పితృరుణం నుండి విముక్తి పొందడానికి ధార్మికమైన సంతానాన్ని పొందాలి... అంటే ఎవరు తన పక్కన భార్యగా లేదా భర్తగా కూర్చోవడానికి అధికారాలను పొందవచ్చో పెద్దలు నిర్ణయించిన తరువాత అటువంటి వారిని జీవిత భాగస్వామిగా ఆహ్వానించడం జరుగుతుంది. తద్వారా దంపతులయిన వారు ధార్మికమైన సంతానాన్ని పొందుతారు. ఇది మొదటి ప్రయోజనం.
గహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత భార్యపక్కన ఉన్న కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు చేసి చిత్తశుద్ధి పొందడం, దేవతల రుణాన్ని తీర్చుకోవడం రెండవ ప్రయోజనం. భార్యలేని నాడు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అర్హుడు కాడు. ఉత్తరీయం ఎడమ భుజంమీద ఉండడానికి అర్హత ఉండదు. అలా ఉండాలంటే భార్య ప్రాణాలతో ఉండాలి. భార్య ఉంటే తప్ప తన కడుపున పుట్టిన కూతురికి కూడా కన్యాదానం చేయడానికి పీటలమీద కూర్చునే అధికారం ఉండదు. కాబట్టి తాను గృహస్థాశ్రమంలో ధర్మాన్ని నిర్వర్తించడానికి– ధర్మపత్ని అవసరం. భర్త సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపం. ఆమె తన జీవితంలో అభ్యున్నతిని పొందడానికి, భగవత్ సేవగా భర్తసేవ చేయడానికి, అమ్మా అని పిలిపించుకుని స్త్రీగా పరిపూర్ణత్వాన్ని పొందడానికి వివాహం అవసరం.
అందుకే ఈ మూడూ (పితృ రుణం, రుషిరుణం, దేవరుణం) వివాహానికి ప్రధానమైన ప్రయోజనాలన్నారు. ఈ పద్ధతిలో ఏ పురుషుడికి పక్కన భార్యగా ఎవరు కూర్చోవాలి, ఏ స్త్రీ పక్కన భర్తగా ఎవరు కూర్చోవాలి.. అనేది ఎవరు నిర్ణయించాలి? అది వారి కన్న తల్లిదండ్రులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కారణం– తమ కడుపున పిల్లల సమర్ధత ఏమిటో, మానసికంగా ఉన్న బలాలు, బలహీనతలు ఏమిటో వాళ్ళ పక్కన ఎవరు వచ్చి కూర్చుంటే వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా పండుతుందో ఏ శాస్త్ర పరిశీలనం చేయకుండానే తెలుసుకుని సమన్వయం చేయగల సమర్థత జన్మతః సిద్ధించేది ఒక్క తల్లిదండ్రులకే. అందుకే నిర్ణయించాల్సింది ఎవరు అంటే... తల్లిదండ్రులు మాత్రమే. నేనీ మాట అంటున్నప్పుడు ... దానికి ఎంత మాత్రం రంగు అద్దే ప్రయత్నం చేయకూడదు.
బయట సమాజంలో మనం చూస్తుంటాం. దానికి ఫలానా ఆయన అధికారి–అని అంటూంటారు. ఒకరికి శరీరంమీద కురుపు వచ్చింది, దానిని కోయాలంటే వైద్యుడే తగిన అధికారి. రేషన్ కార్డు ఇవ్వాలంటే ఎం.ఆర్.ఓ నే సరియైన అధికారి. నేరం చేస్తే నేరస్థుడాకాదా అని దర్యాప్తు చేయడానికి రక్షక భటుడే దానికి అధికారి. అలాగే నాకు ఎవరు భార్యగా ఉండాలనేది, నాకు ఎవరు భర్తగా ఉండాలనేది నిర్ణయించేది నా తల్లిదండ్రులు. వాళ్ళే సరైన అధికారులు. ఇది శాస్త్రం కల్పించిన మర్యాద. దేశంలో మనం రూపొందించు కున్న చట్టాలను మనం ఎలా గౌరవించి పాటిస్తున్నామో అలాగే శాస్త్రం ప్రతిపాదించిన విషయాలను కూడా మనం శిరసావహించాల్సి ఉంటుంది. అలా కాని నాడు ఆ సమర్ధత తల్లిదండ్రులకు లేదని ఎత్తి చూపడం అవుతుంది. అందుకే తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రధానమైన అధికారులు. పెద్దలు నిర్ణయించారు కాన... అని శుభలేఖల్లో వేస్తుంటారు.
పెద్దలంటే ఎవరు... శాస్త్రం తెలిసిన వారు. వారిని తల్లిదండ్రులు ఎందుకు సంప్రదిస్తారు... వారు దేన్ని ప్రమాణం చేసుకుని వివాహాన్ని నిర్ణయిస్తారు– అంటే.. శీలం, వయస్సు, వ్యక్తిత్వం, అభిజనం, లక్షణం... ఈ ఐదు విషయాలను పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment