న్యూఢిల్లీ: చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీల ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరును పునరుద్ధరించే– అకౌంటెన్సీ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ మార్పులు ఆయా సంస్థల స్వయంప్రతిపత్తిపై ప్రభావం చూపబోవని ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు.
పైగా ఇది ఆడిట్ నాణ్యతా ప్రమాణాలను పెంచుతుందని, దేశ పెట్టుబడి వాతావరణం మెరుగుపరుస్తుందని తెలిపారు. సభ ఆమోదం పొందిన చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్ (సవరణ) బిల్లు... సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌ల (ఐసీఏఐ– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఏఐ–ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఐసీఎస్‌ఐ– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) క్రమశిక్షణా కమిటీలకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నాన్–చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ), నాన్–కాస్ట్ అకౌంటెంట్, నాన్–కంపెనీ సెక్రటరీని నియమించాలని నిర్దేశిస్తోంది.
జవాబుదారీ తనాన్ని పెంచుతాయి...
ఈ సవరణలు ఇన్‌స్టిట్యూట్‌లను మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీగా మార్చుతాయని ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించేలా ఇన్‌స్టిట్యూట్‌లను ప్రోత్సహిస్తాయని అన్నారు. ఆడిట్ స్టేట్‌మెంట్‌లపై వీటికి సంబంధించిన వారికందరికీ అత్యధిక భరోసా కల్పించడం బిల్లు ధ్యేయమని తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ యాక్ట్, 1949, కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ యాక్ట్, 1959, కంపెనీ సెక్రటరీస్ యాక్ట్, 1980లను సవరించడానికి సంబంధించిన ఈ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు చేసిన సవరణలను సభ తొలుత తిరస్కరించింది.
సమన్వయ కమిటీ ఏర్పాటు...
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నేతృత్వంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడానికి బిల్లు వీలు కల్పిస్తుంది. సమన్వయ కమిటీలో మూడు ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రాతినిధ్యం ఉంటుంది. గతంలో మూడు సంస్థలు సమన్వయ కమిటీ ఏర్పాటుకు ఒక అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేశాయని, అయితే ఆ ప్రతిపాదన ముందుకు సాగలేదని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ల వనరుల నిర్వహణలో ఈ కమిటీ సాయపడుతుందని ఆర్థిక మంత్రి పేర్కొంటూ, ఐఐఎంలు, ఐఐటీలకు కూడా సమన్వయ కమిటీలు ఉన్నాయని పేర్కొన్నారు. అవకతవకలకు పాల్పడిన భాగస్వాములు, సంస్థలకు విధించే జరిమానాల పరిమాణాన్ని పెంచాలని కూడా బిల్లు సూచిస్తోందని పేర్కొన్నారు.
కాగా, ‘మీరు ఐఐటీలు, ఐఐఎంల ఉదాహరణలను ఇచ్చారు. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌లకు ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అకౌంటెన్సీ ఇన్‌స్టిట్యూట్‌లకు ఈ పరిస్థితి లేదు. అందువల్ల రెండింటికీ పోలిక సరికాదు. సమన్వయ కమిటీ వల్ల అకౌంటెన్సీ ఇన్‌స్టిట్యూట్‌ల స్వయంప్రతిపత్తి దెబ్బతింటుంది’ అని ఎన్‌సీపీ నాయకురాలు సుప్రియా సూలే విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment