ్చాడు అక్కడికి. వచ్చి నమస్కారం చేసి నిలుచున్నాడు. పీఠాధిపతి త్రికాలవేది. మనిషిని చూడగానే అతనిలో ఉన్నది అంతా చెప్పేస్తారు. అతన్ని చూడగానే ఒక మాటన్నారు.
‘‘నేను మూడు లక్షణాలు చెబుతాను. ఇందులో నీవే స్థాయిలో ఉన్నావో నీవు చెప్పు.’’ ‘‘అడగండి’’ అన్నాడతను. ‘‘అసలు నీ మనసులోకి ఒక అభిప్రాయం రాగానే అవతలి వాడిని వివరణ కూడా అడగకుండా విరుచుకు పడిపోయే అంత కోపమున్నవాడివా? నీ మనసులో ఒక అభిప్రాయం వచ్చిన తరువాత వివరణ చేసి విరుచుకుపడే కోపమున్నవాడివా? అసలు విచారం అన్నదే లేకుండా కోప్పడిపోయి వెళ్లిపోతుండడమే నీ ఐశ్వర్యం అనుకునే స్వభావం ఉన్నవాడివా?’’ అని అడిగారు. అది ఎందుకడిగారో అడిగినాయనకు తెలుసు, విన్నాయనకు తెలుసు. ఆయనన్నారు నేను మొదటి కోవకి చెందినవాణ్ణి. నాకు కోపం వస్తే అవతలివాడు తప్పు చేశాడని నమ్మేస్తాను. ఆయనన్నారు. ‘‘నీవు నా దర్శనానికి వచ్చావు కదా! నేను నీకిచ్చే కానుక ఒకటే నీవు రెండవ స్థితిలోకి మారు. నీకు కోపం వచ్చేయగానే ఒక్కసారి ఆగు. ‘‘ఎందుకిలా చేశావ్’’ అని అడుగు. నీ జీవితంలో నీవెన్ని తప్పులు చేశావో తెలుస్తుంది.’’
అతను ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లిపోయేసరికి బాగా చీకటి పడింది. వంటవాడిని ‘‘బాగా ఆకలిగా ఉంది ఫలహారం పెట్టు’’ అన్నాడు. వేపుడు ముక్కలు కూడా లేకుండా రెండే గోధుమ రొట్టెలు తీసుకువచ్చి వణికిపోతూ అక్కడ పళ్లెంలో పెట్టాడు. ఈయనకు ఎక్కడాలేని కోపం వచ్చింది. అతను ఓ ఏడెనిమిది రొట్టెలు తింటాడు. ఓ రెండు కూరల్తోటి. రెండు పలుచని రొట్టెలు. అంటే నేను రాననుకొని వీడు తినేశాడు అనుకుని వెంటనే లేచి అతన్ని కొట్టబోయాడు. పీఠాధిపతి మాట గుర్తుకొచ్చింది.
ఇవాళ రెండో స్థాయికి మారి చూద్దామని, ‘‘ఎందుకు రెండు రొట్టెలు తెచ్చావ్?’’ అని అడిగాడు. అతనన్నాడు. ‘‘మీ అటెండర్‌ని పంపించి కదా! సరుకు తెప్పించుకుంటాం. అతను ఏ కారణం చేతనో ఇవాళ సరుకు తేలేదు. నాకోసం మిగుల్చుకున్న ఈ రొట్టెలు నాకు చచ్చేంత ఆకలిగా ఉన్నా మీరు తిని వస్తారో, రారో అని అట్టే పెట్టాను. రెండు రొట్టెలే పెట్టిన నా దోషాన్ని మన్నించండి’’ అన్నాడు. నిజంగా ఆ రేంజర్ వలవలా ఏడ్చేశాడు. నేను ఇలా తొందరపడి కొట్టేసి ఉంటే..? ఇలా ఎందరిని నా కోపం చేత కొట్టానో. నేను ఇలా అడిగితే వీడు నా కోసం పడ్డ కష్టం తెలిసిందే. ఇంతలా నా కోసం కష్టపడ్డ వీణ్ణి కొట్టబోయాను. నిజంగా మహానుభావుడు ఈ మూడు తరగతులలో దేనికి చెందినవాడవని ప్రశ్నించి ఒకటి నుంచి రెండవ స్థితికి మారమని చెప్పి వెళ్లిపోయాడు.
నేను రెండోస్థాయికి వస్తే నా దోషాలు కనపడ్డాయి. నేను ఎంతమందిని కొట్టానో అని ఏడ్చి, ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడాయన. నేనెందుకు మీకు మనవి చేస్తున్నానంటే మీ దుర్గుణాలను మీరు గ్రహించగలరు. మీలో ఉన్న దుర్గుణాలను మీ ముందు ఎవరూ చెప్పలేరు. మీ లోపాలని మీరు దిద్దుకోవడం ప్రారంభిస్తే, సమాజానికి ఎంతో సేవచేసిన వాళ్లు అవుతారు. మిమ్మల్ని మీరు దోషరహితంగా దిద్దుకోగలిగితే ఈ దేశానికి నీడనిచ్చే చెట్టులాంటి వారు అవుతారు. మీ నీడన ఎందరో సేద తీరుతారు. మీరు రేప్పొద్దున్న ఓ మంచి ఆఫీసర్ అయ్యారనుకోండి. మీ డ్రాఫ్ట్ రాసే అతను ఓ డ్రాఫ్ట్ రాసి పట్టుకొచ్చి మీకిచ్చాడనుకోండి. మీరు అతని డ్రాఫ్ట్‌ని మెచ్చుకుంటే అతను ఇంకా బాగా పనిచేస్తాడు. బాగా పనిచేసేవాళ్లని అభినందించండి. సంకుచితత్త్వంతో మీకు బాగా ఇష్టమున్న వాళ్లని మాత్రమే అభినందించకండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అతని వ్యక్తిత్వం నచ్చినా నచ్చకపోయినా, ఆ పనిని అతను సమర్థంగా చేస్తాడనుకుంటే ఆ పనిని అతనికే అప్పగించాలి. కాళిదాసు రఘుమహారాజు గురించి చెబుతూ... అతను ఎలా పనులు ఒప్పగించే వాడంటే ‘‘రోగి ఔషధిని సేవించినట్లు’’ అని చెబుతాడు. తనకు ప్రియుడా... అప్రియుడా... అన్నదతనికి అనవసరం. అతను ఆ పనికి అర్హుడు అనుకుంటే ఇచ్చేసేవాడు అంతే! ఈవాళ దేశానికి ఉన్న దరిద్రం ఏమిటంటే అది పాటించకపోవడం. కాళిదాసు ఇంకో మాటంటాడు. ‘‘ఆ పదవికి అతను అనర్హుడనుకుంటే తనకు అత్యంత ప్రియుడైనా సరే పాముకరిచిన వేలు తీయించుకున్నట్లు తీసివేసేటటువంటి వాడు. ‘‘అంగుళీ యోర గచ్చతీ’’ అంటాడు కాళిదాసు.
మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. నేను మీకు ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. మీరు ఒక గ్రూపు సబ్జెక్టుని చదివితే అది శీల నిర్మాణాన్ని చేయలేదు. జీవితం అనేది ఎత్తుపల్లాలతో ఉండి తీరుతుంది. గ్రూపు సబ్జెక్ట్ మీ జీవితంలో వచ్చే ఉత్థానపతనాల నుంచి రక్షించలేదని తెలుసుకోండి. మట్టిముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారి కిందపడి పోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంత పైకి లేస్తుంది. అలా పైకి లేవగలిగిన శక్తి కోసం మీరు విద్యార్థులయి ఉన్నారు తప్ప చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంక పెట్టారని మీరు మృత్పిండమై పోకండి. మీ వల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిన నాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి. నిర్భయంగా అంగీకరించండి. నే నిది చేశాను. ఈ కారణానికి నేనిది చేశాను. ఒకవేళ మీరు నిజంగా స్వార్థంతో చేస్తుంటే ఇంకా ధైర్యంగా చెప్పేయండి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు