కోటి దాటిన ‘డిజిధన్ అభియాన్’ శిక్షణదారులు
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపులపై అవగాహన పెంచే కార్యక్రమం ‘డిజిధన్ అభియాన్’లో కేవలం 20 రోజుల్లోనే సుమారు కోటికి పైగా గ్రామీణులు చేరారని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం తెలిపారు. ‘డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై ఉమ్మడి సేవా కేంద్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో 80 లక్షల మంది ప్రజలు, 25 లక్షల మంది వ్యాపారులకు చేరువకావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దాన్ని అదిగమించి 20 రోజుల్లోనే 1.05 కోట్ల ప్రజలకు శిక్షణ అందించామ’ని చెప్పారు.
476 జిల్లాలు, 2782 బ్లాకుల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 15 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో నమోదుచేసుకున్నారు. 12.5 లక్షల మందితో ఛత్తీస్‌గఢ్ తరువాతి స్థానంలో నిలిచింది. పెద్దనోట్ల రద్దు తరువాత డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి.
నవంబర్ 8–డిసెంబర్ 26 మధ్య కాలంలో రూపే కార్డు లావాదేవీలు 445 శాతం వృద్ధి చెందాయి. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) చెల్లింపుల పరిమాణం 95 శాతం ఎగబాకింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 3 లక్షల మంది వ్యాపారులు డిజిటల్ రూపంలో చెల్లింపులు స్వీకరించడం ప్రారంభించారు. డిజిటల్ వ్యవస్థను పటిష్టపరచడానికి సమాచార సాంకేతికత(ఐటీ) చట్టాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ప్రసాద్ పేర్కొన్నారు.