ఆదాయపన్ను.. ఆదా ఎలా! | Explanation of Income Tax Slabs Rate 2024-25 | Sakshi
Sakshi News home page

ఆదాయపన్ను.. ఆదా ఎలా!

Published Mon, Jul 29 2024 6:13 AM | Last Updated on Mon, Jul 29 2024 8:07 AM

Explanation of Income Tax Slabs Rate 2024-25

మినహాయింపులు వినియోగించుకుంటే పాత విధానమే మెరుగు 

రూ.10.5 లక్షల వరకు పన్ను కట్టక్కర్లేదు 

క్లెయిమ్‌ చేసుకోని వారికి కొత్త విధానం అనుకూలం 

అయోమయం, గందరగోళం ఉండదు 

ఆదాయం, పెట్టుబడుల ఆధారంగానే నిర్ణయం 

రిటర్నుల సమయంలో ఏ విధానమో ఎంపిక తప్పనిసరి

ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్‌లో కొన్ని సవరణలు  ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్‌ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ సమయంలో ప్రకటించారు.

 కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్‌ ప్లస్‌ కథనం ఇది.     
 

కొత్త విధానంలో తాజా మార్పులు 
నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు.   

→ నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు.   
→ స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్‌ 87ఏ కింద రిబేట్‌ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ అదనం. ఫ్యామిలీ పెన్షన్‌ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్‌ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.  

మినహాయింపులు 
→ నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్‌ 80సీసీడీ(2) కింద ఎన్‌పీఎస్‌ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్‌ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్‌పీఎస్‌ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10  శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్‌పీఎస్‌ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు.   

→ సెక్షన్‌ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

→ కన్వేయన్స్‌ అలవెన్స్, సెక్షన్‌ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్‌ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు.  

→ ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్‌ 10(10 ) పన్ను లేదు.  

పాత పన్ను విధానం 


→ రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్‌ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. 
→ 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు.   

మినహాయింపులు 
→గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్‌ 80సీ కింద పన్ను లేదు.  
→సెక్షన్‌ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు.   
→సెక్షన్‌ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్‌ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. 
→ సెక్షన్‌ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్, ఎన్‌పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్‌ ఎఫ్‌డీ, ఈఎల్‌ఎస్‌ఎస్, యులిప్‌ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్‌ ట్యూషన్‌ ఫీజులను చూపించుకోవచ్చు.  
→ పెన్షన్‌ ప్లాన్‌లో (ఎన్‌పీఎస్‌)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్‌ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్‌ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్‌ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్‌పీఎస్‌ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. 
→ సెక్షన్‌ 80డీ కింద హెల్త్‌ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్‌ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు.   
→ సెక్షన్‌ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది.  
→ బ్యాంక్‌ సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్‌ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్‌ సేవింగ్స్‌ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది.  
→ సెక్షన్‌ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది.  
→ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్‌ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్‌ఆర్‌ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్‌ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్‌ఆర్‌ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్‌ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్‌ రూ.84,000ను హెచ్‌ఆర్‌ఏ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు.  
→ ఇంకా సెక్షన్‌ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  

నిపుణులు ఏమంటున్నారు? 
ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్‌ఆర్‌ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి.  మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్‌ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. 

 సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్‌ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంతోపాటు, హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్‌ డాట్‌ మార్కెట్‌ బిజినెస్‌ హెడ్‌ వైభవ్‌ జైన్‌ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ లోహిత్‌భాటియా తెలిపారు.  

ఎంపికలో స్వేచ్ఛ..
ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్‌ ఆప్టింగ్‌ అండర్‌ సెక్షన్‌ 115బీఏసీ’’ అని సెలక్ట్‌ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. 

వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్‌ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్‌ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే  66 శాతం మేర నూతన పన్ను  విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది.   

ఏది ప్రయోజనం..? 
→ కేవలం స్టాండర్డ్‌ డిడక్షన్‌ వరకే క్లెయిమ్‌ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్‌ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. 
→ రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50వేలతోపాటు, సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్‌ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. 
→ రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్‌ డిడక్షన్‌ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్‌ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం.  
→ అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలుపుకుని) క్లెయిమ్‌ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం.  
→ రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలుపుకుని) క్లెయిమ్‌ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. 
→ రూ.50వేల స్టాండర్డ్‌ డిడక్షన్, సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం రూ.25వేలు, ఎన్‌పీఎస్‌ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్‌ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు.  


నోట్‌: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి.  

 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement