ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సమయం దగ్గర పడుతోంది. జులై 31 చివరి తేదీగా నిర్ణయించారు. రిటర్ను దరఖాస్తులు దాఖలు చేసేపుడు చాలామంది పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఆలోచిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దానికి అనువుగా వచ్చే ఆదాయాన్ని సర్దుబాటు చేస్తే కొంతమేర పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం పన్ను చెల్లింపుల్లో ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఇండెక్సేషన్
పన్నుదారుల్లో చాలామంది స్టాక్‌లు, బాండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ఏటా ద్రవ్యోల్బణం నమోదవుతోంది. దానికి అనువుగా ఆదాయాన్ని సర్దుబాటు చేసే పద్ధతినే ఇండెక్సేషన్ అంటారు. పన్ను రిటర్నులు దాఖలు చేసేపుడు చాలావరకు గతంలో చేసిన పెట్టుబడులను ప్రస్తుత విలువగానే పరిగణిస్తున్నారు. కానీ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా వాస్తవ పెట్టుబడి విలువ తరిగిపోతుంది. దాన్ని తాజా ధరలకు అనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే రిటైల్ ద్రవ్యోల్బణ (సీపీఐ) గణాంకాల ఆధారంగా ఇండెక్సేషన్‌ను అంచనా వేస్తారు. మూలధన లాభాలను కచ్చితంగా నిర్ణయించడంలో ఇది సహాయపడుతుంది.
ఏదైనా ఒక వస్తువును రూ.10కు కొనుగోలు చేశారనుకుందాం. ద్రవ్యోల్బణం కారణంగా ఏడాదిలో దాని ధర రూ.12కు చేరినట్లు భావించండి. ఆ వస్తువుపై రూ.1 లాభం రావాలంటే మీరు దాన్ని ప్రస్తుత విలువ ప్రకారం రూ.13కు అమ్ముతారు. కానీ మీరు కొన్నది రూ.10కే. ద్రవ్యోల్బణం కారణంగా దాని విలువ మీరు అమ్మే సమయానికి రూ.2 పెరిగింది. కాబట్టి మీకు వచ్చిన లాభంలో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయాలి. దానికోసం ఇండెక్సేషన్ ఎంతో ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment