
చాగంటి కోటేశ్వరరావు
సృష్టి అంత పవిత్రంగా కొనసాగడం కోసం అందాన్నంతటినీ పురుష శరీరంలోనూ, ఆకర్షణను స్త్రీ శరీరంలోనూ పరమేశ్వరుడు నిక్షేపించాడని నేనంటే మీకు అది అనుమానాస్పదంగా తోచవచ్చు. అందుకే నెమళ్ళను పరిశీలించండి. అందమైన ఈకలతో ఉన్న పింఛను విప్పి ఆడేది మగ నెమలి. ఆడ నెమలి పురివిప్పి ఆడదు. రంగురంగుల ఈకలతో ఉన్న తోకతో కోడిపుంజు చాలా అందంగా కనిపిస్తుంది. కోడిపెట్ట అలా ఉండదు. సింహం పెద్ద జూలుతో అందంగా ఉంటుంది. సివంగి అలా ఉండదు. ఇవి చౌకబారుతనంతో చెబుతున్న మాటలు కావు. పరమేశ్వరుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాబోయే ప్రాణులు మంచి తేజస్సుతో సష్టించబడాలంటే...సృష్టి కార్యమనే యజ్ఞంలో స్త్రీ పురుషులిద్దరికీ ఒక సంతోషం ఉండాలి. అందుకని స్త్రీ, పురుష అనే రెండుగా విభాగం చేసాడు.
ఇందులో పురుషప్రాణికి సహజంగా ఉండే శారీరక సౌలభ్యం రీత్యా కొంచెం పైస్థానంలో ఉంచాడు. కానీ దానిని సంస్కరించకపోతే ప్రమాదమని భావించి కొన్ని కఠిన నియమాలు ఉంచాడు. కానీ స్త్రీకి అలాటి కఠిన నియమాలేవీ ఉంచలేదు. ఆమె సహజంగానే శాంత స్వభావి. ప్రేమమూర్తి. విశాల హృదయంతో చూడగల నేర్పరితనం ఆమె యందుంచాడు.
తెలుగునాట మనం ఆడపిల్ల అంటాం. ‘ఆడ’ పిల్ల అంటే అక్కడి పిల్ల అని. ఇక్కడ పుట్టింది. కానీ అక్కడికి వెడుతుంది. అది నా స్వస్థానం అంటుంది, అది నా ఇల్లు అంటుంది. ఇది మీ ఇల్లు అంటుంది. అలా ఎందుకు? ఆమె లక్ష్మి. ఆమె నారాయణుడిని వెతుక్కుంటుంది. ఆయన ఎక్కడున్నాడో చూసుకుంటుంది. అందుకే కన్యాదానం చేసేటప్పుడు తమ బిడ్డని లక్ష్మీ స్వరూపంగా భావన చేసి పద్మంలో కూర్చోబెడతారు. బుట్టలో ధాన్యం పోసి కూర్చోబెడతారు. అంటే పద్మంలో లక్ష్మీదేవిని కూర్చోబెట్టినట్లు. వరుడు పీటల మీదికి నడిచి వస్తాడు. వధువు అలా నడిచి రాకూడదు. ఆమె లక్ష్మి. బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తెచ్చి నారాయణుడిదగ్గరకు చేర్చడం కోసం అక్కడ పీటల మీద కూర్చోబెడతారు.
ఆమె కూడా మగపిల్లలు ఎలా పుట్టారో అలానే పుట్టింది. వాళ్ళతో కలిసి పెరిగింది. వివాహం అయి వెళ్ళేటప్పడు తన పుట్టింటిని విడిచి పెట్టేస్తుంది. తన ఇంటిపేరు, గోత్రం విడిచిపెట్టేస్తుంది. ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడలేదు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడి చిటికెన వేలు పట్టుకుంది. తన జీవితానికి సంబంధించిన కష్టసుఖాలన్నీ అతని తోడనే అని నడుచుకుంటూ ఖండాంతరాలు దాటి కూడా వెళ్ళిపోతుంది.
తాను గర్భిణియై పునర్జన్మ పొందినంత క్లేశాన్ని అనుభవించి బిడ్డను కంటే–మొదట తాతయింది ఎవరు.. తన భర్త తండ్రి. ఆ వంశం తరించింది. ఆ వంశం పెరిగింది. ఆ పిల్ల ఎక్కడి పిల్ల? ఇక్కడ పుట్టినా అక్కడ ఉద్ధరింప చేస్తోంది. అసలు ఆ పిల్లలో ఆ భావన లేదనుకోండి. సృష్టి క్రమం ఇలా సజావుగా సాగుతుందా? కుటుంబాల్లో, జీవితాల్లో మనశ్శాంతి ఉంటుందా? వ్యవస్థలో క్రమశిక్షణ ఉంటుందా? ఒక బాతును నీళ్ళల్లో వదిలితే ఎలా అలవోకగా తిరుగుతుందో అలా అదే తన ఇల్లన్నట్లు, తను అక్కడే పుట్టినట్లు, అక్కడి వారంతా తనవారన్నట్లు అల్లుకు పోతుంది. ఆ భావోద్దీపన పురుషుడికీ ఉంటుందా...
Comments
Please login to add a commentAdd a comment