కోడిపెట్ట అల్పప్రాణి. మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికోడికి అంత ఆనందంతో భరించేదయి ఉంటుంది. కోడిగుడ్డు లోపల పిండం ఉంటుంది. దాన్ని గట్టిగా నొక్కితే పెంకు పగిలిపోయి లోపల ఉన్న పిండం స్రవించి కిందకు జారిపోతుంది. అదే తల్లికోడి కదిలివచ్చి... చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు పెంకు పగిలిపోకుండా దాని కడుపును ఆన్చి దాని శరీరంలోని వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి, పొదగబడుతున్న పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోందనే ఆనందాన్ని పొందిన ఆ కోడి ఆ క్షణాల్లో ఎంతగా తన్మయత్వం చెందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమ హంస ఏమంటారంటే – గుడ్డును పొదుగుతున్న కోడిపెట్ట బొమ్మ గీయగలరేమో గానీ గుడ్డులో పిండం పిల్లగా తయారవుతున్నప్పుడు పొదుగుతున్న తల్లి కోడిపెట్ట కళ్ళల్లోని ఆనందాన్ని ఆవిష్కరించగలిగిన చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టలేదు–అని. పిల్లలు పుట్టిన తరువాత రెక్కల కింద పెట్టుకుని కాపాడుతుంది.
ఎక్కడెక్కడ తిరుగుతూ ఆహార సేకరణలో నిమగ్నమై ఉన్నా మధ్యమధ్యలో తలఎత్తి ఆకాశం వంక గద్దలేమైనా వస్తున్నాయేమోనని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. నిజంగా గద్ద వస్తే కోడి ఎదుర్కోగలదా! ఎదుర్కోలేదు. కానీ గద్ద కిందకు దిగుతున్నదనిపించిన వెంటనే రెక్కలు విప్పి ఎంతో బాధతో పిల్లల్ని చేరదీసి రెక్కల కింద కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం–ఒకవేళ గద్ద తన వాడిముక్కుతో పొడిచినా, గోళ్ళతో చెణికినా అది తనకే తగలాలి, తాను చనిపోవాలి... తాను చనిపోయిన తరువాత పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను బతికి ఉండగా మాత్రం తన పిల్లల్లో ఒక్క దానికి కూడా హాని కలగకూడదు. అంటే తాను ప్రాణత్యాగానికి సిద్దపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం తన ప్రాణం కాపాడుకోదు. లోకంలో ఎవరయినా తల్లుల త్యాగానికి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కలకింద పెట్టి పెంచినట్టు ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది–అంటారు.
అశుద్ధాన్ని, అమలినమైన పదార్థాలను తినే పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకు వరుసలో ఉన్న సిరములనన్నిటినీ ఇచ్చి వాటి కడుపునిండుతుంటే తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది. పుట్టలమీద మొలచిన గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీళ్లు తాగుతుంది. ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసుకుంటుంది. అంటే కడుపులోకి పంపిన ఆహారాన్ని మళ్ళీ వెనక్కి నోట్లోకి తెచ్చుకుని తీరికగా నమిలి మింగుతుంది. ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతిపెట్టి నాలుగుమార్లు కుదిపితే తాను కష్టపడి నిల్వ చేసుకున్న పాలను విడిచి పెట్టేస్తుంది. ఆహారాన్ని వెనక్కి తెచ్చుకున్నట్లుగా... ఒకసారి దూడకు వదిలిన పాలను అది వెనుకకు తీయదు, తీయలేదు. సమస్త ప్రాణుల్లో ... ముఖ్యంగా స్త్రీలలో ఉన్న ఈ మాతృత్వం ఒక అద్భుతం. అందుకే వేదం ఆమెకు అంత ప్రాధాన్యతనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment