గత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు (ఐటీఆర్) చేసే సమయం దగ్గర పడింది. జులై 31లోపు ఐటీఆర్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి వరకు వేచిచూడకుండా ఆలోపే పూర్తి వివరాలతో రిటర్నులు దాఖలు చేయడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలనే సందేహంతో ఉన్నారు. కొన్ని అంశాలు పాటించడం ద్వారా ఏ పద్ధతి ఎవరికి అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఆదాయపు పన్ను విభాగం పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేస్తోంది. ముందుగానే నింపిన ఐటీఆర్ ఫారం అందుబాటులోకి తీసుకువచ్చింది. 2020 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త పన్ను విధానం పన్ను చెల్లింపుదారులకు మరింత వెసులుబాటును కల్పించింది. అయినప్పటికీ మొదటిసారి ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికీ, పాతవారికీ కొంత ఆందోళన ఉండటం సహజమే. అయితే దీన్ని అధిగమించాలంటే కొన్ని అంశాలపై అవగాహన అవసరం.
ఆదాయం
ఆర్థిక సంవత్సరం 2023-24లో రిటర్న్‌లు దాఖలు చేసేవారి మొత్తం ఆదాయం ఎంతనే విషయంలో స్పష్టత ఉండాలి. వేతనం ద్వారా ఆర్జిస్తున్న ఆదాయం, ప్రయోజనాలు, వడ్డీ, డివిడెండ్లు ఇతర ఆదాయాలన్నింటినీ లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు మొత్తం ఆదాయం తెలుస్తుంది. ఇందులో నుంచి ఆదాయపు పన్ను చట్టం కల్పించిన మినహాయింపులను తీసివేస్తే పన్ను వర్తించే ఆదాయంపై స్పష్టత వస్తుంది.
కొత్తదా..? పాతదా..?
రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. పన్ను చెల్లింపుదారులు పాత, కొత్త పన్ను విధానంలో తమకు అనువైన దానిని ఎంచుకోవచ్చు. ఈ విధానాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి.
పాత పన్ను విధానంలో చట్టం కల్పించిన కొన్ని మినహాయింపులను క్లెయిం చేసుకోవడం ద్వారా పన్ను ఆదా చేయొచ్చు. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80ఈ, గృహరుణ వడ్డీ, ఇంటి అద్దె భత్యం లాంటివి ఇందులో క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇవి గణనీయంగా ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు.
కొత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి మినహాయింపులూ ఉండవు. రూ.7.50లక్షల లోపు ఆదాయం (ప్రామాణిక తగ్గింపు రూ.50వేలతో కలిసి) ఉన్న వారు ఈ పన్ను విధానాన్ని ఎంచుకున్నప్పుడు ఎలాంటి పన్ను వర్తించదు. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ పన్ను విధానం ఉత్తమమో తెలుసుకునేందుకు ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌లో ఉన్న కాలిక్యులేటర్‌ను ఉపయోగించుకోవచ్చు.
సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలివే..
పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు కొన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. బ్యాంకు ఖాతాల వివరాలు, ఫారం-16, ఫారం 26ఏఎస్, వడ్డీ ఆదాయం, డివిడెండ్లకు సంబంధించిన వివరాలు, ఇంటి రుణం వడ్డీ, ఇతర పెట్టుబడుల ఆధారాలు దగ్గర ఉండాలి. ఫారం-16, రిటర్నులను దాఖలు చేసిన రశీదుతో పాటు పెట్టుబడులు, ఇతర పత్రాలన్నింటినీ కలిపి జాగ్రత్త చేసుకోవాలి. దీనివల్ల అవసరమైనప్పుడు వీటిని వెంటనే తీసుకునేందుకు వీలవుతుంది.
ఫారం-16: మీ జీతభత్యాలు, మూలం వద్ద పన్ను తగ్గింపు (టీడీఎస్)కు సంబంధించిన వివరాలతో యాజమాన్యం అందించే పత్రం ఇది. దీని ఆధారంగానే ఉద్యోగులు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
ఫారం 26ఏఎస్: ఒక ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన అన్ని ఆదాయాలు, టీడీఎస్, మూలం వద్ద పన్ను చెల్లింపు (టీసీఎస్) వివరాలు ఇందులో తెలుస్తాయి. మీ ఫారం-16, ఫారం-26ఏఎస్‌లను పోల్చి చూసుకోవాలి.
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్): వేతనం, ఇతర మార్గాల్లో ఆర్జించిన ఆదాయాలతోపాటు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్, సెక్యూరిటీల లావాదేవీలు, విదేశీ చెల్లింపులు మొదలైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఏఐఎస్ ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఆదాయాల ఆధారంగానే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని ఫారం ముందుగానే కొంత మేర నింపి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment