ఏప్రిల్‌ 1 విడుదల | New income tax rates into the implementation | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌ 1 విడుదల

Published Sun, Apr 2 2017 12:29 AM | Last Updated on Thu, Sep 27 2018 3:54 PM

ఏప్రిల్‌ 1 విడుదల - Sakshi

ఏప్రిల్‌ 1 విడుదల

అమలులోకి వచ్చిన కొత్త ఆదాయ పన్ను రేట్లు

- లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాల్లో మార్పులు
- ఉద్యోగులకు స్వల్పంగా తగ్గనున్న ఆదాయపన్ను భారం
- పెరగనున్న కార్లు, మోటార్‌ సైకిళ్లు, ఆరోగ్య బీమా ప్రీమియంలు
- జూలై 1 నుండి పాన్‌ దరఖాస్తు.. ఐటీ రిటర్నులకు ఆధార్‌ తప్పనిసరి
- లక్షలాది మంది ఖాతాదారులపై జరిమానాలకు సిద్ధమైన ఎస్‌బీఐ


ఏప్రిల్‌ ఒకటి.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక వ్యవహారాలను ఎంతోకొంత మార్చే తేదీ. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంతో వ్యక్తిగత ఆదాయ పన్నుల స్లాబులు మారడం దీనికి ప్రధాన కారణం. 2017–18 ఆర్థిక సంవత్సరానికి కూడా ఐటీ స్లాబుల్లో మార్పులను కేంద్రం ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించింది. మార్చి నెలాఖరు కల్లా లోక్‌సభ బడ్జెట్‌ కసరత్తును పూర్తిచేసి ఆర్థిక బిల్లును, దానికి ప్రతిపాదించిన సవరణలను ఆమోదించింది. ఏప్రిల్‌ ఒకటో తారీఖు నుండి అమలులోకి వచ్చిన ఆదాయ పన్ను రేట్లు, దానికి సంబంధించిన ఇతర అంశాల్లో ముఖ్యమైనవి ఇవీ..     
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

2017–18 ఆదాయ పన్ను మార్పులివీ..
► ఉద్యోగుల చేతుల్లో ఎక్కువ నగదు ఉండేలా చూడటం కోసం.. రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షల వరకూ వార్షిక ఆదాయం గల ఉద్యోగులపై ఆదాయ పన్ను రేటును కేంద్రం సగానికి తగ్గించింది. పది శాతం పన్ను రేటును ఐదు శాతానికి కుదించింది. దీనివల్ల వారికి ఏటా రూ.12,500 వరకూ ఆదా అవుతుంది.
► అలాగే.. రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ వార్షికాదాయం ఉన్న వారికి ఏటా రూ.12,900 పన్ను ఆదా అవుతుంది. ఇక వార్షిక ఆదాయం రూ.1 కోటి కన్నా ఎక్కువ ఉన్న వారికి సైతం.. సర్‌చార్జీ, సెస్సులు సహా రూ.14,806 మేర పన్ను తగ్గుతుంది.
► రూ.5 లక్షల వరకూ ఆదాయం(వాణిజ్య ఆదాయం మినహాయించి) గల పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయడానికి సరళమైన ఒక పేజీ ఫామ్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ కేటగిరీలో మొదటిసారిగా ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేసే వారిని ఐటీ విభాగం తనిఖీ చేయబోదు.
► ఈ ఆర్థిక సంవత్సరానికి (2017–18) ట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేయడంలో జాప్యం జరిగి.. 2018 డిసెంబర్‌ 31వ తేదీ లోపు దాఖలు చేస్తే రూ.5,000 జరిమానా విధిస్తారు. ఆ తేదీ కూడా దాటితే జరిమానా ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే.. రూ.5 లక్షల వరకూ ఆదాయం గల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఈ జరిమానాను రూ.1,000కి పరిమితం చేశారు.

► రాజీవ్‌ గాంధీ ఈక్విటీ స్కీమ్‌లో పెట్టుబడులకుగానూ 2018–19 అసెస్మెంట్‌ సంవత్సరం నుండి పన్ను మినహాయింపు లభించదు. సెక్యూరిటీల మార్కెట్లో తొలిసారి పెట్టుబడిదారులను ప్రోత్సహించడం కోసం గత యూపీఏ ప్రభుత్వం 2012–13 బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
► స్థిరాస్తికి గల దీర్ఘకాల హోల్డింగ్‌ కాలపరిమితిని మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గించారు. కనుక, కొత్తగా రాబోయే చట్టం వల్ల.. రెండేళ్లకు పైగా హోల్డింగ్‌లో ఉన్న స్థిరాస్తిపై పన్ను 20 శాతానికి తగ్గుతుంది. పునఃపెట్టుబడులకు వివిధ మినహాయింపులకు అర్హత కూడా ఉంటుంది.
► దీర్ఘకాలిక పెట్టుబడి రాబడులపై పన్ను ప్రయోజనం ఆశించడం నెరవేరకపోవచ్చు. ఎందుకంటే.. ప్రయోజనాలు జతకావడం వల్ల అమ్మకాలపై లాభాలు తగ్గుతాయి. ప్రభుత్వం వ్యయ సూచీ మూల సంవత్సరాన్ని 1981 ఏప్రిల్‌ 1 నుండి 2001 ఏప్రిల్‌ 1వ తేదీకి మార్చింది.
► వ్యక్తులకు పెట్టుబడి రాబడులను.. ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌ఈసీ బాండ్లకు అదనంగా నోటిఫై చేసిన రిడీమబుల్‌ బాండ్లలో మళ్లీ పెట్టుబడి పెట్టడంపై పన్ను మినహాయింపు లభిస్తుంది.
► నెలకు రూ.50,000 మించిన అద్దె చెల్లింపులకు.. వ్యక్తులు ఐదు శాతం టీడీఎస్‌(ట్యాక్స్‌ డిడక్షన్‌ ఎట్‌ సోర్స్‌) మినహాయించాల్సి ఉంటుంది. దీని వల్ల అద్దె ఆదాయం ఎక్కువగా ఉన్న వారిని ప్రభుత్వం పన్ను పరిధిలోకి తీసుకురాగలుగుతుంది. ఇది 2017 జూన్‌ 1 నుండి అమలులోకి వస్తుంది.

జూలై 1 నుండి పాన్‌(శాశ్వత ఖాతా నంబరు)కు దరఖాస్తు చేసేటపుడు, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేటపుడు ఆధార్‌ తప్పనిసరి చేసింది. నిజానికి.. వ్యవస్థలో నల్లధనాన్ని తొలగించేందుకు నగదు లావాదేవీలను రూ.మూడు లక్షలకు పరిమితం చేయాలని తొలుత ప్రతిపాదించిన ప్రభుత్వం.. ఆ పరిమితిని రూ. రెండు లక్షలకు తగ్గించింది.

► వ్యక్తులు జాతీయ పింఛను వ్యవస్థ(ఎన్పీఎస్‌) నుండి పాక్షిక ఉపసంహరణలు జరిపినట్లయితే ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రతిపాదిత మార్పుల వల్ల.. ఎన్పీఎస్‌ ఖాతాదారులు పదవీ విరమణ కన్నా ముందుగా తమ ఖాతా నుండి 25 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ చేసినపుడు 40 శాతం విత్‌డ్రా చేసుకుంటే దానిపైనా పన్ను ఉండదు.

► ఆదాయ పన్ను రేట్లలో ఈ మార్పులకు తోడు.. ఈ ఆర్థిక సంవత్సరం నుండి కార్లు, మోటార్‌సైకిళ్లు, ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరగనున్నాయి. ఏజెంట్ల కమిషన్‌ను బీమా సంస్థలు సవరించడానికి బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతివ్వడం దీనికి కారణం. సవరించిన తర్వాత ప్రీమియంలో మార్పు ప్రస్తుత రేట్లకు ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువకు పరిమితం చేస్తారు. అలాగే ఈ నెల మొదటి తేదీ నుండి వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా రేట్లు కూడా పెరగనున్నాయి.

► భారతదేశపు అతి పెద్ద వాణిజ్య బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన లక్షలాది మంది వినియోగదారులకు ఏప్రిల్‌ 1 నుండి పలు జరిమానాలు వర్తించనున్నాయి. వారి ఖాతాల్లో ప్రతి నెలా కనీసం రూ.5,000 నిల్వ నిర్వహించకపోతే జరిమానా పడుతుంది. మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో.. కనీస నిల్వ మొత్తమైన రూ.5,000లో 75 శాతంకన్నా తగ్గితే.. రూ.100, దానిపై సేవా పన్నుతో కలిపి చార్జీ వసూలు చేస్తారు. కనీస నిల్వ 50 శాతం కన్నా తగ్గితే రూ.50, దానిపై సేవా పన్ను కలిపి జరిమానా విధిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement