మెదక్: ఎన్నికల్లో అవినీతికి చెక్ పెట్టడానికి ఎన్నికల సంఘం ఓటర్లకు ఒక బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే సీ–విజిల్ యాప్. ఇది ఎన్నికల్లో జరిగే అక్రమాలను అడ్డుకట్ట వేసే బ్రహ్మాస్త్రంగా చెబుతున్నారు. అభ్యుర్థులు డబ్బు, మద్యం, ఇత ర వస్తువులను ఓటర్లకు ఎరగా చూపి అడ్డదారిలో గెలుపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి అవినీతి నాయకుల అంతు చూసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఇలా పనిచేస్తుంది..
నాయకులు ఓటర్లకు డబ్బు, మద్యం లేదా ఇతర వస్తువు రూపంలో ఇచ్చే క్రమంలో ఫొటోలు, వీడియోలు తీసి ఘటనా స్థలం నుంచి సీ–విజిల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. వెంటనే ఆ దృశ్యాలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి చేరతాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై అక్కడి చేరుకుంటారు.
ఆయా నాయకులపై చర్యలు తీసుకుంటారు. ఈ యాప్ ద్వారా అందే సమాచారం బలమైన సాక్ష్యంగా పనిచేస్తుంది. అవసరమైతే ఆయా అభ్యర్థుల సభ్యత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఫొటోలు, లేదా వీడియోలు పంపిన వెంటనే ఫిర్యాదు దారులు ఏ లోకేషన్ నుంచి వాటిని పంపారనేది అధికారులకు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే చర్యలు తీసుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల సంఘం నియామవళి ప్రకారం ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతారు.
పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం..
ఈ సీ–విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులు, సమాచారం ఎన్నికల అధికారులతో పాటు నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు కూడా అందుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, సర్వైలెన్స్ కమిటీలు, రిజర్వ్ టీములు అప్రమత్తం అవుతాయి. వెంటనే లోకేషన్‌కు వెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అంతేకాదు అవినీతికి పాల్పడిన అభ్యర్థులపై ఏ విధమైన చర్యలు తీసుకున్నారనే సమాచారాన్ని సైతం ఫిర్యాదు చేసిన వారికి 100 నిమిషాల్లో యాప్‌ద్వారా తెలియజేస్తారు.
నిజాయితీ పరులకు నేస్తం..
సభలు, సమావేశాల్లో ఎవరైనా కోడ్‌ను ఉల్లంఘించే విధంగా ప్రసంగించినా, ఏ అక్రమాలకు పాల్పడినా వెంటనే రికార్డు చేసి అన్యా యాన్ని అడ్డుకోడానికి సీ– విజిల్ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఎన్నికల సంఘం 2018లోనే అందుబాటులోకి తెచ్చింది.
తప్పుడు సమాచారం స్వీకరించదు..
ఈ సీ–విజిల్ యాప్‌ను తప్పుదోవ పట్టించే వీలులేదు. ఈ యాప్‌ను ఘటన జరిగిన స్థలం నుంచే వినియోగించాలి. మరో చోటుకు వెళ్లి తీసిన ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయడం సాధ్యం కాదు. అలాగే పాత ఫొటోలతో ఎదుటి వారిపై పిర్యాదు చేసినా తీసుకోదు.
Comments
Please login to add a commentAdd a comment