వాగ్గేయకారులైన ముత్తుస్వామి దీక్షితార్ వారి గురువు చిదంబర యోగి. తల్లిదండ్రులను విడిచిపెట్టిపోయి, బ్రహ్మచారిగా కాశీపట్టణంలో చాలాకాలం వారిని సేవించారు. ఒకనాడు గురువుగారు పిలిచి ‘‘నాయనా ముత్తుస్వామి! నువ్వూ నేనూ విడిపోయే కాలం ఆసన్నమయిందిరా..’’ అన్నారు. ‘‘అయ్యో గురువుగారూ.. కాశీ పట్టణ వాసం, విశ్వనాథ అభిషేకం, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణ సేవనం, గురువుగారి శుశ్రూష.. ఇంతకన్నా జీవితంలో నాకేం కావాలి. అటువంటి అమంగళకరమైన మాటలు అనకండి’’ అన్నారు. ‘‘అమంగళకరం కాదు నాయనా, శరీరంతో వచ్చిన వాడు శరీరాన్ని విడిచిపెట్టవలసిందే, బెంగపెట్టుకోకు. ఈ వేళ నేను ముందు స్నానం చేయడం కాదు. నీవు చేయాలి’’ అన్నారు. గురువుగారి ఆజ్ఞమేరకు ముత్తుస్వామి దీక్షితార్ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తుండగా చేతికేదో తగిలింది. పైకెత్తారు. ‘యాళి’ అని పౌరాణిక మృగం ఆకారంలో ఉంది. ఇప్పటికీ కంచి వరదరాజ స్వామి దేవస్థానంలో స్తంభం మీద చెక్కబడి ఉంటుంది. గంగా ప్రసాదంగా దీక్షితార్ వారికి దొరికిన చిన్న వీణకు ఈ యాళి చిన్న గుమ్మడికాయ ఆకారంలో ఇతర వీణల్లో లాగా కింద కాకుండా పైకి ఉంటుంది. దాని మీద ‘శ్రీరామ’ అని రాయబడి ఉంది. తరువాత కాలంలో దానిమీద సంగీతం పాడుకుంటూ పరవశించి పోయేవారు. నాకిది ఉందా లేదా అన్న చింత లేదు. నిత్య తృప్తులు. ఒకసారి తిరుత్తణి కొండమీద కూర్చుని కీర్తన చేస్తుంటే సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనిపించినట్లయి వెంటనే కొన్ని కీర్తనలు చేసారు. అవి తరువాతి కాలంలో ‘తిరుత్తణి కీర్తనలు’గా ఖ్యాతికెక్కాయి..
చిట్టచివరన కూడా ‘పశుపాశ విమోచినీ కామాక్షీ’ అంటూ... ‘‘అమ్మా కామాక్షీ! పశుపాశాలను కోసి వేయగలిగిన దానివి. అద్వైత మోక్షాన్ని, కైవల్యాన్ని ఇవ్వగలిగిన తల్లీ కామాక్షీ, ఈ పాశములను కోసేయమ్మా..’’ అంటూ కీర్తన చేస్తున్నారు. పాశం చేత కట్టబడేది పశువు. మనందరం పశువులమే. మనకు పాశాలు ఏముంటాయనుకోవద్దు. మనం చేసుకున్న గత జన్మ కర్మలే మనకు పాశాలు. అది జన్మస్తంభం. దానికి కట్టబడడం, చేసుకున్న కర్మల ఫలితాలను జనన మరణాలుగా అనుభవిస్తూ... అలా తిరుగుతుంటాం. నువ్విక పశువువి కాదని కర్మపాశాలను తెగకోసి.. పశుపతిలో కలిపేస్తుంది ఆ తల్లి. అందుకని ఆయనలా వేడుకుంటూ కీర్తన చేస్తుంటే... శిష్యులు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అలా పాడుతుండ గా ఒక దివ్యజ్యోతి ఆయన శరీరంలోంచి వచ్చి పూజామందిరంలో ఉన్న కామాక్షిలో లయమయిపోయింది. నాదోపాసన చేత తరించారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత గొప్పగా ఈశ్వరుడిని సేవించుకున్నామన్నది లక్ష్యంగా బతికారు. అంటే నాదోపాసనతో సర్వేశ్వరుని చేరడానికి సంగీతాన్ని ఒక సాధనంగా స్వీకరించారు.
బాహ్యంలో రంజకత్వం, మానసికోల్లాసం ఉన్నా భారతీయ సంగీతం పరమ ప్రయోజనం మాత్రం ఈశ్వరుని చేరుకోవడమే. అందుకే ఉపాసన అన్న మాట సంగీతానికి కూడా అన్వయమయింది.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment