న్యూఢిల్లీ: తక్షణ విడాకులిచ్చే ఇస్లాం సంప్రదాయం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే తాజా బిల్లుకు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు–2018 పేరిట తెచ్చిన ఈ బిల్లుకు 245 మంది సభ్యులు అనుకూలంగా, 11 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఈ బిల్లును మరింత లోతుగా పరిశీలించేందుకు జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల వినతిని కేంద్రం తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశాయి.
తాజా బిల్లుతో ఇంతకు ముందే లోక్‌సభలో ఆమోదం పొంది, రాజ్యసభలో అపరిష్కృతంగా ఉన్న పాత బిల్లు రద్దయింది. దీంతో ఏడాది వ్యవధిలో ఒకే బిల్లు రెండుసార్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లయింది. ఇక తాజా బిల్లు తదుపరి దశలో రాజ్యసభ ఆమోదానికి వెళ్తుంది. అక్కడ కూడా గట్టెక్కి రాష్ట్రపతి ఆమోదముద్ర లభిస్తే చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ప్రకారం.. తక్షణ విడాకులు కోరుతూ ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరం, చట్ట విరుద్ధం. ఆ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రిపుల్ తలాక్ బిల్లును రూపొందించారన్న విపక్షాల వాదనల్ని ప్రభుత్వం కొట్టిపారేసింది.
బిల్లు రాజ్యాంగ విరుద్ధం: విపక్షాలు
ప్రస్తుతం అమలవుతున్న ఆర్డినెన్స్ స్థానంలో ఈ నెల 17నే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, గురువారం సభ పరిశీలనకు వచ్చింది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. బిల్లులోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని, మరింత అధ్యయనం నిమిత్తం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఇలాంటి బిల్లుపై లోక్‌సభ ఇది వరకే చర్చించి ఆమోదం తెలిపిందని, కాబట్టి ఇంకా అభ్యంతరాలేమైనా ఉంటే వాటిని చర్చించాలి కానీ హఠాత్తుగా బిల్లును మరో కమిటీకి పంపాలని కోరొద్దని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు. తాజా బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని, పలు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ముస్లిం మహిళల సాధికారత కాదని, ముస్లిం పురుషుల్ని శిక్షించడమేనని మరో కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్ ఎద్దేవా చేశారు.
రాజకీయంతో చూడొద్దు: రవిశంకర్
తలాక్ బిల్లుపై రాజకీయాలు చేయొద్దని, ఇది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెచ్చింది కాదని న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు ఈ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆక్షేపించారు. ‘రాజకీయ కొలమానంలో ఈ బిల్లును చూడొద్దు. ఇది మానవత్వం, సమన్యాయానికి సంబంధించింది’ అని పేర్కొన్నారు. మరింత అధ్యయనం కోసం బిల్లును జాయింట్ సెలక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్‌పై స్పందిస్తూ..సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాల్ని ప్రభుత్వం ఇది వరకే పరిశీలించి అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేసిందని వెల్లడించారు.2017 జనవరి నుంచి 477 ట్రిపుల్ తలాక్ కేసులు నమోదయ్యాయని, ఓ ప్రొఫెసర్ వాట్సప్‌లో తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పారని గుర్తుచేశారు. ప్రధాని మోదీ ర్యాలీకి హాజరైన భార్యకు వ్యక్తి ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చిన దృష్టాంతాలూ ఉన్నాయని గుర్తుచేశారు. ప్రసాద్ వివరణ ముగిసిన వెంటనే కాంగ్రెస్, తృణమూల్, ఏఐఏడీఎంకే, ఆర్జేడీలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
ఇది తలాక్ 2.0 బిల్లు
తొలి తలాక్ బిల్లు గతేడాది డిసెంబర్ 28న లోక్‌సభలో ఆమోదం పొందినా, ప్రతిపక్షాల వ్యతిరేకతతో రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. విపక్షాలు పలు అభ్యంతరాలు లేవనెత్తడంతో కొన్ని సవరణలు చేస్తూ సెప్టెంబర్ 17న ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ సవరణలు చేరుస్తూ తాజాగా తెచ్చిన బిల్లు ప్రకారం..నిందితులకు బెయిల్ ఇచ్చే వెసులుబాటును కల్పించారు. తలాక్‌ను కాంపౌం డబుల్ నేరంగా ప్రకటించారు. అంటే.. భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరితే కేసును వెనక్కి తీసుకోవచ్చు. బాధితురాలు, ఆమె దగ్గరి సంబంధీకులు ఫిర్యాదుచేస్తేనే కేసు నమోదు చేస్తారు.
ఎప్పుడేం జరిగింది?
► 2016, ఫిబ్రవరి 5: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహు భార్యత్వంల రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్ల విచారణలో అప్పటి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సహకారం కోరిన సుప్రీంకోర్టు. విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారా? అని సందేహించిన కోర్టు
► 2016, జూన్ 29: రాజ్యాంగమే గీటురాయిగా ట్రిపుల్ తలాక్ ఆచారాన్ని పరిశీలిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం
► 2016, అక్టోబర్ 7: ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకిస్తున్నట్లు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు
► 2017, ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వంలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ బెంచ్ ఏర్పాటు
► 2017, ఏప్రిల్ 16: ట్రిపుల్ తలాక్ అంశాన్ని తొలిసారి లేవనెత్తిన ప్రధాని మోదీ..ముస్లిం మహిళలకు న్యాయం చేస్తామని హామీ
► 2017, ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధం, చెల్లుబాటు కాదని 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు
► 2017, డిసెంబర్ 28: ట్రిపుల్ తలాక్ నేరానికి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ
► 2018, ఆగస్టు 10: రాజ్యసభలో తలాక్ బిల్లు. ప్రవేశపెట్టిన కేంద్రం. విపక్షాల వ్యతిరేకతతో లభించని ఆమోదం.
► 2018, సెప్టెంబర్ 19: విపక్షాల సూచనల్ని పరిగణనలోకి తీసుకుని ఆర్డినెన్స్ జారీ
► 2018, డిసెంబర్ 27: సవరించిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
కీ పాయింట్స్
► మూడు సార్లు వరుసగా తలాక్ చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హ నేరమని సంబంధిత బిల్లులో ప్రతిపాదించారు. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నించిన నేరానికిగానూ భర్తకు మూడేళ్ల జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించవచ్చు. బాధిత మహిళకు మెయింటెనెన్స్ ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది.
► తాజా ట్రిపుల్ తలాక్ బిల్లుపై గురువారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. ఈ చర్చ నాలుగు గంటల పాటు కొనసాగింది.
► ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించడాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. దీనివల్ల మహిళలకే నష్టం కలుగుతుందని వాదించాయి. తలాక్ చెప్పిన భర్తకు జైలు శిక్ష విధించకూడదన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. నిందితుడిని బెయిల్‌పై విడుదల చేసే అధికారం స్థానిక పోలీసు అధికారికి కాకుండా, మేజిస్ట్రేట్ స్థాయి అధికారికే ఉండాలన్న విజ్ఞప్తినీ ప్రభుత్వం తోసిపుచ్చింది.
► ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశముందన్న విపక్షాల ఆందోళనలతో.. ప్రభుత్వం ఈ బిల్లులో మూడు సవరణలను ప్రతిపాదించింది. అవి
1. బాధిత మహిళ కానీ, ఆ మహిళ దగ్గరి బంధువు కానీ తక్షణ తలాక్ చెప్పిన భర్తపై పోలీసు కేసు పెట్టాలి.
2. దంపతులిద్దరూ రాజీకి వస్తే ఆ మహిళ కేసును ఉపసంహరించుకోవచ్చు.
3. బాధిత మహిళ వాదన విన్నాకే ఆ భర్తకు బెయిల్ ఇవ్వాలో, వద్దో మేజిస్ట్రేట్ నిర్ణయించాలి.
ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ ఈ సెప్టెంబర్‌లో కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.
గత సంవత్సరం ఆగస్ట్‌లో ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ట్రిపుల్ తలాక్ నిరంకుశ విధానమని, అది ఇస్లామిక్ సంప్రదాయం కాదని, ఇస్లాం మత విధానాల్లో ట్రిపుల్ తలాక్ భాగం కాదని 3–2 మెజారిటీతో అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ బిల్లు ప్రమాదకరం
విపక్షాలు, హక్కుల కార్యకర్తల ఆందోళన
న్యూఢిల్లీ: లోక్‌సభ ఆమోదించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుపై ముస్లిం సంస్థలు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎక్కువమంది ఈ బిల్లును వ్యతిరేకించగా కొందరు మాత్రమే స్వాగతించారు.
ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం చేయాలి: ఒవైసీ
స్వలింగ సంపర్కం నేరం కాదంటున్న ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ నేరం అని వాదించడం వెనుక గల ఉద్దేశాన్ని వెల్లడి చేయాలని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ట్రిపుల్‌తలాక్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో ఒవైసీ మాట్లాడారు. ‘అక్రమసంబంధాలు నేరం కాదన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకోకుండా పురుషులను ఆపే పరిస్థితులు లేవు. అలాంటప్పుడు ట్రిపుల్ తలాక్ మాత్రం నేరమని అంటున్నారు. స్వలింగ సంపర్కం నేరం కానపుడు ట్రిపుల్ తలాక్ నేరం ఎలా అవుతుంది? ఈ బిల్లును ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగానే తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని సెక్షన్–377 ప్రకారం లింగపరమైన మైనారిటీలకు హక్కులున్నప్పడు, మతపరమైన మైనారిటీలకు ఎందుకు ఉండవు? మీ విశ్వాసం మీకున్నప్పుడు. మా విశ్వాసం కూడా మాదే అవుతుంది. మీ (ప్రభుత్వం) ఉద్దేశం సరిగా లేదు’ అని అన్నారు.
ఎన్నికల దృష్టితో తెచ్చిన బిల్లు: కాంగ్రెస్
వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తలాక్ బిల్లు తెచ్చిందని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ‘సంబంధిత వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయి. ట్రిపుల్ తలాక్ బిల్లులో మాదిరి కఠిన నిబంధనలు మరే చట్టంలోనూ లేవు. ఈ బిల్లును ఆమోదించటానికి ముందుగా పార్లమెంట్ జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి అభిప్రాయం తీసుకోవాలి’ అని కోరారు.
నేర పూరితం అనడం తగదు: కారత్
వ్యక్తిగత అంశాన్ని కూడా నేరం అనడం తగదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అభిప్రాయపడ్డారు. ‘ఏ మతం కూడా ఇలాంటి కారణంపై అరెస్టు చేయాలని చెప్పలేదు. ముస్లిం మహిళల హక్కులను కాపాడటానికి బదులుగా మైనారిటీల్లో విభేదాలను సృష్టించడమే ఈ బిల్లు వెనుక ప్రభుత్వ వాస్తవ ఉద్దేశం. ఈ బిల్లు వల్ల ముస్లిం మహిళలకు మరిన్ని కష్టాలు తప్పవు’ అని ఆమె పేర్కొన్నారు.
ఒక్కోమతానికి ఒక్కో చట్టమా?
మతాన్ని బట్టి చట్టాలు ఎలా మారుతాయని ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ సెక్రటరీ కవితా కృష్ణన్ ప్రశ్నించారు. ‘భార్యను వదిలివేయడం వంటి చర్యలకు ముస్లిమేతరులు పాల్పడితే నేరం కానప్పుడు, ముస్లింలైతే నేరం ఎందుకు అవుతుంది’ అని అన్నారు.
న్యాయ మంత్రి బదులివ్వలేకపోయారు
‘ఈ బిల్లులోని అంశాలపై ప్రతిపక్షాలు అడిగిన అనేక ప్రశ్నలకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానాలు చెప్పలేకపోయారు. కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే ప్రభుత్వం ఉద్దేశం’ అని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు ఆస్మా జెహ్రా ఆరోపించారు. తలాక్‌ను ప్రభుత్వం లేకుండా చేసినప్పుడు ఇంకా చర్చ ఎందుకని ఆల్ ఇండియా ఉలేమా కౌన్సిల్ కార్యదర్శి మౌలానా మహ్మూద్ దర్యాబా దీ ప్రశ్నించారు. తలాక్ చెప్పిన కారణంగా భర్త జైలుకు వెళితే, ఎలాంటి ఆర్థిక ఆసరాలేని అతని భార్య, సంతానం సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. ఈ బిల్లును ‘భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్’ సంస్థ సభ్యురాలు స్వాగతించారు. బహుభార్యత్వం, చిన్నారుల సంరక్షణ వంటి అంశాల్లో స్పష్టత తెచ్చేందుకు హిందూ వివాహ చట్టం మాదిరిగా ముస్లిం వివాహ చట్టాన్నీ తేవాలన్నారు.
సుప్రీం ఏం చెప్పింది?
ముస్లింలు పాటిస్తున్న ట్రిపుల్ తలాక్ (తలాక్ ఏ బిద్దత్) సంప్రదాయం చెల్లదనీ, అది రాజ్యాంగవిరుద్ధమని 2017, ఆగస్టు 22న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3–2 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసేందుకు అనుకూలంగా జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ తీర్పు ఇవ్వగా, అప్పటి సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ మెజారిటీ తీర్పుతో విభేదించారు. ట్రిపుల్ తలాక్‌పై ఆర్నేల్లు నిషేధం విధించాలనీ, ఆలోగా కేంద్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకురావాలని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ చివరికి ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఖేహర్ 395 పేజీల తీర్పును వెలువరించారు. ఈ సందర్భంగా జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నారిమన్, జస్టిస్ యు.యు.లలిత్ మెజారిటీ తీర్పును వెలువరిస్తూ..‘ట్రిపుల్ తలాక్ ఆచారంలో భాగమైనప్పటికీ అది లోపభూయిష్టమైనది. పునరాలోచనకు ఆస్కారం లేకుండా వెనువెంటనే చెప్పేసే ట్రిపుల్ తలాక్ కారణంగా వివాహబంధాలు విచ్ఛిన్నం అవుతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)ను ఇది ఉల్లంఘించడమే’ అని ముగ్గురు జడ్జీలు మెజారిటీ తీర్పు ఇచ్చారు.
‘తమకు న్యాయం చేయాలంటూ ముస్లిం మహిళలు న్యాయస్థానం మెట్లు ఎక్కితే చేతులు ముడుచుకుని కూర్చోవడం కోర్టులకు సాధ్యం కాదు. తలాక్ ఎ బిద్దత్ సహా మూడు రకాల విడాకులను ముస్లిం పర్సనల్ అప్లికేషన్ చట్టం–1937లో చేర్చడంతో పాటు గుర్తింపునిచ్చారు. షరియా చట్టంలో చేర్చినంత మాత్రాన అది ప్రాథమిక హక్కులకు అతీతమైనదేమీ కాదు. రాజ్యాంగరచన కంటే ముందు లేదా తర్వాత రూపొందిన ఏ చట్టమైనా సరే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని రాజ్యాంగంలోని ఆర్టికల్ 13(1) చెబుతోంది. ముస్లిం పురుషుడు ఇష్టానుసారం, జవాబుదారీతనం లేకుండా ఏకపక్షంగా తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు తలాక్ ఆస్కారం కల్పిస్తోంది’ అని తన తీర్పులో జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ పేర్కొన్నారు.
తలాక్ బిల్లుకు సంబంధించి లోక్‌సభ డిస్‌ప్లే బోర్డుపై కనిపిస్తున్న ఓట్లు
లోక్‌సభలో బిల్లుపై మాట్లాడుతున్న రవిశంకర్ ప్రసాద్, మల్లికార్జున్ ఖర్గే, అసదుద్దీన్ ఒవైసీ
‘తలాక్’ బిల్లుకు లోక్ సభ ఓకే
Published Fri, Dec 28 2018 4:25 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment