నేరాల సంఖ్య తగ్గాలంటే..? | Special Storys On Chaganti koteswar Rao Pravachanlu | Sakshi
Sakshi News home page

నేరాల సంఖ్య తగ్గాలంటే..?

Published Sun, Dec 15 2019 12:02 AM | Last Updated on Sun, Dec 15 2019 12:02 AM

Special Storys On Chaganti koteswar Rao Pravachanlu - Sakshi

లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి ఏ కాంచీపురమో, శృంగేరీయో వెళ్ళక్కరలేదు, అప్పుడే పుట్టిన తన పిల్లలకు పాలు ఇస్తున్న కుక్కలో కనబడుతుంది. తన్నుకు పోవడానికి వచ్చిన గద్దనుంచి రక్షించడానికి పిల్లలను రెక్కల కింద దాచిని కోడిపెట్ట కళ్ళల్లో ఆ మాతృత్వం, లలితా పరా భట్టారికా తత్త్వం కనబడుతుంది. ఆ మాతృత్వానికున్న విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్న నాడు ప్రతి స్త్రీలో నిబిడీకృతమై ఉన్న మాతృత్వాన్ని చూడవచ్చు. ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావనచేత మరలువాడు..‘‘ అంటారు పోతన గురించి. ఇంత పరమ పవిత్రమైన అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి–అని ఆమె పాదాలను చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైన భావనలు మనసులో పొంగే అవకాశమే ఉండదు.

మాతృత్వం చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. ఈ జాతిలో అన్యభావనలు, అనవసర విషయాలు ఎప్పుడు ప్రబలుతాయి? మన సంస్కృతిని ఉపదేశం చేయనప్పుడు, కావ్యాలు, పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పబడిన స్త్రీ వైశిష్ట్యాన్ని ప్రబోధం చేయడం ఆగిపోయినప్పుడు... నేర మనస్తత్వం పెరుగుతుంది. మన శాస్త్రాల్లోని మంచి మాటలు, స్త్రీలను గౌరవిస్తూ వేదాలు చెప్పిన విషయాలు మనం మన పిల్లలకు చెప్పగలిగినప్పుడు, చెప్పినప్పుడు అసలు నేరాల సంఖ్య ఇలా అయితే ఉండదు. ఆమె చదువుకుందా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమయితే తన ప్రాణాన్ని ఇస్తుంది. అది పురుషుడివల్ల వశం కాదు. ఒకసారి తన ముగ్గురు బిడ్డలు, భరత్తో కలిసి ఒక సాధారణ ప్యాసింజరు రైలనుకుని వేరొక రైలెక్కిన నిరక్షాస్యురాలయిన ఒక పేద స్త్రీ.

విషయం తెలుసుకుని దిగిన తరువాత చూసుకుంటే ఒక బిడ్డ లోపలే ఉండిపోయాడని తెలిసి.. ప్రాణాలకు తెగించి అప్పుడే బయల్దేరిన రైలువెంట పరుగులు తీస్తున్నది. ఛస్తావని అందరూ చివరకు భర్తకూడా హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ప్లాట్‌ఫారమ్‌ మీద పరుగులు తీస్తుంటే చూసిన రైల్వే అధికారి ఒకరు రైలును ఆపించి బిడ్డను తల్లికి చేర్చారు. బిడ్డను తీసుకొచ్చేలోగా ఆమె స్పృహ తప్పింది. తరువాత బిడ్డను తడిమి చూసుకుని ఆమె పడ్డ ఆనందం మాటల్లో చెప్పనలవికాదు. అది కేవలం తల్లికే సాధ్యమయిన విశిష్ట లక్షణం. ఒక ప్రత్యేకమైన యాగం చేస్తే పితృరుణం తీరుతుంది. కానీ మాతృరుణం అలా తీరేది కాదని వేదం చెప్పింది.

అందుకే దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసం తీసుకుని పీఠాధిపత్యం పొందిన తరువాత ఆయనను చూడడానికి పూర్వాశ్రమంలోని తండ్రి వెడితే... మిగిలిన అందరిలాగే దర్శించుకుని నమస్కారం చేసి రావాల్సి ఉంటుంది. అంతే తప్ప మరో ఏర్పాటేదీ ఉండదు. అదే తల్లి కనబడిందనుకోండి. అప్పటిదాకా కూర్చుని ఉన్న పీఠాధిపతి లేచి నిలబడాలి. తల్లి అన్న మాటకు సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవం ఇచ్చింది శాస్త్రం. పరమాత్ముడంతటివాడు కూడా అంత విలువనిస్తాడు. స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారానికి కూడా మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఇంత గౌరవం, ఇంత ప్రాధాన్యత ఆమెపట్ల మాత్రమే ప్రకాశిస్తాయి. అది పురుషుని శరీరం విషయంలో అలా ప్రకాశించదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement