సంగారెడ్డి: చాగంటి కోటేశ్వరరావు మూడు రోజుల పాటు ఇచ్చిన ప్రవచనాలతో సిద్దిపేట గడ్డ పునీతమైందని, ఆధ్యాత్మిక విలువలకు సిద్దిపేట భవిష్యత్తులో నిలయంగా మారనుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో చాగంటి కోటేశ్వరరావు మూడో రోజు చేసిన ప్రవచనాలను మంత్రి హరీశ్‌రావు సుమారు రెండు గంటల పాటు ఆలకించారు.
ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రోజుల పాటు చాగంటి ఇచ్చిన ప్రవచనాల భావం భావి తరాలకు అందించేలా ప్రయత్నిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవలో సిద్దిపేట ఎప్పుడూ ముందు ఉంటుందన్నారు. చాగంటి కోటేశ్వరరావుది మధుర స్వరం అని, తన ప్రవచనాల ద్వారా తలరాత మార్చుకునేలా చేస్తున్న దిశా నిర్దేశకుడని పేర్కొన్నారు.
చాగంటి అంటే స్నేహాన్ని పెంపొందించుకునే వ్యక్తిత్వం అని, తన మాటలతో కోట్లాది ప్రజల మనస్సు గెలిచి ఇంటిపేరు సార్థకత చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రవచనం చెప్పడానికి ఒక్క నయా పైసా తీసుకోని కోటేశ్వరరావు కోట్లాది ప్రజల ప్రేమ పొంది. నిజంగా కోటీశ్వరుడు అయ్యాడని కొనియాడారు. ఒక సామాజిక, ఆధ్యాత్మిక ఉద్యమకారుడుగా చాగంటిని మంత్రి అభివర్ణించారు. సీఎం కేసీఆర్ చాగంటి కి గొప్ప అభిమాని అని, అప్పుడప్పుడు చాగంటి ప్రవచనాలు వింటారని చెప్పారు. మళ్లీ అవకాశం ఉంటే సిద్దిపేటకు రావాలని మంత్రి కోరారు.
ప్రజల ఆనందం ఆయన కళ్ల్లలో చూశా..
నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, సంతోషంగా ఉండాలనే గొప్ప మనస్సు మంత్రి హరీశ్‌రావులో ఉందని, రంగనాయక సాగర్ నీటి రిజర్వాయర్ గురించి కరువు శాశ్వత సెలవు అంటూ వివరిస్తున్న సమయంలో ప్రజల సంతోషం తన కళ్లలో చూసినట్టు చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. అది ఒక సేవ చేయాలనే గుణం ఉన్న వారికి నిదర్శనమని పేర్కొన్నారు.
మూడో రోజు మానవీయ విలువలు అంశంపై ఆయన ప్రవచనాలు చెప్పారు. మాట ఒక వజ్రం లాంటిదని, మనిషి విలువ మాటల్లో ఇట్టే తెలిసి పోతుందన్నారు. ఒక మంచి మాట కష్టాన్ని దూరంచేస్తే, అదే మాట ఇతరులకు కష్టం తెస్తుందని పేర్కొన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా మాట రావాలని సూచించారు.
కొన్ని జీవులకు పలుకులు వస్తాయి కానీ బుద్ధి ఉండదని, అదే మనిషికి పలుకులు, బుద్ధి రెండూ ఉంటాయని చెప్పారు. పది మంది కోసం పడిన కష్టం, చేసిన దానం మనిషి వెంట పుణ్యంగా వస్తుందని, సిద్దిపేట అన్నదాతలకు నిలయంగా ఉందని కొనియాడారు. అందరినీ కలుపుకుని ప్రయాణం చేయడం మనిషి ఉన్నత విలువన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చాగంటి కోటేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment