ఉపాసన– ఉప.. సమీపానికి వెళ్ళడం. పరమేశ్వరుని, పరాశక్తిని తెలుసుకోవడానికి అంతర్ముఖత్వం పొంది దగ్గరగా జరగడం. అంతర్ముఖ సమారాధ్యా, బహిర్ముఖ సుదుర్లభా...’’ ఆవిడ బయట దొరుకుతుందా? అంతర్ముఖాన్ని పొందితే దొరుకుతుంది. ద్యానంలో లోపలకి వెడితే, ఆ నిశ్శబ్దంలో అక్కడ కూర్చుని లోపలికి ప్రయాణం చేస్తే అక్కడ అమ్మవారి పాదమంజీరాల సవ్వళ్ళు వింటూ, ఆమె పాదాల జంట చూసి యోగి పారవశ్యాన్ని పొందుతాడు. అలా లోపలికి వెళ్లారు విద్వాంసులందరూ... నాదోపాసన చేసి శబ్దం ఎక్కడినుంచి పైకి వస్తుందో ఆ స్థానానికి వెళ్లిపోయారు, అక్కడ లయమయిపోయారు. అందుకే భారతీయ సంస్కృతిని అంతటినీ ఉద్దీపింపచేసిన ప్రధానమైన కళల్లో ఒకటి సంగీతం. పాట పాడుకోవడం వచ్చినవాడు, దానికి స్వరాలు వేస్తూ తాను ఆనందాన్ని పొందుతూ, సభనంతటినీ ఆనందపెట్టేస్తారు. అది భగవతి అనుగ్రహం.
తెలుగునేల నిజంగా గర్వపడాలి. చలనచిత్రసీమలో పాటలు పాడినా వారు తగినంత నేపథ్యం లేకుండా విజయాలు సాధించలేదు. ఘంటసాల వేంకటేశ్వరరావు, బాలసుబ్రహ్మణ్యం, భానుమతీ రామకృష్ణ గార్లు... ఘంటసాలగారు శరీరం విడిచి చాలా కాలమయినా... ఇప్పటికీ మనం వేంకటాచలం వెడితే ఆనంద నిలయం దగ్గర ఆయన కంఠం మనకు భగవద్గీత రూపంలో కనబడుతుంటుంది. కీర్తి శరీరులు కావడం అంటే ఇదే కదూ!
బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి సాంబమూర్తిగారు. హరికథలు చెప్పేవారు. కొన్నేళ్ళపాటు దీక్ష తీసుకుని... నెల్లూరు పట్టణంలో ప్రాతఃకాలంలో కీర్తనలు పాడుకుంటూ వీథివీథి తిరుగుతూ భిక్షాటనతో సేకరించిన బియ్యం తదితర విరాళాలతో ఏటా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో అపూర్వంగా నిర్వహించారు. ఆయన చేసిన త్యాగరాజోపాసన, దాని అనుగ్రహాల ఫలితమే కుమారుడు బాల సుబ్రహ్మణ్యం దేశవిదేశాల్లో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు. అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ సంగీతంలో చేసిన ఉపాసన ఉత్తినే పోలేదు. భగవద్భక్తితో రామనామం పట్టుకున్నవాడిని, పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నవాడిని ఏ స్థానానికి చేర్చాడో... వారి వెనుక ఉన్న వాళ్లను రక్షించాడో నాదోపాసన చేసి సంగీతాన్ని నమ్ముకున్న వాళ్ళను కూడా అలాగే కాపాడాడు.
భానుమతీ రామకృష్ణగారు అంతటి విద్వాంసురాలు, లబ్దప్రతిష్టులు కావడానికి కారణం వారి తల్లి... ఆమె కీర్తనలు చాలా బాగా పాడేవారు. తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. ఒక్కొక్కప్పుడు వారి కుటుంబం కడుపునిండా తినడానికి కూడా నోచుకోని పరిస్థితులు ఎదురయితే పెరట్లోని బచ్చలి కూర నీళ్ళలో ఉడికించి దానితో నీరసంగా రోజులు వెళ్ళదీస్తూ కూడా త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు పాడుకుంటూ సమస్త బాధల్నీ మరిచిపోయేవారు. ఆ భార్యాభర్తలు చేసిన ఉపాసనా ఫలితం భానుమతి గారి గంధర్వగానం రూపంలో మనల్ని పరవశుల్ని చేసింది. అదీ నాదోపాసన అంటే... అదీ శాశ్వతత్వాన్ని పొందడం అంటే.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment