మనిషి వృద్ధిలోకి రావడానికి తప్పకుండా నేర్చుకుని తీరవలసినది నీతి శాస్త్రం. ఆ నీతిని పాటించకపోతే తాను ఒక్కడే పతనమయిపోడు. తనతోపాటూ చుట్టూ ఉండే సమాజం కూడా భ్రష్టుపట్టే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తిన్న అన్నం కొద్దిగా కలుషితం అయితే ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే అనారోగ్యం వస్తుంది. కానీ ఒక ఊరివారందరూ దాహం తీర్చుకునే చెరువు విషపూరితం అయితే ఊరంతా అస్వస్థతకు గురవుతుంది. అయితే నీతి విషయంలో మాత్రం... ఒక వ్యక్తి నీతి తప్పితే కేవలం ఆ వ్యక్తి మాత్రమే పతనమయిపోడు, సమాజంలో ఉన్న అనేకమంది దాని దుష్ప్రభావానికి లోనవుతారు. అంతేకాక అతని తాత్కాలిక సుఖాలను ఆదర్శంగా భావించే అపరిపక్వ మనస్కులూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే నీతి శాస్త్రాలను బాగా చదువుకోవాలి. తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేంత సులభంగా మనకు శతకాలు అందుబాటులో ఉన్నాయి... ఎక్కువకాలం గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చక్కటి పద్యాల రూపంలో ఉన్నాయి.
శతకం అంటే నూరు పద్యాలతో ఉన్న గ్రంథం అని. కానీ నూరే ఉండాలన్న నియమం లేదు. శతకం – అంటే ‘నూట ఎనిమిది’ అన్న అర్థం కూడా ఉంది. 108 కానీ, 116 కానీ పద్యాలు ఉండడం సంప్రదాయంగా వస్తోంది. కొన్నిచోట్ల అవి దాటిన శతకాలు కూడా ఉన్నాయి. సంస్కృతంలో లేనిది తెలుగులో మాత్రమే ప్రత్యేకంగా కనిపించేది మకుటం. ప్రతి పద్యం చివర మాటకానీ, చివర పంక్తి కానీ, కొన్నిసార్లు చివరి భాగం కానీ, సీస పద్యాలవంటి వాటిల్లో అయితే చివరి పద్యం కానీ మకుటం అవుతుంది. సుమతీ అనీ, దాశరథీ! కరుణాపయోనిథీ! అనీ, విశ్వదాభిరామ వినురవేమ... అనీ ఉంచారు. వీటిలో భక్తికి సంబంధించినవి, ఆవేదనను వెళ్ళగక్కేవి, ప్రకృతిని వర్ణించేవి ... ఇలా చాలా శతకాలు ఉన్నా తెలుగు భాషలో నీతి శతకాలకు ప్రత్యేక స్థానం ఉన్నది.
పెద్దలు, పరిశోధకుల పరిశీలన ప్రకారం శతక రచన ప్రారంభం అయింది నన్నయతో అంటారు. భారతాన్ని ఆంధ్రభాషలో రచన ప్రారంభం చేసే సమయంలో ఆయన రాసిన కొన్ని పద్యాల చివరన ఆదిశేషుని ఉద్దేశించి ‘..నాకు ప్రసన్నుడయ్యెడున్’ అన్న మకుటంతో ముగించారు. ఇది తరువాత కాలంలో శతక రచనకు ప్రేరణనిచ్చాయంటారు వీరు. విద్యార్థులకు సంబంధించినంతవరకు అత్యంత ప్రధానమైనది నీతి శతకం. తెలుగులో ఇలా వచ్చిన మొట్టమొదటి శతకం – సుమతీ శతకం. కాకతి రుద్రమదేవి దగ్గర సామంత రాజుగా ఉన్న భద్ర భూపాలుడు .. బద్దెన అనే పేరుతో అందరికీ పనికి వచ్చే నీతుల సమాహార స్వరూపంగా దీనిని రచించారు.
కిందిస్థాయి ఉద్యోగులు, అధికారులు, పౌరులు, సమాజంలోని విభిన్న వర్గాలవారు, చివరకు కవులు కూడా తెలుసుకోవాల్సిన నీతి సూత్రాలను ఇందులో పొందుపరిచారు. ఏవి పాటించాలో, ఏవి పాటించకూడదో, వేటిని మనిషి ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలో దీనిలో ప్రతిపాదించారు. వీటిని కంఠస్థం చేసుకుని ధారణలో ఉంచుకుంటే.. జీవితంలో క్లిష్ట సమస్యల వలయంలో చిక్కుకుని ఏ దారీ కనిపించ నప్పడు ఇవి వాటంతట అవే గుర్తుకు వచ్చి కాపాడతాయి. సుమతీ శతక పద్యాలు ‘సుమతీ’ అన్న మకుటంతో ముగుస్తాయి.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
చదవండి: నిలుపుకోవలసిన అలవాట్లు
Comments
Please login to add a commentAdd a comment